బార్ లో కాల్పుల కలకలం.. మెక్సికోలో 9మంది దుర్మరణం
posted on Nov 11, 2022 @ 10:30AM
మెక్సికోలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఒక బార్ లో సాయుధులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో కనీసం 9 మంది మరణించారు. మరి కొందరు గాయపడ్డారు. ఈ ఘటన గ్వానాజువాటోలోని ఓక బారులో జరిగింది. మారో గ్యాంగ్ సభ్యులు ఈ కాల్పులకు తెగబడ్డారని చెబుతున్నారు.
బుధవారం అర్ధరాత్రి సమయంలో బార్ లోకి చొరబడ్డ సాయుధులు అక్కడి సిబ్బందిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మహిళా వెయిటర్లు సహా తొమ్మిది మంది బార్ సిబ్బంది మరణించారు.
ఈ కాల్పులకు గ్యాంగ్ ల మధ్యా విభేదాలే కారణమని పోలీసులు తెలుపుతున్నారు. మారో గ్యాంగ్ కు ప్రత్యర్థి గ్యాంగ్ కు బార్ యాజమాన్యం మద్దతు ఇస్తుండటమే ఈ దాడికి వెనుక ఉన్న కారణంగా భావిస్తున్నారు. అయితే దాడికి పాల్పడిన సాయుధులను ఇంకా గుర్తించలేదని చెప్పారు.
మెక్సికోలో గ్యాంగ్ వార్ ల కారణంగా అమాయకులు చనిపోవడం ఇదే మొదటి సారి కాదు. గత నెలలో కూడా ఇలాగే బార్ పై సాయుధులు జరిపిన దాడిలో 12 మంది మరణించారు. అంతకు ముందు నెలలో కూడా ఇలాంటి కాల్పుల ఘటనలో 10 మంది చనిపోయారు.