ఆల్ ఇండియన్స్ ఆర్ హిందూస్: మోహన్ భగవత్
posted on Nov 16, 2022 @ 9:42AM
భారత దేశము నా మాతృభూమి
భారతీయులందరూ నా సహోదరులు
అన్నట్లుగానే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇప్పుడు భారతీయులందరూ హిందువులే (ఆల్ ఇండియన్స్ ఆర్ హిందూస్) అంటున్నారు. కులం, మతం, ఆహారపుటలవాట్లు వీటి వేటితోనూ సంబంధం లేకుండా భారత్ లో నివసించే వారంతా హిందువులే అని ఉద్ఘాటిస్తున్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మొదటి నుంచీ ఇదే చెబుతోందన్నారు. ఛత్తీస్ గఢ్ లోని అంబికాపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడమే హిందుత్వ సిద్ధాంతమని మోహన్ భగవత్ సెలవిచ్చారు. అఖండ భారత్ లో భాగమైన అందరి డీఎన్ఏ ఒక్కటేనన్నారు. మత సామరస్యం, పరస్పర గౌరవం నేటి అవసరాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంస్కృతీ సంప్రదాయలను పాటిస్తూ, గౌరవిస్తూనే.. ఇతరుల సంస్కృతీ సంప్రదాయాలను కూడా గౌరవించాలన్నారు. సొంత లబ్ధి కోసం, లక్ష్యాల సాధన కోసం దేశంలో మత సామరస్యానికి భంగం కలిగేలా ద్వేషపూరిత వాతావరణానికి కారణం అవ్వడం ఎంతమాత్రం సరి కాదని మోహన్ భగవత్ చెప్పారు.
భిన్నత్వంలో ఏకత్వం భాతర ఆత్మ అని గుర్తు చేశారు. కరోనా మహమ్మరి విజృంభిస్తున్న కాలంలో దేశంలో కనిపించిన ఐక్యత ఎల్లకాలం కనిపించాలన్నారు.