ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం.. గుజరాత్, హిమాచల్ ఎన్నికల ముందు సంచలనం
posted on Nov 11, 2022 @ 11:47AM
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్, గెలుపు అంచనాల ప్రచురణ, ప్రసారాలను నిషేధించింది. ఈ మేరకు గురువారం (నవంబర్ 10) ఉత్తర్వులు జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్ లో ఒకే విడతలో జరగనున్న పోలింగ్ కు ఇప్పటికే ప్రచార గడువు ముగిసింది.
ఇక ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో వచ్చే నెల మొదటి వారంలో రెండు విడతలలో ఆ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం(నవంబర్ 12) నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకూ మీడియాలో ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రచురణ, ప్రసారాలను నిషేధిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది.
ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం ఈ నిషేధాన్ని విధిస్తున్నట్లు ఈసీ ఆ ఉత్తర్వ్యులలో పేర్కొంది. ఆ ఉత్తర్వుల మేరకు శనివారం (నవంబర్ 12) ఉదయం ఎనిమిది గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం ఐదున్నర గంటల వరకూ ఏ విధమైన ఎగ్జిట్ పోల్స్, గెలుపు అంచనాలను ప్రసారం చేయడం కానీ, ప్రచురించడంపై కానీ పూర్తి నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది.