ఏపీ సర్కార్ కు ఎన్జీటీ ఫైన్..రూ.5 కోట్లు
posted on Nov 16, 2022 @ 9:33AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టుల్లో మొట్టికాయలు, హరిత ట్రైబ్యునల్ జరిమానాలు ఒక అలవాటుగా మారిపోయాయా. పర్యావరణ పరిరక్షణ, నిబంధనలు, కోర్టు ఉత్తర్వులు అంటే ఖాతరీ లేని తీరే ఇందుకు కారణమా అంటే పరిశీలకులు క్షణం ఆలస్యం చేయకుండా ఔనని బదులిచ్చేస్తున్నారు.
తాజాగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఏపీ సర్కార్ కు రూ.5 కోట్లు జరిమానా విధించింది. పేదలకు ఇళ్ల పేర ఏపీ సర్కార్ మడ అడవులను ధ్వంసం చేసేసిందని పేర్కొంటూ ఈ జరిమానా విధించింది. కాకిడాన శివారు దమ్మాల పేటలోని మడ అడవులను జగన్ ప్రభుత్వం ద్వంసం చేసేసిందని పేర్కొంది. సీఆర్‌జడ్ నిబంధనలు, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని జగన్ సర్కార్ ఉల్లంఘించిందంటూ అందిన ఫిర్యాదు మేరకు విచారించిన ట్రిబ్యునల్ పర్యావరణ విధ్వంసం వాస్తవమేనన్న నిర్ణయానికి వచ్చి ఈ మేరకు జరిమానా విధించింది.
ఇళ్ల స్థలాల పేరుతో అడవులను ధ్వంసం చేయడాన్ని ఎన్జీటీ తీవ్రంగా తప్పుబట్టింది. సీఆర్ జడ్-1ఏ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో ఇళ్ల స్థలాల ప్రాజెక్టు చేపట్టొద్దని విస్పష్టంగా ఆదేశించింది. మడ అడవుల సంరక్షణపై ప్రభావం పడేలా భూ వినియోగ మార్పిడి కోసం అధికార యంత్రాంగం ప్రయత్నించడం తగదని హెచ్చరించింది. ఇప్పటికే అక్కడ జరిగిన విధ్వంసానికి మధ్యంతర పరిహారం కింద ఆరు నెలల్లోగా రూ. 5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.
ఈ జరిమానా మొత్తాన్ని మడ అడవుల సంరక్షణకు వ్యయం చేయాలని ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొంది. అలాగే అడవుల విధ్వంసం ఏ మేరకు జరిగింది, ధ్వంసమైన మేర అడవులను పునరుద్ధరించేందుకు ఎంత వ్యయం అవుతుంది అన్న అంశాలపై అధ్యయనం కోసం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది.