మరో మారు మోడీ.. పవన్ బేటీ.. నేడూ విశాఖలోనే జనసేనాని?
posted on Nov 12, 2022 @ 10:04AM
ప్రధాని నరేంద్రమోడీతో జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖలో శుక్రవారం (నవంబర్ 11) భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఏపీకి మంచి రోజులు అని పవన్ మీడియాతో చెప్పారు. దీంతో ఇరువురి మధ్యా చర్చలు సహృద్భావ వాతావరణం జరిగాయని అంతా భావించారు. అయితే ఆ తదననంతర పరిణామాలను గమనిస్తే శుక్రవారం(నవంబర్ 11) ఇరువురి మధ్యా చర్చలు అసంపూర్తిగా ముగిశాయని అర్ధమౌతుంది. ఇరువురూ శనివారం(నవంబర్ 12) మరో సారి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయనీ చెబుతున్నారు. అందుకే పవన్ కల్యాణ్ ఇంకా విశాఖలోనే ఉన్నారనీ మోడీతో ఆయన మరో సారి భేటీ అవుతారనీ అంటున్నారు.
మొత్తం మీద పవన్ తో భేటీ, బీజేపీ రాష్ట్ర నాయకులతో భేటీ, రోడ్ షోలతో ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఆద్యంతం రాజకీయంగా ఆసక్తి, ఉత్కంఠ రేపుతోంది. మోడీ విశాఖ పర్యటన ఏర్పాట్లన్నీ ఏపీ సర్కార్ స్వయంగా దగ్గరుండి చూసుకోవడం, ప్రధాని సభకు జనసమీకరణ కూడా జగన్ సర్కారే ముందుండి ఏర్పాట్లు చేయడం సర్వత్రా ఆసక్తి రేకెత్తించింది. అదే సమయంలో చివరి నిముషంలో ప్రధాని మోడీ తో భేటీకి పీఎంవో నుంచి పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
విశాఖలో నిర్వహించిన రోడ్ షో, పవన్ కళ్యాణ్ తో ఐఎన్ఎస్ చోళలో భేటీ, అనంతరం బీజేపీ కోర్ కమిటీతో భేటీ.. ఆ తరువాత శుక్రవారం (నవంబర్ 12) సీఎం జగన్ తో భేటీ.. ఇవన్నీ కూడా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలే కావడంతో మోడీ ప్రధానిగా ఈ పర్యటనకు వచ్చారా లేక పార్టీ అగ్రనేతగా పర్యటిస్తున్నారా అన్నఅనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అలా ఉంచితే.. శుక్రవారం రాత్రి పవన్ తో బేటీ తరువాత కూడా పవన్ విశాఖలోనే బస చేయడం రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది.
విశ్వసనీయ సమాచారం మేరకు ప్రధాని మోడీయే స్వయంగా పవన్ కల్యాణ్ ను శుక్రవారం కూడా అందుబాటులో ఉండాలనీ, మరో సారి బేటీ అవుదామనీ చెప్పారు. శుక్రవారం ప్రధాని మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఐఎన్ఎస్ చోళ గెస్ట్ హౌస్ లో భేటీ అయ్యారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం, అంటే మోడీ అప్పాయింట్ మెంట్ మేరకు ఇరువురు నేతల మధ్య భేటీ పావుగంటలో ముగియాల్సి ఉంది. అయితే అది అలా ఎక్సటెండ్ అవుతూ దాదాపు 35 నిముషాల పాటు సాగింది. అయితే అది కూడా అసంపూర్తిగానే ముగియడంతో.. మోడీ శనివారం (నవంబర్ 12) మరో సారి కలుద్దాం అందుబాటులో ఉండండి అని పవన్ కు చెప్పినట్లు తెలుస్తోంది.
అలాగే బీజేపీ నేతలతో బేటీ అనంతరం.. రాష్ట్రంలో పరిస్థితులపై మరింత అవగాహన ఏర్పరుచుకున్న మోడీ జనసేనాని పవన్ తో మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారనీ, ఆ లోగా ముందుగా నిర్ణయించిన మేరకు శనివారం ఉదయం జగన్ తో బేటీ కూడా పూర్తయిన అనంతరం పవన్ తో భేటీ అయితే బెటర్ అని ఆయన భావిస్తున్నారని కమలం శ్రేణులే చెబుతున్నాయి.