టీకాలేక్కుండా వ్యాక్సినేషన్ ఎలా? రెండు రోజుల్లో 3 కోట్ల రిజిస్ట్రేషన్లు..
posted on Apr 30, 2021 @ 5:14PM
మే 1 వతేదీ మూడో దశ వ్యాక్సినేషన్‌కు అనుమతించింది కేంద్రం. 18 ఏండ్లు నిండిన వారినీ టీకాకు అర్హులుగా ప్రకటించింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. కొవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు యాప్‌లో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. దేశంలో రోజు రోజుకు కొవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌కు స్పందన లభిస్తోంది. గురువారం వరకే 2.45 కోట్ల మంది లబ్ధిదారులు కొవిన్ ద్వారా పేర్లు నమోదు చేసుకున్నట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 28న 1.37 కోట్లకుపైగా పేర్లను నమోదు చేసుకోగా.. 29న 1.04 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
వ్యాక్సినేషన్ నమోదు ముమ్మరంగా సాగుతోంది కాని.. టీకా పంపిణి మాత్రం సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించటం లేదు. చాలా రాష్ట్రాల్లో 45 ఏండ్లు నిండినవారికే ప్రస్తుతం టీకాలు వేసే పరిస్థితి లేదు. వ్యాక్సిన్లు లేక టీకా కేంద్రాలనే మూసేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో చాలా వ్యాక్సినేషన్ సెంటర్లు క్లోజ్ చేశారు. టీకాలు లేకపోవడంతో మహారాష్ట్ర లోని ముంబైలో మూడు రోజులపాటు వ్యాక్సి నేషన్ నిలిపివేస్తున్నట్టు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. మే 1 నుంచి 18 ఏండ్లు నిండినవారికి చేపట్టాల్సిన టీకా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. టీకాలు వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్‌ను కొనసాగిస్తామని తెలిపింది.
ఢిల్లీ సర్కార్ వద్ద ప్రస్తుతం వేయటానికి టీకా అనేదే లేదని ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్రజైన్ ప్రకటించారు. ఉన్న వ్యాక్సిన్ నిల్వలు మొత్తం అయిపోయాయని వెల్లడించారు. వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న ప్రైవేటు కంపెనీలకు విజ్ఞప్తులు చేశామని, వాటి నుంచి స్పందన లభించిన తర్వాతే టీకాలు ఎప్పుడు వస్తాయో తెలియజేయగలమని పేర్కొన్నారు. టీకాలు అందుబాటులో లేనందున గుజరాత్, పంజాబ్, ఏపీ, తెలంగాణలోనూ 18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ వాయిదా పడింది. 45 ఏండ్లు దాటిన వారికి మాత్రమే టీకా వేస్తున్నప్పుడే పరిస్థితులు ఇలాఉంటే.. ఇక వారికి 18-44 ఏండ్లలోపు వాళ్లు కూడా కలిస్తే.. అసలు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇప్పుడున్నంత సజావుగానైనా జరుగుతుందా అని ఆరోగ్య నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
18-44 ఏండ్ల వయసువాళ్లు టీకా తీసుకోవాలంటే కొవిన్ పోర్టల్ ద్వారాగానీ, ఆరోగ్యసేతు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవటం తప్పనిసరి. అయితే, టీకా కోసం నిర్ణయించిన స్లాట్లు అందుబాటులో ఉంటేనే వారికి రిజిస్ట్రేషన్ చేసుకోవటం వీలవుతుంది. టీకా అందుబాటులో ఉంటేనే స్లాట్‌లు కేటాయిస్తారు. 18 ఏండ్లు నిండిన వారందరికీ టీకా కోసం అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కోట్లాదిమంది యువతీ యువకులు, నడి వయస్కులు వ్యాక్సిన్ కోసం తమ పేరును నమోదు చేసుకునే అవకాశం ఉంది. అటువంటప్పుడు ఇంతటి డిమాండ్‌ను తట్టుకునే స్థాయిలో టీకాలు అందుబాటులో ఉంటాయా? కంపెనీలు సరఫరా చేయగలవా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కేంద్రం ఏప్రిల్ 19న వ్యాక్సినేషన్ కొత్త నిబంధనలను ప్రకటించింది. అప్పటివరకూ 45 ఏండ్లు నిండినవారే కరోనా టీకా తీసుకోవటానికి అర్హులుకాగా.. కొత్త నిబంధనల ప్రకారం.. అర్హుల వయస్సును 45 నుంచి 18 ఏండ్లకు తగ్గించింది. అంతేకాదు, వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న కంపెనీల నుంచి టీకాలను స్వయంగా కొనుగోలు చేసుకోవటానికి రాష్ట్రప్రభుత్వాలకు, ప్రైవేటు దవాఖానలకు అనుమతించింది. మే 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీని ప్రకారం.. ఏప్రిల్ 28 నుంచి కొత్త లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 19 నుంచి మే 1 వరకూ 11 రోజుల గడువున్నా.. కేంద్రం ఇటు రాష్ట్రాలను, అటు వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలను సమన్వయం చేసుకొని, ప్రణాళికలను సిద్ధం చేసుకోలేదు. ఇకనైనా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎక్కడికక్కడ సమన్వయంతో టీకాల పంపిణీ, సరఫరా, వ్యాక్సినేషన్‌పై పని చేసి, పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తేనే విస్తృత వ్యాక్సినేషన్ సాధ్యమతుందని నిపుణులు సూచిస్తున్నారు.