గుజరాత్ ఎన్నికల్లో బీఆర్ఎస్.. బీజేపీకి దెబ్బేనా?
posted on Nov 11, 2022 @ 11:51AM
మునుగోడు ఉప ఎన్నికలో విజయం తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ బీఆర్ఎస్ విస్తరణపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ ను పాన్ ఇండియా పార్టీగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అదీ ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్ లో సత్తా చాటడం ద్వారా దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
అందులో భాగంగానే వచ్చె నెల రెండు విడతలుగా జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీ చేయనుంది. గుజరాత్ లో తెలుగువారు అధికంగా ఉండే సూరత్ ప్రాంతంపై కేసీఆర్ దృష్టి పెట్టారు. గుజరాత్ లో ఇప్పటికే పట్టు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగాలని కేసీఆర్ భావించినా ఆ దిశగా ఎటువంటి ముందడుగూ పడలేదు. ఆప్ కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ తో పొత్తుకు పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. అయితే గుజరాత్ లో ఒక బలమైన నేతను బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి కేసీఆర్ ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింఘ్ వఘేలాతో కేసీఆర్ చర్చలు ఫలప్రదమయ్యాయనీ, ఆయన నేడో రేపో బీఆర్ఎస్ గూటికి చేరనున్నారనీ చెబుతున్నారు. గత సెప్టెంబర్ లో శంకర్ సింఘ వఘేలా హైదరాబాద్ ప్రగతి భవన్ కు వచ్చి కేసీఆర్ తో బేటీ అయిన సంగతి విదితమే.
ఆ భేటీలోనే బీఆర్ఎస్ గుజరాత్ రాష్ట్రంలో పోటీకి దిగితే సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా, తాను జాతీయ పార్టీ ఏర్పాటును విరమించుకుని బీఆర్ఎస్ లో చేరేందుకు కూడా శంకర్ సింగ్ వఘేలా కేసీఆర్ తో చెప్పినట్లు సమాచారం. ఇప్పుడు అదే జరగబోతున్నదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఆ దిశగా తన తొలి అడుగుతోనే ఏను కుంభ స్థలాన్ని ఢీ కొనాలని కృత నిశ్చయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందులో భాగంగానే వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను పోటీకి నిలపాలని నిర్ణయించారు.
ఇందు కోసం ఆయన గుజరాత్ లో బీఆర్ఎస్ నాయకుడిగా శంకర్ సింగ్ వఘేలాను ప్రొజెక్టు చేయనున్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర, గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న శంకర్ సింగ్ వఘేలా బీఆర్ఎస్ లో చేరడం వల్ల ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ లాంఛింగ్ కు పెద్ద ప్లస్ అవుతుందని పరిశీలకులు కూడా చెబుతున్నారు. ఇక గుజరాత్ లో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు వారి మద్దతుతో కొన్ని స్థానాలలో విజయం సాధించడం పెద్ద కష్టం కాదని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ కారణంగానే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కనీసంలో కనీసం పది స్థానాలలోనైనా బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపాలని కేసీఆర్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారంటున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కనీసం పది స్థానాలలో పోటీ చేసి, వాటిలో ఎంత లేదన్నా నాలుగు స్థానాలలో విజయం సాధించగలమన్న ధీమాతో కేసీఆర్ ఉన్నారంటున్నారు. గుజరాత్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ ను కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు.
మొత్తం మీద గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దిగి.. కొన్ని స్థానాలలో విజయం సాధించడం ద్వారా ప్రధాని మోడీకి గట్టి గుణపాఠం చెప్పాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. ఇప్పటికిప్పుడు తనతో చేతులు కలపడానికి ఒకింత సంకోచిస్తున్న బీజేపీయేతర పార్టీలు, ప్రాంతీయ పార్టీలూ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల లో బీఆర్ఎస్ కొన్ని స్థానాలలో విజయంతో సత్తా చాటితే.. వాటంతట అవే ముందుకు వచ్చి తనతో జట్టు కడతారన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తున్నది. ఏది ఏమైనా బీఆర్ఎస్ ఆవిర్బావం సందర్భంగా కేసీఆర్ ప్రకటించిన ప్రణాళికలో గుజరాత్ లో పోటీ అంశం లేదు. ఆ తరువాత సంభవించిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జాతీయ రాజకీయాలలో తన తొలి అడుగు మోడీని ఢీకొట్టడంతోనే వేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే గుజరాత్ లో బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ రాష్ట్రలో ఆప్ బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో మనీష్ సిసోడియాపై కేసు అంశాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా తెరమీదకు తీసుకురావడంతో బీజేపీ డిఫెన్స్ లో పడిందంటున్నారు. అందుకే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో దర్యాప్తు సంస్థలు పెద్దగా దూకుడు ప్రదర్శించే అవకాశం లేదన్న కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేదని తెరాస శ్రేణులు కూడా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోనికి దింపి కొన్ని స్థానాలను గెలుచుకోవడం ద్వారా మోడీకి గట్టి సవాల్ విసిరినట్లౌతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
గుజరాత్ ఫలితాల తరువాత బీఆర్ఎస్ విషయంలో కేసీఆర్ తన దూకుడును మరింత పెంచే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ మోడల్ గా దేశ ప్రగతి అంటూ దేశ వ్యాప్తంగా కేసీఆర్ నాయకత్వ పటిమను ప్రచారం చేస్తూ జారీ చేసిన ప్రకటనల ప్రభావం గుజరాత్ మీద కూడా గణనీయంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. సో.. గుజరాత్ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ సభ్యులు రంగంలో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.