ఈటల రాజేందర్ భర్తరఫ్? వైద్య శాఖను తొలగించిన సీఎం
posted on May 1, 2021 @ 2:03PM
తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో షాక్ ఇచ్చారు. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన శాఖపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి తనకు అటాచ్ చేసుకున్నారు. ఈ మేరకు సీఎం చేసిన సిఫారసుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమెదముద్ర వేశారు. గవర్నర్ ఆమోదముద్రతో శాఖ లేని మంత్రిగా ఈటల మిగిలిపోయారు.
వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణలు రావడం.. సీఎం కేసీఆర్ ఆగమేఘాల మీద స్పందించి విచారణకు ఆదేశించడం అంతా సంచలనమే. ఈటల భూ కబ్జా ఆరోపణలపై జెట్ స్పీడ్‌లో అధికార యంత్రాంగం కదిలింది. తెల్లావారేసరికి రెవెన్యూ యంత్రాంగం విచారణకు దిగింది. గంటల్లోనే ప్రాథమిక విచారణ తొలి నివేదిక సీఎస్‌కు చేరిందని సమాచారం. మూడెకరాల అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ చేస్కుని బ్యాంకులో తాకట్టు పెట్టి ఋణం పొందినట్లు జిల్లా కలెక్టర్ హరీష్ నిర్దారించారని తెలుస్తోంది. పూర్ణచందర్ రావు రిపోర్ట్ కూడా రాత్రి లోపు సమర్పించే అవకాశం ఉందంటున్నారు. రాత్రి వరకు ఈటలను రాజీనామా చేయమని కేసీఆర్ ఆదేశించవచ్చనే చర్చ జరుగుతోంది.