తెలంగాణపై చలి పులి పంజా!
posted on Nov 16, 2022 9:19AM
తెలంగాణ చలిపులి పంజా దెబ్బకు విలవిలలాడుతోంది. ఒక్క సారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఉదయం పది గంటల వరకూ బయటకు రావాలంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొని ఉంది. విపరీతమైన చలి కారణంగా ఆరోగ్య సమస్యలు సైతం తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మంగళవారం(నవంబర్15)న రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యల్పంగా 0.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 20వ తేదీ వరకూ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల వరకూ పడిపోవచ్చని పేర్కొన్నారు.
విపరీతంగా పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. శ్వాస సంబంధిత రుగ్మతలు ఉన్న వారు మరీ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పొగ మంచు కారణంగా వాయుకాలుష్యం కూడా హెచ్చుగా ఉంటుందని హెచ్చరించారు. మాస్కుల వాడకం ద్వారా కాలుష్యం ముప్పును కొంత వరకూ అధిగమించవచ్చని పేర్కొన్నారు.
ఉత్తర తెలంగాణ జిల్లాను వణికిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రంగా ఉంటోంది. దీంతో జిల్లా ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. చలికి తోడు గాలులు కూడా వీస్తుండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో గత ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి.మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.