బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఈటల?.. హస్తిన పిలుపు వెనుక కారణం అదేనా?
posted on Nov 16, 2022 @ 2:35PM
ఈటలకు బీజేపీ అనూహ్య ప్రమోషన్ ఇస్తోందా? తెలంగాణ పార్టీ బాధ్యతలను ఆయనకు అప్పగించాలని అధిష్ఠానం నిర్ణయించిందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణ బీజేపీ బాధ్యతలను పార్టీ అధినాయకత్వం ఈటలకు అప్పగింనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఈటల సారథ్యంలో వచ్చే ఎన్నికలలో బీజేపీ విజయం సాధిస్తే.. ముఖ్యమంత్రి పదవి కూడా ఈటలకే అప్పగించనున్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. అందు కోసంమే ఈటలకు హస్తిన నుంచి పిలుపు వచ్చిందంటున్నాయి.
మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నిక ఓటమి పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ ఖాతాలో పడితే.. అదే సమయంలో ఇదే ఉప ఎన్నికలో తెరాసకు దీటుగా బీజేపీ పోటీ ఇచ్చిందనీ.. ఆ క్రెడిట్ ఈటల ఖాతాలోనూ పడిందని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. బీజేపీ అధిష్ఠానం పిలుపు మేరకు ఈటల రాజేందర్ హుటాహుటిన మంగళవారం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. చాలా కాలం నుంచీ ఈటల బీజేపీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదన్న అసంతృప్తితో వార్తలొస్తున్నాయి. తెరాస సర్కార్ లో మంత్రిగా పనిచేసిన ఆయనకు చేరికల కమిటీ ఛైర్మన్ పదవితో సరిపెట్టారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఈటల బీజేపీకి గణనీయంగా ఓట్లు రాబట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పలుకుబడి కారణంగానే బీజేపీ మునుగోడులో తెరాసకు దీటుగా పోటీ ఇవ్వగలిగిందని బీజేపీ అధిష్ఠానం గుర్తించింది.
ఈ నేపథ్యంలోనే ఆయనకు కీలక పదవి కట్టబెట్టాలన్న నిర్ణయానికి వచ్చిందంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈటలకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు అప్పగించనున్నారు. ఈ విషయాన్ని అమిత్ షా స్వయంగా ఈటలకు చెప్పారంటున్నారు. అంతే కాకుండా చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చనీ, పార్టీలో చేరికల విషయంలో ఈటల ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదనీ, చివరకు అధిష్ఠానం అనుమతి కోసం కూడా వేచి చూడాల్సిన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా ఈటలకు విస్పష్టంగా చెప్పారని అంటున్నారు. ఇప్పటి వరకూ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్నప్పటికీ.. సొంతగా నిర్ణయం తీసుకోలేని బంధనాలు ఆయనకు సంకెళ్లుగా ఉన్నాయని ఈటల వాపోయిన సందర్బాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు చెప్పారు.
అయితే మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీకి ఈటలకు ప్రజలలో ఉన్న పలుకుబడి పూర్తిగా అర్దం కావడంతో వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికారం చేపట్టాలన్న లక్ష్యం నెరవేరాలంటే రాష్ట్ర పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగించడమే మార్గమని బీజేపీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చిందంటున్నారు. కాగా తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించబోతున్నట్లు స్వయంగా అమిత్ షా ఈటలకు చెప్పారని తెలుస్తోంది. ఈ సందర్బంగా రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించినట్లు చెబుతున్నారు. అంతే కాకుండా తమతో ఏమైనా సంప్రదించాలనుకుంటే స్వయంగా హస్తినకు వచ్చి మాట్లాడాలే తప్ప.. ఎవరి ద్వారాను సమాచారం చేరవేయవద్దనీ, అలాగే ఫోన్ లో కూడా సంప్రదించొద్దనీ చెప్పినట్లు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కు గురయ్యే అవకాశం ఉందన్న భావనతోనే అమిత్ షా ఈటలకు ఈ సూచనలు చేశారంటున్నారు. గతంలో కూడా తెలంగాణ వ్యవహారాలను చర్చించేందుకు అమిత్ షా స్వయంగా ఈటలను హస్తినకు పిలిపించుకున్న సందర్బాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటలకు ప్రజలలో మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికీ పలువురు తెరాస నేతలు ఈటలతో టచ్ లో ఉన్నారని చెబుతారు.
అలాగే తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వారు తరచూ ఈటలను కలిసి మాట్లాడుతారని చెబుతారు. ఈ నేపథ్యంలోనే ఈటలకు కీలక బాధ్యతలు అప్పగిస్తే అది కచ్చితంగా బీజేపీకి మేలు చేస్తుందన్న అభిప్రాయం బీజేపీ అధిష్ఠానంలో బలంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈటలను హస్తినకు పిలిపించుకుని మరీ తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించనున్నట్ల సమాచారం ఇచ్చారని అంటున్నారు. ఈటలతో పాటు పార్టీ సీనియర్ నాయకురాలు డీకే ఆరుణ, పార్టీ మునుగోడు అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి కూడా అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. వారిరువురికీ కూడా ఈటలకు పార్టీ పగ్గాలు అప్పగించనున్నట్లు తెలిపి పూర్తి సహకారం అందించాలని సూచించిట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈటలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
ఇలా ఉండగా టీఆర్ఎస్ కూడా ఈటలకు ఆహ్వానం పలికిందనీ, స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసి మరీ టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారనీ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరితో ఈటలకు ఉప ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ ఆఫర్ చేశారని కూడా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే గతంలో టీఆర్ఎస్ విడిచి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి చేర్చుకునే ప్రక్రియకు కేసీఆర్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ వంటి నేతలకు గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం తెలిసిందే. అదే విధంగా ఈటలకు కూడా ఆహ్వానం అందినట్లు చెబుతున్నారు. అయితే కేసీఆర్ ఆహ్వానాన్నీ, ఆఫర్ ను ఈటల నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు చెబుతున్నారు. కాగా ఒక వైపు ఈటలను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించి డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ప్రలోభ పెడుతూనే మరో వైపు దేవర్ యాంజాల్ లోని సీతారామచంద్రస్వామి దేవాలయ భూముల కబ్జా అంటూ తెరాస సర్కార్ బెదరింపులకు దిగుతోందని, భూ కబ్జా ఆరోపణలను తెరమీదకు తెస్తూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతోందనీ బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
దేవరయాంజాల్‌లోని సీతారామచంద్రస్వామి దేవాలయ భూముల కబ్జాపై విచారణ జరిపిన ఐఏఎస్ అధికారుల కమిటీ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించిన సంగతి విదితమే. ఒక వైపు ప్రలోభాలు, మరో వైపు బెదరింపులతో ఎలాగైనా ఈటలను తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టకండా నిలువరించాలన ప్రయత్నిస్తోందని ఆ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ బీజేపీ పగ్గాలు ఈటల చేతికి అప్పగిస్తే రాష్ట్రంలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందన్న ధీమా అయితే బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమౌతోంది.