జగన్ సర్కార్ పై ఏపీ బీజేపీ ఒకలా.. కేంద్రం మరోనా.. జనం ఎందుకు నమ్ముతారు?
posted on Nov 12, 2022 9:06AM
ఆంధ్రప్రదేశ్ లో విమర్శలు.. ఢిల్లీలో సంపూర్ణ సహకారాలు...ఇది ఏపీ సర్కార్ తో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు. ఏపీలో ఎంతగా విమర్శలు గుప్పించినా వైసీపీ నుంచి కనీస మాత్రంగా కూడా ప్రతి విమర్శలు రావడం లేదు. అదే సమయంలో జగన్ ప్రభుత్వానికి కాగల కార్యాలన్నీ కేంద్రంలోని మోడీ సర్కార్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరీ కానిచ్చేస్తోంది.
అప్పుల విషయంలోనైతేనేమీ, కేసుల విషయంలోనైతేనేమీ జగన్ సర్కార్ ఇంత కాలం ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నెట్టుకొచ్చేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ తీరే కారణమని విపక్షాలు, విశ్లేషకులే కాదు.. సామాన్య జనం కూడా గట్టగా చెబుతున్నారు. నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ వీశాఖ పర్యటనలో ఆయన రాష్ట్ర బీజేపీ నేతలతో దాదాపు గంటన్నర పాటు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ పర్యటన ఏర్పాట్లు వైసీపీ ఎంపీ విజయసాయి పర్యవేక్షించిన విషయంపై ఏపీ బీజేపీ నేతలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అంతే కాకుండా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన బీజేపీ అధ్యక్షుడా లేక వైసీపీ ఏజెంటా అన్న స్థాయిలో వారి విమర్శలు ఉన్నాయి.
కేవలం వారి విమర్శల కారణంగానే మోడీ పర్యటనలో హడావుడిగా ఏపీ బీజేపీ నేతలతో భేటీని జొప్పించారు. సరే ఈ బేటీలో ప్రధానంగా జగన్ ప్రభుత్వ వైఫల్యాలపైనేచర్చ జరిగినట్లుగా చెబుతున్నా.. అంతకు మించి ఏదో జరిగిందని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఏపీ బీజేపీ నాయకులు విఫలమయ్యారని మోడీ ఒకింత అసహనం వ్యక్తం చేశారనీ చెబుతున్నారు. ఏపీలో బలోపేతమయ్యే అవకాశాలను రాష్ట్ర నాయకత్వం చేజేతులా జారవిడుచుకుందనీ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారనీ చెబుతున్నారు.
ఇక నుంచి అయినా జగన్ సర్కార్ వైఫల్యాలను జనంలోకి తీసుకుపోవాలనీ, గ్రమాగ్రామాన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై సమావేశాలు, సభలూ నిర్వహించి ప్రచారం చేయాలని సూచించారని అంటున్నారు. జగన్ సర్కార్ వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరిగేలా చర్యలు చేపట్టాలని మోడీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ సర్కార్ పై రాష్ట్ర నాయకత్వాన్ని విమర్శించాలంటూ ఆదేశాలు జారీ చేసి.. కేంద్రం స్థాయిలో జగన్ తప్పిదాలు, వైఫల్యాలను కప్పిపుచ్చే పని చేయడం వల్ల ఎటువంటి ప్రయోజం ఉండదనీ.. ఏపీ బీజేపీ నాయకులు భావిస్తున్నారని అంటున్నారు.
