తెరాస నాయకులకు డబుల్ ఇంజిన్ థ్రెట్!?
posted on Nov 11, 2022 @ 3:02PM
అసలే వాళ్లు డబుల్ ఇంజిన్..! ఎలాంటి ఇష్యూనైనా డబుల్ ఇంజిన్ పవర్ తో బుల్ డోజ్ చేసేస్తుంటారు. వారు ఏదైనా ఓ స్కెచ్ వేశారంటే.. రాజకీయ ప్రత్యర్థులు మట్టి కరవాల్సిందే. తాము చెప్పేది వింటే సరేసరి.. లేదంటే ప్రత్యర్థుల్ని తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఉహకు అందని వ్యూహాలు పన్నుతుంటారు. అలాంటి డబుల్ ఇంజిన్ ను ఢీకొనాలనే ఎత్తుగడతో తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక తొలి ప్రభుత్వంగా టీఆర్ఎస్ అధికార పీఠం ఎక్కిన తర్వాత కొంతకాలం పాటు ప్రధాని మోడీతో కేసీఆర్ సఖ్యతగానే మెలిగారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పైలాన్ను 2016 ఆగస్టు 7న గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండలో ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఆ కార్యక్రమంలో మోడీ- కేసీఆర్ ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. మిషన్ భగీరథ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసిస్తూ.. తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ కు 2017లో ప్రధాని మోడీ లేఖ రాశారు. అంతకు ముందు 2015లో చండీయాగం నిర్వహించిన కేసీఆర్ ను ప్రశంసిస్తూ ప్రధాని మోడీ లేఖ రాశారు. అలాగే.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ కార్యక్రమం తలపెట్టిన కేసీఆర్ బేషరతుగా మద్దతు ఇచ్చేవారు.
అంతలా పాలు- నీళ్లలా మెలిగిన మోడీ- కేసీఆర్ మద్య ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. కేంద్రంతో కేసీఆర్ ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తున్నారు.. పంతంలో ఫస్ట్ న నిలిచే డబుల్ ఇంజిన్.. ఇంతలా తిరుగుబాటు చేస్తున్న కేసీఆర్ ను చూస్తూ.. ఉపేక్షిస్తుందా? ఎన్డీయేతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను తమ దారికి తెచ్చుకునేలా చేసిన, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ముగింపు పలికి తమ పార్టీ అందలం ఎక్కేలా చేయగలిగింది ఈ డబుల్ ఇంజిన్.
దక్షిణాదిలో ఒక్క కర్ణాటక తప్ప మరే రాష్ట్రంలోనూ తన ఉనికి అంతగా లేదనే వ్యధలో ఉన్న డబుల్ ఇంజిన్ ముఖ్యంగా తెలంగాణపై దృష్టిపెట్టింది. అందుకు తెలంగాణలో కొన్ని ఎంపీ స్థానాల్లోను, కొన్ని ఉప ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లలోనూ, జీహెచ్ఎంసీలో అనేక చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయాలు సాధించడమే కారణం. కాస్త కష్టపడితే తెలంగాణలో పాగా వేయొచ్చని బీజేపీ అగ్రనేతలు పథకాల మీద పథకాలు రచిస్తున్నారు. ఆ పార్టీలోని టాప్ లీడర్లు తరచూ తెలంగాణలో పర్యటించి, కేసీఆర్ పాలన మీద, ఆయన కుటుంబం మీద విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు.
ఇంతటితో ఆగని డబుల్ ఇంజిన్ ఇప్పుడు టీఆర్ఎస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్, ఆదాయపు పన్ను శాఖల్ని ఉసిగొల్పుతోందంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో కేసీఆర్ కుమార్తె కవితకు లింక్ ఉందంటూ సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఆమె బంధువు బోయిన్ పల్లి అభిషేక్ రావును అరెస్ట్ చేసింది. గ్రానైట్ ఎగుమతి వ్యాపారం చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ ఇంటిని ఆయన లేకపోయినా తాళాలు పగలగొట్టి మరీ సోదాలు చేసింది. ఇటీవలే టీఆర్ఎస్ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన గాయత్రి రవి సంస్థల మీద దాడులు చేపట్టింది.
గాయత్రి రవి ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో అనుచరులను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. గాయత్రి రవి చేస్తున్న ఖర్చుల్సి చూసి, అంత డబ్బు ఎలా? ఎక్కడి నుంచి వస్తోందని, ఎక్కడికి వెళ్లోందని ఆరా తీసే పనిలో దర్యాప్తు సంస్థలు బిజీగా ఉన్నాయంటున్నారు. దర్యాప్తు సంస్థల దాడులు వీరితోనే ఆగవని, ఇంకా పలువురి పేర్లతో పెద్ద హిట్ లిస్టు ఉండి ఉండొచ్చనే భయం ఆ పార్టీ నేతల్లో ఉందంటున్నారు. ఇలా కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడులు కేసీఆర్ కు చెక్ పెట్టే క్రమంలోనే జరుగుతున్నాయని భావిస్తున్నారు.
భౌగోళికంగా అయినా.. ఎంపీల లెక్క ప్రకారం చూసుకున్నా పదో స్థానంలో ఉండే చిన్న రాష్ట్రం తెలంగాణ. ఈ చిన్న రాష్ట్రమే బలమైన బీజేపీని, డబుల్ ఇంజిన్ ని ఛాలెంజ్ చేస్తే.. అగ్రస్థానంలో ఉండే పెద్ద రాష్ట్రాలు కూడా చెలరేగితే.. అనే ఆలోచనే టీఆర్ఎస్ లెక్కల్ని తేల్చేయాలనే వ్యూహంతో డబుల్ ఇంజిన్ వ్యూహాలు అమలు చేస్తున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.