కరోనాకు కొబ్బరినూనె.. కొవిడ్ వార్డుల్లో మత ప్రచారం.. ఇదేమి రాజ్యం?
posted on Apr 26, 2021 @ 12:51PM
కొవిడ్‌కు ఇంత వరకూ మందే లేదు. వ్యాక్సిన్ ఒక్కటే నివారణ మార్గం. కరోనాకు మందు కనుగొనేందుకు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలంతా విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయినా, ఆ మాయదారి మహమ్మారికి మందు చిక్కడం లేదు. అలాంటిది.. జస్ట్ కొబ్బరి నూనె రాస్తే చాలు.. కరోనా తగ్గిపోతుందంటూ ఓ బ్యాచ్ రంగంలోకి దిగిపోయింది. అది అలాంటిలాంటి మామూలు కొబ్బరినూనె కాదు. దేవుడి నూనె. ఆ నూనె తలకు రాసి.. ప్రార్థనలు చేస్తే కరోనా నయమవుతుందంటూ కాకినాడ జీజీహెచ్ కొవిడ్ వార్డుల్లో మత ప్రచారం నిర్వహిస్తుండటం కలకలం రేపుతోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్ కొవిడ్ వార్డుల్లో మత ప్రచారం జోరుగా సాగుతోంది. కొబ్బరినూనెను తలకు రాసి ఓ ముఠా ప్రార్థనలు చేస్తోంది. ప్రార్థనతో వ్యాధి నయం అవుతుందని హితోక్తులు చెబుతోంది. ఆసుపత్రి సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా మత ప్రచారం సాగుతోంది. జనరల్, సర్జికల్ వార్డుల్లోనూ కొబ్బరి నూనె రాస్తూ సదరు ముఠా ప్రార్థనలు నిర్వహిస్తోంది. రాత్రి వేళల్లోనూ మత ప్రచారం నిర్వహిస్తూ కొందరు మహిళలు ప్రార్థనలు చేస్తున్నారు. అయితే వార్డుల్లోకి రాకూడదని ఆస్పత్రి సిబ్బంది వారించినప్పటికీ... ‘నువ్వు ఎక్స్‌ట్రాలు మాట్లాడకు.. నా ఇష్టం.. నేను వస్తానంతే’ అని ఆ మహిళ హెచ్చరించడం ఆ వీడియోలో ఉంది. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరిడెంట్ గానీ.. అధికారులు ఇంతవరకూ స్పందించలేదు. అంటే, పాలకులు, అధికారులే పరోక్షంగా ఈ మత ప్రచారానికి సాయపడుతున్నారా? అనే అనుమానం.
కరోనాతో ఓవైపు ప్రాణాలు నిలుస్తాయో లేదో అనే ఆందోళన బాధితుల్లో. ఇదే మంచి అవకాశమంటూ.. ప్రాణ సంకటంలో ఉన్న వారిని ప్రార్థనలతో తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేయడం దారుణం. ఏపీలో పేట్రేగిపోతున్న మత మార్పిడిలకు నిదర్శనం. అందుకు, ఇదేనా సమయం? ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంత జరుగుతుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నట్టు? అంటే, వారిపై పెద్దల ఒత్తిడి ఉందా? అధికారంలో ఉన్నవారే కొవిడ్ వార్డుల్లో మత ప్రార్థనలను ప్రోత్సహిస్తున్నారా? అనే అనుమానం అందిరిలోనూ. మరి, దీనికి సర్కారు ఏం సమాధానం చెబుతుంది?