ఈటలకు పోటీగా కొత్త నేత! ఏడాదిగా గులాబీ స్కెచ్
posted on May 1, 2021 @ 12:29PM
తెలంగాణ వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూకజ్జా ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం చర్చంతా ఈటల చుట్టే సాగుతోంది. ఈటలను మంత్రివర్గం నుంచి కేసీఆర్ సస్పెండ్ చేస్తారా? రాజేందరే మంత్రి పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తారా? ఈటల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? వీటిపైనే రాజకీయ వర్గాలతో పాటు జనాల్లోనూ చర్చ జరుగుతోంది. కేసీఆర్ అనుకూల మీడియాలోనే ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడం, టీఆర్ఎస్ సొంత ఛానెల్ టీన్యూస్ లోనే గంటల కొద్ది ఈటలపై వార్తలు నడపడంతో.. ఆయనపై వేటు పడటం ఖాయమని తెలుస్తోంది. ఈటల రాజేందర్‌ను ప్రభుత్వం నుంచే కాదు.. పార్టీ నుంచి కూడా బయటకు పంపించేందుకు సీఎం కేసీఆర్ పకడ్బందీ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది.
ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గమైన హుజురాబాద్‌లో ఆయనకు చెక్ పెట్టేందుకు బీజేపీ స్థానిక సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డిని టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. వారం క్రితమే పెద్దిరెడ్డి కేసీఆర్‌ను కలిసినట్టుగా సమాచారం. దీన్ని బట్టి ఈటలను బయటకు పంపించాలని కేసీఆర్ ముందు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతోంది.ఈటలను వెళ్లిన వెంటనే పెద్దిరెడ్డి గులాబీ గూటికి చేరుతారని చెబుతున్నారు. ఈటలను బయటకు పంపించి పెద్దిరెడ్డికి హుజురాబాద్ నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పెద్దిరెడ్డి.. మంత్రిగానే కాకుండా టీడీపీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత దేవేందర్ గౌడ్‌తో కలిసి నవ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఆ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేశారు. కొన్నాళ్లు మళ్లీ టీడీపీలోకి తిరిగివచ్చారు. తెలంగాణ వచ్చాక టీడీపీ బలం తగ్గిపోవడంతో.. ఇటీవలే ఆయన బీజేపీలో చేరారు.
నిజానికి ఈటల రాజేందర్ ను చాలా రోజులుగానే దూరం పెడుతున్నారు కేసీఆర్. రెండోసారి అధికారంలోకి వచ్చాకా ఏర్పాటు చేసిన కేబినెట్ లో ఈటలకు మొదట చోటు దక్కలేదు. ఏడాది తర్వాత జరిగిన విస్తరణలో ఈటలకు అవకాశం కల్పించారు కేసీఆర్. ఈటలకు మంత్రి పదవి ఇవ్వడం కేసీఆర్ కు ఇష్టం లేదని, ఉద్యమకారులను దూరం పెట్టారనే ఆరోపణలు ఎక్కువ కావడంతో బలవంతంగానే ఆయన్ను తీసుకున్నారని చెబుతున్నారు. మంత్రిపదవి ఇచ్చినా ఈటలతో కేసీఆర్ గ్యాప్ కొనసాగిందని తెలుస్తోంది. చాలాకాలం పాటు ఈటలకు కేసీఆర్ .. అపాయింట్ మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. అసెంబ్లీ జరిగిన సమయంలో ప్రగతి భవన్‌కు వెళ్లి రెండు గంటలు వెయిట్ చేసినా.. ఈటలకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈటలకు హుజురాబాద్ అసెంబ్లీ టికెట్ రాదనే ప్రచారం జరిగింది. తన భార్యకు అసెంబ్లీ టికెట్ ఇచ్చి... తాను కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తానని ఈటల అడిగినా కేసీఆర్ పట్టించుకోలేదంటారు. అయితే చివరి నిమిషంలో ఈటలకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికలో కొందరు టీఆర్ఎస్ నేతలు ఈటలకు వ్యతిరేకంగా పని చేశారని చెబుతారు. పార్టీ పెద్దల ఆశిస్సులు ఉన్న నేతలే ఇలా చేశారని ఈటల బహిరంగానే చెప్పారు. ఆ కోపంతోనే పలు సార్లు రాజేందర్.. టీఆర్ఎస్ , కేసీఆర్ టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు. గులాబీ జెండాకు తామే అసలైన ఓనర్లమని ఏడాది క్రితం ఈటల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అప్పుడే ఈటలను సాగనంపాలని కేసీఆర్ డిసైడయ్యారని, సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. కొవిడ్ కల్లోలం లేకుంటే ఏడాది క్రితమే ఈటలను సాగనంపే వారంటున్నారు.