ఏపీకి ఇక మంచి రోజులు.. మోడీతో భేటీ అనంతరం పవన్ వ్యాఖ్యల ఆంతర్యమిదేనా?
posted on Nov 12, 2022 6:31AM
‘ఏపీకి ఇక మంచి రోజులు వస్తాయి’ ప్రధాని మోడీతో భేటీ అనంతరం మీడియాతో జనసేనాని పవన్ కల్యాణ్ అన్న మాట ఇది. చాలా కాలం తరువాత జనసేనాని ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. మోడీ విశాఖ పర్యటన సందర్భంగా ఆయన ఆహ్వానం మేరకు విశాఖ వచ్చి పవన్ మోడీతో భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి వీరిరువురి మధ్యా జరిగిన భేటీ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
దాదాపు 35 నిముషాలు జరిగిన ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్ ఏపీకి మంచి రోజులు రానున్నాయని చెప్పారు. ఆ మాటలే ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు తెరలేపాయి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, రెండు పార్టీలు కలిసి పని చేయడంపై ఇరువురి మధ్య చర్చ జరిగిందని అంటున్నారు.దాదాపు ఎనిమిదేళ్ల తరువాత పవన్ కల్యాణ్ మోడీతో భేటీ అయ్యారు ఏపీలోని పరిస్థితులన్నీ ప్రధాని మోదీకి వివరించినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. ఏపీ ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన భేటీగా పవన్ అభవర్ణించారు.
ప్రధానితో భేటీ అనంతరం ఏపీకి మంచి రోజులు రానున్నాయన్న విశ్వాసం పెరిగిందన్నారు. పవన్ కల్యాణ్ తో భేటీకి మోడీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారనడానికి తొలుత బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో జరగాల్సిన భేటీని వాయిదా వేసి మరీ ముందుగా పవన్ తో ఆయన భేటీ అవ్వడమే నిదర్శనమని చెబుతున్నారు. ఈ భేటీ తరువాత పవన్ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలపై పరిశీలకులు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల మార్పునకు సంకేతమని విశ్లేషిస్తున్నారు. పొత్తుపొడుపులపై మరో మారు ఈ భేటీ చర్చలకు తెరలేపింది. తెలుగుదేశం, జనసేనల మధ్య ఇటీవలి కాలంలో కనిపిస్తున్న సఖ్యత, బీజేపీతో జనసేనకు ఇటీవల పెరిగన దూరం వీటన్నిటినీ వివరిస్తూ 2014 నాటి పరిస్థితులు మళ్లీ రాష్ట్రంలో ఏర్పడనున్నాయని అంటున్నారు.
ఇప్పటికే మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీలు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశంతో కలిసి నడిచే అవకాశాలు మెరుగయ్యాయనడానికి మోడీతో జరిగిన భేటీ అనంతరం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంకేతంగా విశ్వేషణలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ముచ్చటగా మూడేళ్ళుగా సాగుతున్న హనీమూన్ ముగింపుకు చేరుకున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయని గతంలోనే విశ్లేషకులు పేర్కొన్నారు. మరో వంక రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పతాక స్థాయికి చేరుకుంటోంది.
ఈ అన్నిటినీ మించి ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న అనుభవం అవసరమనే విషయాన్ని ప్రజలు గుర్తించారు.ఈ నేపధ్యంలో, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని రాజకీయ పరిశీలకులు గతంలోనే విశ్లేషణలు చేశారు.అలాగే, బీజేపీ జాతీయ నాయకత్వం కూడా రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా, చంద్రబాబు ‘విజన్’ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే నిర్ణయానికి వచ్చిందని, రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ మోడీ భేటీ తరువాత జనసేనాని ‘మంచి రోజుల’ వ్యాఖ్యలను పరిగణనలోనికి తీసుకోవాలంటున్నారు.