పొడుస్తున్న కొత్త పొద్దు? ఆ నలుగురితో పోరు తెలంగాణమా?
posted on May 1, 2021 @ 2:03PM
రేపే, మాపో టీఆర్ఎస్ నుంచి ఈటల అవుట్. ఇది పక్కా. మరి, వాట్ నెక్ట్స్? అంటే వెరీ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణ పొద్దుపై కొత్త పార్టీ పొడుస్తోంది. పోరుబిడ్డ ఈటల.. కొత్త పార్టీ సన్నాహాల్లో ఉన్నారట. పార్టీ ఏర్పాటుకు ఎప్పటి నుంచో సన్నాహాలు చేస్తున్నారట. అందుకే, గులాబీ బాస్ కేసీఆర్ నియంతృత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారని చెబుతున్నారు. గులాబీ జెండాకు గులాంలు కాదు.. ఓనర్లం అనేంత సాహసం ఆయన అందుకే చేశారని అంటున్నారు. ఈటల కొత్త పార్టీ ఏర్పాట్లపై వివిధ వర్గాల నుంచి అందిన సమాచారంతోనే ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపించే కార్యక్రమం మొదలైందని తెలుస్తోంది. ఆపరేషన్ ఈటలలో భాగంగానే.. ఈటలపై మీడియాలో భూకబ్జా ఆరోపణలు.. విచారణ.. ఆ తర్వాత దోషిగా నిర్ధారణ జరిగిపోతుందని అంటున్నారు.
కేసీఆర్ అటాక్ ఇలానే ఉంటుందని తెలియనంత అమాయకుడేమీ కాదు ఈటల రాజేందర్. పార్టీ ఏర్పాటు నుంచి గులాబీ బాస్‌తో కలిసి పని చేసిన నేత. టీఆర్ఎస్ ఉనికే లేని రోజుల్లో కూడా పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించిన లీడర్. కేసీఆర్ కుటుంబం హవాలో ఈటల ప్రాధాన్యం కనుమరుగైంది కానీ.. ఈటల చాలా గట్టి పిండమేనని తెలంగాణవాదులందరికీ తెలుసు. ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా కేసీఆర్ ముందు తాను మినుగురు పురుగులా పడి ఉండటం ఈటలకు అస్సలు ఇష్టం లేదట. కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, పాలనా తీరుపై ఆయన ఎప్పటి నుంచో అసహనంతో రగిలిపోతున్నారనేది ఆయన సన్నిహితుల మాట. దొరల పాలనలో బీసీలకు ఎన్నడూ న్యాయం జరగదని.. బడుగు, బలహీన వర్గాలకు అధికారం దక్కాలని ఈటల బలంగా కోరుకుంటున్నారు. అందుకే, బీసీ ఎజెండాతో త్వరలోనే ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారని అంటున్నారు. కొత్త పార్టీపై ఇప్పటికే పలువురు ప్రముఖులతో ఆయన పలుమార్లు మంతనాలు జరిపారని.. వారంతా కలిసి.. తెలంగాణ గడ్డపై కొత్త పార్టీతో ముందుకు రాబోతున్నారని చెబుతున్నారు. ప్రచారంలో ఉన్న ప్రముఖుల పేర్లు ఆసక్తిగా ఉన్నాయి.
ఈటల రాజేందర్.. కోదండరాం.. తీన్మార్ మల్లన్న.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. నలుగురూ హేమాహేమీలు. ఆ నలుగురు కలిసి ఇప్పుడు కొత్త పార్టీ సన్నాహాల్లో ఉన్నారని సమాచారం. కొంత కాలంగా వీరి మధ్య రహస్య సమావేశాలు జరుగుతున్నాయట. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈటల వీరికి సహకరించారని చెబుతున్నారు. సరిగ్గా.. ఎమ్మెల్సీ ఎన్నికలు ముందు.. కీలక సమయంలో.. ఈటల రాజేందర్ తన గన్‌మెన్లకు మస్కా కొట్టి ఇంట్లో నుంచి రహస్య ప్రదేశానికి వెళ్లారంటూ అప్పట్లో వార్తలు రావడం వెనుక కారణం ఇదేనని అంటున్నారు. అందుకే, ఈటల భూకబ్జాలపై ఆరోపణలు రాగానే.. కోదండరాం, తీన్మార్ మల్లన్నలు వెంటనే స్పందించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తాము సిద్ధమని కోదండరాం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరితో కలిసి ఉద్యమాన్ని ప్రారంభించాల్సి ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా పార్టీ ఏర్పాటుపై లీకులని అంటున్నారు. ఉద్యమ కాలం నుంచి కోదండరాం సార్‌కు, ఈటలకు మంచి సంబంధాలు ఉన్నాయి. సార్‌ను కేసీఆర్ తొక్కేయడంపై ఈటల పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారని అంటారు. కోదండరాం.. ఏ ఒక్క వర్గానికో పరిమితమైన నాయకుడు కాదు. తెలంగాణవాదులందరికీ ఇప్పటికీ ఆయన సారు.
కోదండరాంతో పాటు అటు తీన్మార్ మల్లన్న సైతం ఈటలతో మొదటి నుంచి టచ్‌లో ఉన్నారని చాలా మంది అంటుంటారు. తీన్మార్ మల్లన్న యూట్యూబ్ ఛానెల్‌లో వచ్చే ప్రభుత్వ వ్యతిరేక ఇన్‌సైడ్ న్యూస్‌కు మేటర్ అంతా ఈటల నుంచే వస్తుంటుందనేది కొందరి మాట. మల్లన్న సైతం చాలాసార్లు ఈటల ఆధ్వర్యంలో బీసీల పార్టీ అంటూ లీకులు ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల టైమ్‌లో మల్లన్నకు పరోక్షంగా ఈటల చాలా సాయం చేశారని కూడా అంటున్నారు. ఈటల రాజేందర్, తీన్మార్ మల్లన్నలను బీసీ ఎజెండా ఏకం చేసిందని చెబుతారు. పార్టీ ఏర్పాటు, జెండా, ఎజెండాలపై ఈ ఇద్దరి మధ్య అనేక దఫాలుగా చర్చలు జరిగాయని సమాచారం.
ఇక, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిఖార్సైన నాయకుడిగా పేరున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సైతం ఈటలతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆయన ఓ ప్రకటనలో త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఆలోచిస్తున్నట్టు బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆ కొత్త పార్టీ వెనుకున్నది ఈటలేనని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు మరింత క్లారిటీ వస్తోంది. అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్‌లో ఇమడలేక ప్రస్తుతానికి తటస్థంగా ఉన్న కొండా.. ఈటల పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారనేది టాక్.
ఇలా.. ఈటల, కోదండరాం, తీన్మార్ మల్లన్న, కొండా.. నలుగురు భావసారూప్య నేతలంతా కలిసి కొత్త పార్టీతో తెలంగాణ రాజకీయాలను మార్చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈటల, మల్లన్న బీసీ కార్డుతో.. కోదండరాం ఉద్యమకారుల కార్డు,.. కొండా- రెడ్డి కార్డుతో.. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ చేస్తున్నారని అంటున్నారు. కొత్త పార్టీకి ఆర్.క్రిష్ణయ్య, గద్దర్‌లాంటి వాళ్ల మద్దతు కూడా ఉందట. ఇలా, తెలంగాణలో అన్ని వర్గాలను కూడగట్టి.. త్వరలోనే కొత్త పార్టీతో.. కేసీఆర్ సర్కారుపై దండయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారట ఆ నలుగురు... ఏమో.. గుర్రం ఎగరావచ్చు....