తిరుగుబాటా? సరెండరా? ఈటల దారెటు..
posted on May 1, 2021 @ 1:16PM
మంత్రిపై భూకబ్జా ఆరోపణలు. అదీ ప్రతిపక్షం నుంచి కాకుండా సొంత మీడియా నుంచే. టీ న్యూస్ షురూ చేసింది. మిగితా పింక్ మీడియాలో హోరెత్తింది. ఇక అంతే. గంటల వ్యవధిలోనే తెలంగాణలో అధికార పార్టీ రాజకీయ ముఖచిత్రం అమాంతం మారిపోయింది. ఇలా ఆరోపణలు వచ్చాయో లేదో.. అలా విచారణ మొదలైపోయింది. అంతా వింతగా లేదూ. ఇది బ్రేకింగ్ న్యూసే అయినా.. షాకింగ్ న్యూస్ మాత్రం అసలు కానేకాదు. కేసీఆర్ వర్సెస్ ఈటల.. కొంత కాలంగా వారి మధ్య కోల్డ్‌వార్ అందరికీ తెలిసిందే. అదిప్పుడు.. ఇలా బ్లాస్ట్ అయింది అంతే. వాళ్ల పార్టీ వాళ్ల ఇష్టం అనుకున్నా.. ప్రస్తుత సమయం, సందర్భం సరిగాలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరోనాతో తెలంగాణ అల్లకల్లోలంగా మారింది. రోజుకు 10వేల వరకూ కేసులు వస్తున్నాయి. మరణాలు భారీగా పెరుగుతున్నాయి. వ్యాక్సినేషన్ నిదానంగా సాగుతోంది. ఆసుపత్రిలో బెడ్స్, ఆక్సిజన్ కొరతలాంటి సమస్యలతో తెలంగాణ అల్లాడిపోతోంది. ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఊపిరి సలపని పనులతో ఒత్తిడిలో ఉన్నారు. కరోనా సోకి కొంత కాలంగా సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో ఆరామ్‌సే ఉన్నారు. కొవిడ్ భారమంతా ఈటలపైనే ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో.. ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం మంత్రి ఈటలను టార్గెట్ చేసింది. ఆయన్ను పొమ్మనడానికి పొగ పెట్టింది. పార్టీ అంతర్గత సమస్యల పరిష్కారానికి.. ప్రజా సమస్యలను పక్కనబెట్టి రాజేందర్ ఇష్యూపై రచ్చ మొదలుపెట్టింది. భూకబ్జా ఆరోపణలతో విచారణ షురూ చేసింది. మీడియాలో కొవిడ్ వార్తలకంటే.. ఈటల బ్రేకింగ్ న్యూస్‌తో మారుమోగిపోయింది. ఆ వెంటనే అన్ని పనులు మానుకొని రాజేందర్ ప్రెస్‌మీట్ పెట్టడం.. అప్పటి నుంచి అంతా రాజకీయాలపైనే దృష్టి పెట్టడంతో.. కరోనా కట్టడి చర్యలు అటకెక్కాయి. ఈటలకు చెక్ పెట్టడం కోసం ఇలాంటి కొవిడ్ విపత్కర సమయాన్ని ఎంచుకోవటానికి.. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి, పచ్చి స్వార్థానికి నిదర్శనం.