ఈ విషయాన్ని నేరుగా మోడీ ముందు ప్రస్తావించకపోయినా.. మోడీతో భేటీ తరువాత వారిలో నిరుత్సాహమే కనిపించిందని కూడా కమలం ఏపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పటికే ఏపీలో జగన్ సర్కార్ పై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహ జ్వాల సెగలు బీజేపీకి కూడా తగులుతున్నాయనీ, రాష్ట్రంలో బీజేపీ అంటే జగన్ కు వంత పాడే పార్టీ అన్న ముద్ర బలంగా పడిపోయిందనీ పార్టీ శ్రేణులే అంటున్నాయి. రాజధాని అంశం నుంచి ఏ విషయం తీసుకున్నా.. ఏపీలో సీమటపాకాయల్లా అప్పడప్పుడూ బీజేపీ నాయకులు విమర్శల చప్పుడు చేయడమే తప్ప గట్టిగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం అయితే చేయలేదని చెబుతున్నారు. నాలుగైదు నెలల కిందట అమిత్ షా ఏపీ పర్యటనకు వచ్చినప్పుడే వైసీపీ సర్కార్‌పై పోరాడాలని ఆదేశించినట్లు చేశారనీ, అలాగే ఏపీ బీజేపీ నాయకులు కూడా పోరాడినట్లే చేశారనీ.. అయితే ఆ ఆదేశం, ఆ పోరాటంలో ఎక్కడా సీరియస్ నెస్ అన్నదే కనిపించలేదనీ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.
అందుకే బీజేపీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల బేటీలో రాష్ట్రంలో బీజేపీతో కలిసి పని చేయలేకపోతున్నామని అన్నారని కూడా విశ్లేషిస్తున్నారు. అసలు జరగాల్సింది ఏపీ బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ పై పోరాడటం కాదనీ, కేంద్రమే వైసీపీ ఆర్థిక అరాచకత్వంపై శ్వేతపత్రం విడుదల చేయడం లాంటి తీవ్ర చర్యలకు పాల్పడితేనే రాష్ట్ర ప్రజలలో జగన్ విధానాలకు బీజేపీ అండగా నిలుస్తోందన్న భావన పోయే అవకాశం లేదని అంటున్నారు. బజేపీ అగ్రనాయకత్వం నుంచి జగన్ అరాచక విధానాలన ఎండగడుతూ స్పష్టమైన చర్యలు కనిపిస్తే తప్ప ఏపీలో బీజేపీ నేతలు వాగాడంబరం ప్రదర్శించినంత మాత్రాన ఎవరూ పట్టించుకోరని అంటున్నారు. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన అమరావతి యాత్ర, నిరుద్యోగయాత్ర, కార్నర్ మీటింగ్‌లను జనం పట్టించుకోకపోవడాన్ని పరిశీలకులు ఉదహరిస్తున్నారు.
ఇందుకు కారణం జగన్ పట్ల కేంద్రం చూపుతున్న అపార ప్రేమాభిమానాలు, ఆదరణే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికీ వైసీపీని మిత్రపక్షంగానే బీజేపీ హై కమాండ్ మిత్రపక్షంగానే పరిగణిస్తోంది. అందుకే తెలంగాణ, తమిళనాడుల్లోని ప్రభుత్వాలతో వ్యవహరిస్తున్న విధానానికి భిన్నంగా ఏపీలో జగన్ సర్కార్ తో వ్యవహరిస్తోంది. ఏపీలో గవర్నర్ జగన్ సర్కార్ తానా అంటే తందానా అన్నట్లు వ్యవహరిస్తారు.. కానీ తమిళనాడు, తెలంగాణలలో గవర్నర్లు మాత్రం మీడియా సమావేశాలు పెట్టి మరీ అక్కడి ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తుంటారు.ఏపీ అప్పులకు కేంద్రం పచ్చ జెండా ఊపడం నుంచి ప్రతి విషయంలోనూ జగన్ సర్కార్ కు కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందుతున్న తీరుపై జనంలో కూడా కేంద్రం, వైసీపీ సర్కార్ ల మధ్య రహస్య అవగాహన ఉందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అందుకే ఏపీ బీజేపీ నేతలు వైసీపీపై, జగన్ విధానాలపై విమర్శలు చేస్తున్నా ఎవరూ నమ్మడం లేదు. పట్టించుకోవడం లేదు. వైసీపీపై బీజేపీ అగ్రనాయకత్వం కన్నెర్ర చేసి చర్యలకు ఉపక్రమిస్తేనే ఏపీలో బీజేపీపై ప్రజలలో ఏదో ఒక మేరకు నమ్మకం కలిగే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.