ఏపీలో సంపూర్ణ లాక్ డౌన్! మంత్రి నాని క్లారిటీ..
posted on Apr 26, 2021 @ 2:25PM
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి తీవ్రత అంతకంతకు పెరిగిపోతోంది. పరీక్షలు చేస్తున్న ప్రతి నలుగురిలో ఒకరిక పాజిటివ్ వస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. కొన్ని రోజులుగా రోజుకు 12 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్ కొరతతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. విజయనగరం మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు రోగులు చనిపోవడం కలకలం రేపుతోంది.
ఏపీలో ప్రస్తుతం నెట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అయినా కేసులు మాత్రం తగ్గడం లేదు. దీంతో ఢిల్లీ తరహాలోనే ఏపీలోనూ సంపూర్ణ లాక్ డౌన్ పెట్టాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఏపీలో లాక్ డౌన్ పెట్టబోతున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. లాక్ డౌన్ వార్తలపై స్పందించిన వైద్య శాఖ మంత్రి అళ్ల నాని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో లాక్ డౌన్ పెట్టే పరిస్థితి ఉండదని స్పష్టం చేసిన నాని.. ఈసారి మాత్రం అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పూర్తి స్తాయి లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రాలేదన్నారు. అలాంటి మార్గదర్శకాలు వస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. లాక్ డౌన్ పై ఆళ్ల నాని చేసిన తాజా వ్యాఖ్యలతో ఏపీలోనూ సంపూర్ణ లాక్ డౌన్ పెట్టే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు.
రాష్ట్రంలో కరోనా తీవ్రత, చికిత్స, కట్టడి చర్యలపై వైద్యశాఖ అధికారులతో మంత్రి ఆళ్లనాని సమీక్ష నిర్వహించారు.కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ కోసం చాలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. పదివేల పరీక్షలు చేస్తున్నామని చెప్పారు..3000 బెడ్లు పెంచుతున్నామన్నారు. కోవిడ్ కేర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమ్ డెసివిర్, ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తామని ప్రకటించారు. ప్రజలు భాగస్వామ్యంతో కరోనాపై నియంత్రణ సాధించగలమన్నారు. రాష్ట్రానికి 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని మంత్రి చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తెప్పిస్తున్నామన్నారు. ఆక్సిజన్ వృథాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రెమిడెసివిర్ కొరత లేదన్నారు. రెమిడెసివిర్ కొరత లేకుండా చూసేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తున్నామన్నారు. 30 శాతం ఆక్సిజన్ వృథా అవుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు ఆళ్ల నాని.