కాంగ్రెస్ లో లుకలుకలు.. స్టార్ క్యాంపెయినర్ జాబితాలో శవిథరూర్ కు దక్కని చోటు
posted on Nov 16, 2022 @ 4:54PM
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు గాంధీయేతర కుటుంబానికి చెందిన మల్లికార్జున్ ఖర్గే చేపట్టిన తరువాత కూడా పార్టీలో జి23 నేతల ప్రభావంపై పార్టీలో ఆందోళన ఇసుమంతైనా తగ్గలేదు. పైపెచ్చు వారికి పార్టీలో ప్రాధాన్యతను తగ్గిస్తున్నారు.
తద్వారా పొమ్మన లేక పొగపెట్టిన చందంగా వారంతట వారే బయటకు వెళ్లే పరిస్థితి కల్పిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో.. అంటే సోనియా గాంధీ అధినేత్రిగా ఉన్న సమయంలో ఆమె నిర్ణయాలను ప్రశ్నించిన సీనియర్లను పక్కన పెట్టిన సంగతిని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. వారిలో గులాం నబీ ఆజాద్ ఆయనంతట ఆయనగా పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్న సంగతి విదితమే.
ఇప్పుడు కాంగ్రెస్ లో ఆ పరిస్థితి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ కు ఎదురౌతున్నట్లుగా కనిపిస్తున్నది. తాజాగా పార్టీ అధ్యక్ష ఎన్నికలో మల్లికార్జున్ ఖర్గేకు పోటీగా నిలబడి పరాజయం పాలైన శశిథరూర్ కు అవమానం ఎదురైంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని రాజకీయ పార్టీలు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్ కూడా ఆ రాష్ట్రంలో బాగా పుంజుకుందని సర్వేలు చెబుతున్న వేళ గ్రాండ్ ఓల్డ్ పార్టీలో విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో స్థానం దక్కలేదు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్లు పార్టీ అధ్యక్షుడి తీరును తప్పుపడుతూ పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే.
ఇలాంటి తరుణంలో శశిథరూర్‌కు స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో స్థానం కల్పించకుండా అవమానించడం ద్వారా పార్టీ ఆయనకు బయటకు దారి చూపిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో శిశిథరూర్ కు స్థానం కల్పించకపోయినా గుజరాత్ లో ప్రచారానికి రావాల్సిందిగా ఆ రాష్ట్ర విద్యార్థి సంఘం ఆయనను ఆహ్వానించింది. అయితే వారి ఆహ్వానాన్ని శశిథరూర్ మన్నించలేదు. ఇక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 40 మందితో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్, సచిన్ పైలట్, కన్హయ్య కుమార్, అశోక్ చవాన్, తదితరులు ఉన్నారు.
మరో వైపు రాజస్థాన్ లోనూ పార్టీలో లుకలుకలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ పదవికి పార్టీ సీనియర్ నేత అజయ్ మకేన్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాకు ఆయన చెబుతున్న కారణం.. ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు మద్దతుగా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోకపోవడమే అంటున్నారు. తన రాజీనామా లేఖను మకేన్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపినట్లు చెబుతున్నారు. గత సెప్టెంబర్‌లో కాంగ్రెస్ అధ్యక్షు ఎన్నికలో పోటీ చేసేందుకు సిద్ధపడిన అశోక్ గెహ్లాట్ స్థానంలో మరో వ్యక్తిని ఎన్నుకునేందుకు కీలక సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ గెహ్లాట్ విధేయులైన 90 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆ సమావేశానికి గైర్హాజరై తన ధిక్కారాన్ని వ్యక్తం చేశారు.
సీఎం పదవి నుంచి గెహ్లాట్‌ను తప్పించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా తమ రాజీనామా పత్రాలను సమర్పించేందుకు స్పీకర్ వద్దకు వెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఎమ్మెల్యేలు మహేష్ జోషి, ధర్మేంద్ర రాథోర్, శాంతి ధరివాల్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అజయ్ మాకెన్ అధిష్ఠానానికి సిఫారసు చేశారు. అయితే, ఇంతవరకూ వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడంపై అజయ్ మాకెన్ కొద్దికాలంగా అసంతృప్తితో ఉన్నారు.
దానికి తోడు ఇప్పడు గెహ్లాట్ కు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చోటు కల్పించడంతో మాకేన్ రాజీనామా చేశారని అంటున్నారు. రాజస్థాన్‌లో రాజకీయ అస్థిరతకు చరమగీతం పాడాలంటూ రెండు వారాల క్రితం సచిన్ పైలట్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో మకేన్ రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. రాజస్థాన్‌లోని వచ్చే నెల ప్రారంభంలో భారత్ జోడో యాత్ర రానుండటం, డిసెంబర్ 4న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో మకేన్ రాజీనామా పార్టీని సంక్షోభంలోకి నెట్టేసినట్లైంది.