విశాఖలో ఆక్సిజన్.. విజయనగరంలో విషాదం! ఈ పాపం ఆయనదే..నా?
posted on Apr 26, 2021 @ 11:34AM
పక్కనే మంచి నీటి చెరువు. ఒడ్డున ఉన్న వాళ్లు దాహంతో మృతి. అచ్చం ఇలానే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్‌లో. విజయనగరం మహారాజా ఆసుపత్రిలో కొవిడ్ పేషెంట్స్ ఆక్సిజన్ కొరతతో చనిపోవడం బాధాకరం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. పక్కనే ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో.. టన్నులకు టన్నులు మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది. ఇక్కడి నుంచి యావత్ దేశానికి ప్రాణ వాయువు సరఫరా జరుగుతోంది. అయినా, విశాఖ పక్కనే ఉన్న విజయనగరంలో ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు వదలడాన్ని ఏమనాలి? ఇంకేమనుకోవాలి? ఈ తప్పు ఎవరిది? ఆ పాపం ఇంకెవరిది? నిస్సందేహంగా పాలకులదే. ప్రజల ప్రాణాలు పోతున్న పట్టకుండా.. చేతగాక, చేతులెత్తేస్తున్న.. ఈ అసమర్థ సర్కారుదే. నారా లోకేశ్ మాటల్లో చెప్పాలంటే.. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డిదే ఈ నేరం.. ఈ పాపం.
మహారాజా ఆసుపత్రిలో 290 మంది కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. అందులో 25మంది ఐసీయూలో ఉన్నారు. వారికి అత్యవసర చికిత్స చేస్తూ.. ఆక్సిజన్ అందిస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి రోగులకు సడెన్‌గా ఆక్సిజన్ అందలేదు. ఆక్సిజన్ లేక పలువురు రోగుల ప్రాణాలు పోవడం కలకలంగా మారింది. ఆక్సిజన్ ప్రాబ్లమ్‌తో ఇద్దరు మాత్రమే చనిపోయారంటున్నారు విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్. కాదు, మా కళ్ల ముందే నలుగురు చనిపోయారని చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు. మృతుల సంఖ్య 10 వరకూ ఉండొచ్చంటూ ప్రచారమూ జరుగుతోంది. వివాదమూ చెలరేగుతోంది.
మృతులంతా ఆక్సిజన్ లేకనే చనిపోయారనేది వాస్తవం. పైపులు పగిలి, ఆక్సిజన్ ప్రెజర్‌లో తేడా వచ్చి చనిపోయారని చెబుతున్నారు డాక్టర్లు. ఆక్సిజన్ కొరత లేదనేది వారి మాట. అయితే, బాధితుల వర్షన్ మరోలా ఉంది. హాస్పిటల్‌లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. అందుకే, తాము బయటి నుంచి ఆక్సిజన్ సిలండర్స్ కొనుక్కొచ్చి తమ వారికి అందిచ్చామని అంటున్నారు. ఆక్సిజన్ దొరక్కే వారు చనిపోయారని అక్కడి వాళ్ల ఆరోపణ.
ఓవైపు దేశవ్యాప్తంగా పలు హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ కొరతతో పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు వదులుతున్నారు. ఈ ఘటనలు అన్ని రాష్ట్రాలను, అన్ని ఆసుపత్రులకు హెచ్చరిక లాంటివి. వాటిని చూసైనా మన పాలకులు అప్రమత్తంగా ఉండాల్సింది. ఆక్సిజన్ సరఫరాపై నిరంతరం పర్యవేక్షణ చేయాల్సింది. అలాంటిది, పాలకుల ఉదాసీనత వల్లే విజయనగరం, మహారాజా ఆసుపత్రిలో రోగులు ప్రాణాలు కోల్పోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారంలో అంత పెద్ద మొత్తంలో ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతూ.. వివిధ రాష్ట్రాలకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లతో విశాఖ ఆక్సిజన్‌ను భారీగా తరలిస్తూ.. దేశానికి మన విశాఖ ఊపిరి పోస్తుంటే.. ఆదే ఆక్సిజన్ అందక.. మన విజయనగరం బిడ్డలు బలి అవడమేంటనే ప్రశ్నలు సర్కారును నిలదీస్తున్నాయి. ఇది సీఎం జగన్‌రెడ్డి చేతగానితనం కాక మరేమిటని విపక్షం నిగ్గదీసి అడుగుతోంది.
సకాలంలో ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే జగన్ రెడ్డి చోద్యం చూస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక రోగులు మృతి బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు తరలిపోతోందన్నారు. ఆక్సిజన్ బ్లాక్‌లో అమ్ముకుంటున్న కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని.. ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.