ఈటల తర్వాత హరీషే టార్గెటా? టీఆర్ఎస్ చీలిపోనుందా?
posted on May 1, 2021 @ 3:04PM
తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణలు రావడం.. సీఎం కేసీఆర్ ఆగమేఘాల మీద స్పందించి విచారణకు ఆదేశించడం అంతా సంచలనమే. అంతేకాదు 'రాజు తలుచుకోవాలే గానీ' .. అన్నట్టుగా ఈటల భూ కబ్జా ఆరోపణలపై జెట్ స్పీడ్‌లో అధికార యంత్రాంగం కదిలింది. తెల్లావారేసరికి రెవెన్యూ యంత్రాంగం విచారణకు దిగింది. గంటల్లోనే ప్రాథమిక విచారణ తొలి నివేదిక సీఎస్‌కు చేరిందని సమాచారం. మూడెకరాల అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ చేస్కుని బ్యాంకులో తాకట్టు పెట్టి ఋణం పొందినట్లు జిల్లా కలెక్టర్ హరీష్ నిర్దారించారని తెలుస్తోంది. పూర్ణచందర్ రావు రిపోర్ట్ కూడా రాత్రి లోపు సమర్పించే అవకాశం ఉందంటున్నారు. రాత్రి వరకు ఈటలను రాజీనామా చేయమని కేసీఆర్ ఆదేశించవచ్చనే చర్చ జరుగుతోంది.
కేసీఆర్ అనుకూల మీడియాలోనే ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడం, టీఆర్ఎస్ సొంత ఛానెల్ టీన్యూస్ లోనే గంటల కొద్ది ఈటలపై వార్తలు నడపడంతో.. ఆయనపై వేటు పడటం ఖాయమని తెలుస్తోంది. ఈటలకు చెక్ పెట్టేందుకే నాలుగేండ్ల క్రితం జరిగినట్లుగా చెబుతున్న భూబాగోతాన్ని బయటికి తీశారంటున్నారు. భూవ్యవహారంలో ఈటలను కేబినెట్ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈటల ఎపిసోడ్ తో తెలంగాణలో ఇప్పుడు మరో చర్చ జరుగుతోంది. ఈటల తర్వాత కేసీఆర్ టార్గెట్ ఎవరుంటారనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈటల తర్వాత మంత్రి హరీష్ రావే.. గులాబీ బాస్ టార్గెట్ అనే ప్రచారం జరుగుతోంది.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించారు హరీష్ రావు, రాజేందర్. ఉద్యమంలో కీలక పాత్ర వీరిదే. ముఖ్యమైన కార్యక్రమాలన్ని ఈ ఇద్దరు చేతులమీదుగానే సాగేవి. 2004 నుంచి 09 వరకు అసెంబ్లీ టీఆర్ఎస్ ఎల్పీ నేతగా వ్యవహరించారు ఈటల రాజేందర్. ముఖ్యమంత్రిగా మొదటి టర్మ్ లో ఈ ఇద్దరికి మంచి ప్రాధాన్యత ఇచ్చారు కేసీఆర్. ఈటలకు కీలకమైన ఆర్థిక శాఖ, హరీష్ రావు ఇరిగేషన్ శాఖ అప్పగించారు. అయితే 2018 వచ్చే సరికి సీన్ మారిపోయింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే హరీష్ , ఈటలను దూరం పెట్టారు కేసీఆర్. మంత్రివర్గంలోనూ చోటు కల్పించలేదు. పార్టీ కార్యక్రమాల్లోనూ వీరిద్దరి పాత్ర తగ్గిపోయింది. దీంతో నియోజకవర్గానికే పరిమితమయ్యారు హరీష్ రావు, ఈటల రాజేందర్. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలను దూరం పెట్టడంపై ఉద్యమకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ఏడాది తర్వాత జరిగిన విస్తరణలో హరీష్, ఈటలకు చోటు దక్కింది.
కేబినెట్ విస్తరణలో చోటు కల్పించిన కేసీఆర్ .. హరీష్ కు ఆర్థికశాఖ, ఈటలకు వైద్య శాఖ కట్టబెట్టారు. ప్రజల్లో తిరిగే హరీష్ కు ఆర్థికశాఖ ఇచ్చి అతని కాళ్లకు బంధం వేశారనే ప్రచారం జరిగింది. ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నా హరీష్ రావు.. కేవలం సిద్ధిపేట జిల్లా వరకే పరిమితమయ్యారు. కేసీఆర్ ఆదేశాల వల్లే అతను ఇతర జిల్లాలకు వెళ్లలేదని చెబుతారు. మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ హరీష్ సిద్దిపేట వరకే పరిమితమయ్యారు. దీంతో పార్టీలో హరీష్ కు అవమానం జరుగుతుందని, ఆయనకు పొమ్మనలేక పొగ బెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. హరీష్ రావు ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భారీగా అవినీతికి పాల్పడ్డారనే వార్తలు కూడా చక్చర్లు కొట్టాయి. దీని వెనుక కూడా కేసీఆర్ వర్గం హస్తం ఉందనే చర్చ జరిగింది. ఈటల, హరీష్ ను కావాలనే పార్టీలో అవమానిస్తున్నారని తెలంగాణ వాదులు భగ్గుమన్నారు. హరీష్, ఈటల కలిసి పొత్త పార్టీ పెట్టబోతున్నారని, బీజేపీలోకి వెళుతున్నారనే ప్రచారాలు కూడా జరిగాయి.
తాజాగా ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లే ఈటల రాజేందర్ ను సాగనంపే ప్రయత్నాలు టీఆర్ఎస్ లో జరుగుతున్నాయని అంటున్నారు. భూకబ్జా ఆరోపణలతో ఈటలను తప్పించడం ఖాయమంటున్నారు. ఈటలను సాగనంపాకా .. హరీష్ రావు టార్గెట్ గా గులాబీ ఆపరేషన్ మొదలవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ ను సీఎం చేయాలని భావిస్తున్న కేసీఆర్.. పార్టీలో సీనియర్లుగా ఉన్న నేతలను ఒక్కొక్కరిగా తప్పిస్తున్నారని , అందులో భాగంగానే మొదట ఈటలను టార్గెట్ చేశారంటున్నారు. ఈటల తర్వాత హరీష్ రావుకు చెక్ పెట్టేలా ఇప్పటికే వ్యూహం సిద్ధమైందని అంటున్నారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ లో ఊహించని పరిణామాలు జరుగుతాయని, గులాబీ పార్టీ చీలిపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.