ఎందరు ఛీ అన్నా మోడీ ప్రభ వెలిగిపోతోంది?! కారణమిదేనా?
posted on Nov 16, 2022 @ 11:39AM
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ళ పాలనలో, దేశానికి పనికొచ్చే ఒక్క మంచి పనిచేసింది, లేదు. ఏ వర్గాన్ని సంతృప్తి పరిచిందీ లేదు. మోడీ వట్టి పనికిమాలిన ప్రధాని. ఇంత పనికి మాలిన ప్రదానిని నేను నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూడలేదు. తెలంగాణ గడ్డపై నుంచే మోడీ పతనానికి పోరు మొదలౌతుంది. ఈడీ దాడులకు భయపడవద్దు.. ఈ మాటలు ఎవరివో వేరే చెప్పనక్కరలేదు.
ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరచు మోడీ లక్ష్యంగా కేంద్రంపైనా, బీజేపీపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్క కేసీఆర్ అనే కాదు.. , కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదలు రేవంత్ రెడ్డి వరకు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరూ, మోడీని విమర్శించడంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఇలా బీజేపీయేతర పార్టీల నాయకులందరూ మోడీని విమర్శించడమే కాదు.. ఆయన విధానాలు దేశాన్ని ఎంతగా భ్రష్టు పట్టించాయో సమయం, సందర్భం లేకుండా ఉద్ఘాటించేస్తుంటారు. అయితే విపక్షాలు ఎంతగా విమర్శించినా జాతీయంగా, అంతర్జాతీయంగా మోడీ ప్రతిష్ట మసకబారుతున్న పరిస్థితి అయితే కనిపించడంలేదు.
రాహుల్ గాంధీ సహా ప్రధాని రేసులో ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరి కంటే,ఇప్పటికీ మోడీయే ఫస్ట్ ప్లేస్’లో ఉన్నారు. ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ డి నేషన్ సర్వే ఇదే తేల్చి చెప్పింది. 53 శాతం మంది ప్రజలు మరోమారు మోడీయే ప ప్రధాని కావాలని కోరుకుంటున్నారన్నది మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితం పేర్కొంది. అయితే మోడీ తరువాత అత్యధికులు రాహుల్ గాంధీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయతే రెండో స్థానంలో ఉన్న రాహుల్ కు మద్దతు ఇచ్చిన వారు కేవలం 9 శాతం మంది మాత్రమే. ఆ తరువాతి స్థానం కేజ్రీవాల్ ది. ఆయనను పీఎంగా చూడాలనుకుంటున్న వారి శాతం జస్ట్ 7 శాతం మంది.
సో, రాహుల్ గాంధీ, కేసీఆర్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకులు మోడీని పనికిమాలిన ప్రధాని అని ఎద్దేవా చేసినా దేశ ప్రజలు మాత్రం మోడీకే జై కొడుతున్నారన్నమాట. సర్వేలే కాదు. వివిధ రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అదే స్పష్టం చేస్తున్నాయి. అలాగే దేశీయంగానే కాదు, అంతర్జాతీయంగా కూడా ప్రధాని మోడీ ఛరిష్మా పెరుగుతూనే ఉంది. ప్రధాని పదవిలో ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్న మోడీకి జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ప్రతిభ మసకబారడం లేదంటే అందుకు కారణం.. దేశంలో మోడీని వ్యతిరేకించే శక్తుల అనైన్యత అని అనుకోవచ్చు. మరి అంతర్జాతీయంగా ఛరిష్మా ఇసుమంతైనా తగ్గక పోవడానికి కారణమేమిటి? ఇండోనేషియాలో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని మోడీకి జో బైడెన్ సెల్యూట్ చేయడం... బ్రిటిష్ ప్రధాని మోడీతో భేటీకి అత్యుత్సాహం చూపడం, మోడీతో భేటీ అయిన గంటల వ్యవధిలోనే భారత్ అనుకూలంగా బ్రిటిస్ విసా విధానాన్ని ప్రకటించడం ఇవన్నీ దేనిని సూచిస్తున్నాయి?
ఇటీవల అమెరికా డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ప్రపంచ అత్యుత్తమ నేత ఎవరనేఅంశంపై నిర్వహించిన సర్వేలో కూడా మోడీ మళ్ళీ మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం 22 మంది అంతర్జాతీయ నేతలపై నిర్వహించిన సర్వేలో అత్యధికంగా 75 శాతం రేటింగ్ మోడీకే దక్కింది. ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నా.. అమెరికా ఆంక్షల హెచ్చరికలు చేసినా భారత్ రష్యా నుంచి అయిల్ కొనుగోలు విషయంలో వెనక్కు తగ్గలేదు. ఈ నిర్ణయంతో మోడీ గ్రాఫ్ అంతర్జాతీయంగా పడిపోతుందని అంతా భావించారు. అయితే పరిస్థితి అంతకు భిన్నంగా ఉంది. కారణం? అంతర్జాతీయంగా భారత్ మార్కెట్ విస్తరిస్తుండటం. అదే సమయంలో చైనా విధానాలపై ప్రపంచ దేశాలలో వ్యతిరేకత వ్యక్తం అవుతుండటం అంతర్జాతీయంగా మోడీ ప్రతిష్ట ఇనుమడించడానికి కారణమంటున్నారు. ఇక దేశీయంగా విపక్షాలలో రాజకీయ అనైక్యత మోడీ ప్రతిభ మసకబారకుండా ఉండటానికి కారణమంటున్నారు. దేశీయంగా బీజేపీయేతర పక్షాలు ఐక్యంగా ముందుకు సాగే పరిస్థితులు నెలకొని ఉంటే ఈ సర్వేల ఫరితాలు పూర్తిగా ఇప్పుడున్న వాటికి భిన్నంగా ఉండేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.