రాజీవ్ హంతకులు విడుదలకు సుప్రీం ఆదేశం
posted on Nov 11, 2022 @ 3:21PM
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులందరినీ విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. 2022 మే 18న ఏజీ పెరరివలన్‌ను విడుదల చేస్తూ తీర్పు చెప్పడానికి అనుసరించిన విధానమే మిగిలిన దోషుల విడుదల విషయంలో కూడా అమలు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం పేర్కొంది.
జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్న లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. రాజీవ్ హత్య కేసులో ఆరుగురు దోషులు జీవిత ఖైదును అనుభవిస్తున్న సంగతి విదితమే
సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఎస్ నళిని, జయకుమార్, ఆర్‌పీ రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్‌లకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. వీరంతా జైలులో మంచి నడవడికతో ప్రవర్తించారని, అంతేకాకుండా వేర్వేరు డిగ్రీలు సాధించారని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది.
ఈ దోషులను జైలు నుంచి విడుదల చేయాలని 2018 సెప్టెంబరు 9న తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసిందని, తమకు శిక్ష తగ్గించాలని ఆ రాష్ట్ర గవర్నర్‌కు దోషులు విజ్ఞప్తి చేశారని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజీవ్ గాంధీహత్య కేసులోని దోషుల్లో ఒకరైన నళిని ప్రస్తుతం పెరోల్‌పై ఉన్నారు. ఆమె పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. అనంతరం ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 30 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన ఏజీ పెరరివలన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో నళిని ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.