వర్సిటీలో చిరుత సంచారం.. భయాందోళనల్లో విద్యార్థులు.. పట్టించుకోని అధికారులు
posted on Nov 12, 2022 9:14AM
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం విద్యార్థులను భయాందోళనలకు గురి చేస్తున్నది. వర్సిటీ ప్రాంగణంలో గత నెల రోజులుగా చిరుత సంచరిస్తోందన్న సమాచారం విశ్వవిద్యాలయ అధికారులకు తెలిపినప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వర్సిటీలోని హెచ్ బ్లాక్, కామర్స్ డిపార్ట్ మెంట్ పరిసర ప్రాంతాలలో చిరుత సంచారాన్ని విద్యార్థులు గమనించారు. అది సంచరిస్తున్న సమయంలో ఫొటోలు వీడియోలు తీసి వర్సిటీ అధికారులకు సమాచారం అందించారు.
మూడు రోజుల కిందట ఐ బ్లాక్ వద్ద కుక్కను తరుముకుంటూ వచ్చిన చిరుతను చూసి విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఐ బ్లాక్ తలుపులు మూసి గట్టిగా కేకలు వేయడంతో చిరుత సమీపంలోని ఖాళీ స్థలంలోకి వెళ్లి పోయింది. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులకు వర్సిటీ అధికారులు సమాచారం అందించి చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.