ఢిల్లీ లిక్కర్ స్కాం.. తెలుగు రాష్ట్రాలలో డొంకలు కదులుతున్నాయి
posted on Nov 16, 2022 @ 9:55PM
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులకు ఈ స్కాంతో లింకులు ఉన్నట్లుగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ స్కాంకు సంబంధించి బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రైవేట్ చార్టర్డ్ విమానాల ద్వారా భారీ ఎత్తున నగదును ఢిల్లీ, తదితర ప్రాంతాలకు తరలించారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల అండతోనే ప్రైవేటు ఛార్టర్డ్ విమానాల ద్వారా నగదు తరలింపు జరిగిందని విశ్వసిస్తున్నాయి. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ప్రైవేట్ చార్టర్డ్ విమానాల రాకపోకలను నిలిపివేశారు.
అంతే కాకుండా ఈ నగదు తరలింపునకు జెట్ సెట్ గో విమానాలను ఉపయోగించారని అనుమానిస్తున్న ఈడీ ఆ విమానాల ద్వారా ప్రయాణించిన వారి జాబితాను కోరుతూ ఈడీ లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక ప్రత్యేకంగా పేర్కొనాల్సిన విషయమేమిటంటే ప్రైవేటు చార్టర్డ్ విమానాలను అద్దెకిచ్చే సెట్ జెట్ గో కంపెనీ ఓనర్ కనికా టేక్రివాల్ రెడ్డి అనే మహిళ. ఈ కనికా టేక్రీవాల్ రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇటీవల అరెస్టయిన అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి సతీమణి. కనికా టేక్రీవాల్ రెడ్డి జెట్ సెట్ గో కంపెనీ ద్వారా ప్రైవేట్ ఛార్టర్డ్ విమాన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈమె కంపెనీకి చెందిన విమానాల రాకపోకలు, వాటిలో ప్రయాణించిన వారి వివరాలనే కోరుతూ ఇప్పుడు ఈడీ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. అక్టోబర్ 17న ఈడీ రాసిన లేఖను ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలోని అన్ని విమానాశ్రయ డైరెక్టర్లకు పంపింది.
కనికా టేక్రీవాల్ రెడ్డి చెందిన విమానాల్లో కీలక వ్యక్తులు, ప్రముఖులు ప్రయాణాలు సాగించినట్లు ఇప్పటికే ఈడీ నిర్ధారించింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు కనికా టేక్రీవాల్ రెడ్డి కంపెనీకి చెందిన విమానాలను ఉపయోగిస్తున్నారని కూడా ఈడీ దర్యాప్తులో తేలిందని అంటున్నారు. ఏపీకి చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎవరికి ప్రైవేట్ ఛార్టరడ్డ్ ఫ్లైట్ అవసరమైనా సమకూర్చేది కనికా టేక్రీవాల్ రెడ్డేనని దర్యాప్తులో వెల్లడైనట్లు ఈడీ చెబుతోంది.
చార్టెర్డ్ విమానాలకు అధిక అద్దెలు వసూలు చేసినట్లు ఇప్పటికే కనికా టేక్రీవాల్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్‌లో ఏపీకి చెందిన ఉన్నత స్థాయి నేతలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఢిల్లీ మద్యం స్కాంకు సంబంధించిన నగదును కనికా టేక్రీవాల్ రెడ్డి కి చెందిన విమానాలలోనే తరలించారని ఈడీ అనుమానిస్తోంది.
అందుకే ఈ కంపెనీకి చెందిన విమానాలు బేగంపేట నుంచి ఎక్కడెక్కడకు వెళ్లాయి.. ఈ విమానాల్లో ఎవరెవరు ప్రయాణించారన్న వివరాలను ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాసి మరీ సేకరించింది. ఈ వివరాలతో ఢిల్లీ లిక్కర్ స్కాం పాత్రధారులు, సూత్ర ధారులెవరన్నది పూర్తి ఆధారాలతో సహా బయటపడతాయని భావిస్తున్నారు.