ప్రభుత్వం పక్కా ప్లానింగ్‌తో ఈటలపై ఆరోపణలు సంధించింది. శుక్రవారం సాయంత్రం వరంగల్, ఖమ్మం కార్పొరేషన్స్‌తో సహా పలు మున్సిపాలిటీలకు పోలింగ్ ముగిసింది. ఇలా ఆఖరి గంట మోగిందో లేదో.. అలా టీవీల్లో ఈటల రాజేందర్ బ్రేకింగ్ న్యూస్ మొదలైపోయింది. అంటే, అంతా పక్కా టైమింగ్‌తో ముందే షెడ్యూల్ చేసిన న్యూస్‌తో ఈటలను కార్నర్ చేసినట్టు తెలిసిపోతోంది. ఇప్పటికే జీహెచ్ఎమ్‌సీ, ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఎన్నికలు ముగిశాయి. పెండింగ్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీ ఎన్నికలూ శుక్రవారంతో సమాప్తం అయ్యాయి. ఇక ఇప్పట్లో తెలంగాణలో ఎన్నికలు లేవు. మరో మూడేళ్ల వరకూ ఎలాంటి రాజకీయ హడావుడి ఉండదు. అందుకే, రెండేళ్లుగా భరిస్తూ వచ్చిన ఈటల రాజేందర్‌ను ఇక వదిలించుకోవాలని గులాబీ బాస్ భావించి ఉంటారు.
2019 ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేయడం.. సమయం చిక్కినప్పుడల్లా కేసీఆర్‌పై రెబెల్ జెండా ఎగరేస్తూ ఉండటంతో.. ఈ దఫా అసలు ఈటలకు మంత్రి పదవే రాదనుకున్నారు. కానీ, ఆఖరు నిమిషంలో ఆర్థికం కాకుండా ఆరోగ్యం ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకున్నారు. అయినా.. ఈటల అసంతృప్తి పలుమార్లు పైకి తన్నుకొస్తూనే ఉంది. తాము గులాబీ జెండాకు బానిసలం కాదు.. అసలైన ఓనర్లమంటూ.. కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్‌తో కాక రేపారు. అదే సమయంలో పార్టీ, ప్రభుత్వ అంతర్గత సమావేశ విషయాలు మీడియాకు, ప్రత్యర్థులకు లీక్ చేస్తున్నారంటూ ఈటలపై అనుమానపు చూపులు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి రాజేందర్‌ను దూరం చేశాయి.
కొత్త పార్టీ పెట్టడం పాన్ షాప్ పెట్టినంత ఈజీ కాదంటూ అప్పట్లో కేసీఆర్ చేసిన కామెంట్లు ఈటలను ఉద్దేశించేనని ఇప్పుడే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇక ఈటల అవుట్ అనే ప్రచారం స్టార్ట్ అయింది. పోలింగ్ ముగిసిన కొన్ని నిమిషాలకే.. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఆపరేషన్ ఈటల మొదలైపోయింది. ఈటల రాజేందర్ వ్యవహారంపై ఓ వారమో.. ఓ నెలో.. హడావుడి జరిగి ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోతుంది. మళ్లీ ఎన్నికలు వచ్చే మూడేళ్లలో రాజేందర్‌ను అంతా మర్చిపోయేలా చేయాలనేది కేసీఆర్ స్కెచ్‌లా కనిపిస్తోంది. అయితే.. గట్టి పిండమైన ఈటల.. ఈ మేటర్‌ను ఇక్కడితో వదిలేస్తారా? గతంలో నక్సలిజం చరిత్ర ఉండటం.. వందల కోట్లకు అధిపతి అవడం.. ఆయన్ను ఊరికే ఉండనిస్తాయా? త్వరలోనే ఈటల నేతృత్వంలో.. బీసీ ఎజెండాతో.. తెలంగాణ గడ్డపై కొత్త పార్టీ పొద్దు పొడవబోతుందనేది ఆఫ్ ది రికార్డ్ మాట. మరి, ఇలాంటి నాయకుల కోసమే ఎదురుచూసే కమలనాథులు.. ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెడతారా?
మరోవైపు మేడే సందర్బంగా సీఎం కేసీఆర్ ఫోటోతో కార్మికులకు విషెస్ చెబుతూ సందేశం విడుదల చేశారు ఈటల రాజేందర్. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు... కాని ఎక్కడా కేసీఆర్ ను విమర్శించలేదు. ఆయనకు గురించి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. దీంతో ఈటల తిరుగుబాటు చేస్తారా లేక సరెండర్ అవుతారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఏమో.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే...