దక్షిణాది పై పట్టు కోసం కమల వ్యూహం
posted on Nov 16, 2022 @ 12:47PM
భారతీయ జనతా పార్టీ, 2024 ఎన్నికలలో ముచ్చటగా మూడవసారి విజయం సాధించి, హ్యాట్రిక్ సొంతం చేసుకునేందుకు, పావులు కదుపుతోంది. ఒకప్పుడు కేవలం ఉత్తరాది రాష్రా లకే పరిమితమైన పార్టీ, ఇప్పుడు దేశం అంతటా ప్రాబల్యం పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ముఖ్యంగా 2024 ఎన్నికల నాటికి దక్షిణాదిలో పాగా వేసేందుకు, వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే బీజేపీ సౌత్ మిషన్ అంటూ బ్లూప్రింట్‌ను సిద్ధం చేసిందని పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. ఇందు భాగంగానే, కమల దళం ఉభయ తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో పాగాకు బీజేపీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఆ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటికే బలోపేతమైందని పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. మునుగోడులు టీఆర్ఎస్ కు దీటుగా బీజేపీ గట్టి పోటీ ఇవ్వడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. వాస్తవానికి 2014లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే కమలం పార్టీ ఇప్పటి వరకూ అందని ద్రాక్షలా ఉన్న దక్షిణ, తూర్పు రాష్ట్రాలలో అధికారమే లక్ష్యంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ లక్ష్యం దిశగా బీజేపీ వేసిన అడుగులలో భాగంగానే అస్సాంతో సహా పలు ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగరేసింది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది.
అయితే, మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో మాత్రం బీజేపీ వ్యూహాలు ఫలించలేదు. ఇతర పార్టీల నుండి పేరొందిన నాయకులను దిగుమతి చేసుకోవడం, ఇతర రాష్ట్రాల నుండి సొంత నాయకులను తీసుకు రావడం, ప్రముఖ సినీ తారలను ఆకట్టుకోవడం, ప్రాంతీయ పార్టీలలో చీలికలను ప్రోత్సహించడం వంటి అనేక ప్రణాళికలతో దూకుడు ప్రదర్శించినా ఫలితాలు మాత్రం ఆశాజనకంగా రాలేదు. అయితే ఇప్పుడు 2024 ఎన్నికలలో దక్షిణాదిలో పాగాయే లక్ష్యంగా కీలక మార్పులతో సరికొత్త ప్రణాళికతో సిద్ధమవుతోంది. దక్షిణాదిన పాగా వేయాలంటే కొత్త ఎత్తులు, వ్యూహాలు అవసరమని పార్టీ అగ్ర నాయకత్వం గ్రహించింది. ఉత్తరాదిలో మంచి ఫలితాలు ఇస్తున్న హిందుత్వ రాజకీయాలకు భిన్నమైన రీతిలో, సైద్ధాంతిక అంశాలకు, సంక్షేమ కార్యక్రమాలకు మధ్య గల సరిహద్దులను అధిగమించి దక్షిణాది ప్రజలకు ఆమోదయోగ్యమైన పార్టీగా నిలబడే కృషి ప్రారంభించారు.
ఐదు దక్షిణాది రాష్ట్రాలలో మూడింటిలో ప్రాంతీయ పార్టీలు రాజకీయ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నందున, ఈ ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడానికి బిజెపి వారసత్వ రాజకీయాలపై పోరాటం ఆయుధాన్ని ఎంచుకొంది. కాంగ్రెస్-ముక్త్ భారత్, అవినీతి రహిత భారతదేశంఅన్నవే 2014 నుండి బీజేపీ నమ్ముకున్న నినాదాలు. వాటికి తోడుగా 2024లో `వారసత్వ ముక్త - భారత్’ నినాదాన్ని జోడించాలని నిర్ణయానికి వచ్చింది. ఆ నినాదంతో యువతను టార్గెట్ చేయాలని భావిస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కేడర్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగంతో ప్రారంభించి ప్రధాని మోడీ అప్పటి నుంచి తన ప్రతి ప్రసంగంలోనూ కుటుంబ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ , బీజేపీకి కుటుంబ పాలన వ్యతిరేక సెంటిమెంట్ రాజకీయంగా మంచి ఫలితాలు ఇస్తుందని వివ్వసిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అంతేకాకుండా, ఎన్నికలలో ఇప్పటికీ ప్రాబల్యం చూపించలేక పోతున్న రాష్ట్రాల్లో పార్టీ సరికొత్త విధానాన్ని ఆవలంభించ వలసిన అవసరాన్ని గుర్తించింది. పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో తప్ప మిగిలిన రాష్ట్రాలలో క్షేత్రస్థాయిలో బీజేపీ పటిష్టంగా లేదన్నది వాస్తవం. కాబట్టి ఆయా రాష్ట్రాలలో కొన్ని నియోజకవర్గాలను కైవసం కోవడంపై దృష్టి సారిస్తూ, ఆ బాధ్యతలను కేంద్ర మంత్రులకు అప్పచెప్పి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా అక్కడ పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది.
ఉదాహరణకు, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు సాపేక్షంగా మెరుగైన పనితీరు కనబరిచిన కేరళలోని లోక్‌సభ నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, అశ్విని కుమార్ చౌబే, శోభా కరంద్లాజేలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి తెలంగాణలో నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులలో పార్టీ అధికారాన్ని దక్కించుకునేంతగా బలోపేతం కష్టమన్న విషయాన్ని గ్రహించిన కమలనాథులు.. ఆయా రాష్ట్రాలలోని కొన్ని నియోజకవర్గాలలోనైనా బలోపేతం కావాలన్న ప్రయత్నాలకు పరిమితమౌతున్నారు. అయితే తెలంగాణలో మాత్రం బీజేపీకి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవకాశాలున్నాయని భావిస్తోంది. అందుకే ఆ రాష్ట్రంపైనే ప్రధానంగా దృష్టి సారించింది.
ప్రముఖ క్రీడాకారిణి పి టి ఉష (కేరళ), సంగీత మాంత్రికుడు ఇళయరాజా (తమిళనాడు), వితరణశీలి వీరేంద్ర హెగ్డే, సినీ రచయిత కె వి విజయేంద్ర ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)లను రాజ్యసభకు నామినేట్ చేయడానికి ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిరణయం దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించాలన్న వ్యూహంలో భాగమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2024లో కేంద్రంలో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటుగా, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యానికి చెక్ పెట్టడమన్న వ్యూహంతో బీజేపీ అడుగులు వేస్తోందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.