వచ్చే ఏడాది డిసెంబర్ లోనే ఏపీ ఎన్నికలు!?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలు కొంతకాలంగా వస్తున్నాయి. ఆ ఊహాగానాలకు బలం చేకూరుస్తు వచ్చే ఏడాది డిసెంబర్ లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరిగే 2023 డిసెంబర్ లోనే ఏపీలోనూ ఎన్నికలు నిర్వహించాలని జగన్ భావిస్తున్నారంటూ, అందుకు పలు అంశాలు తెరమీదకు తెస్తున్నారు.
రెండోసారి కూడా ఏపీ అధికారపీఠంపై తానే కూర్చోవాలని సీఎం జగన్ గట్టిగానే వ్యూహాలు రచిస్తున్నారు. అంతే కాకుండా పార్టీ నేతలు, బాధ్యులు, జిల్లాల ఇన్ చార్జులతో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాల్లో వారికి జగన్ నేరుగానే ఆదేశాలు జారీచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ‘175 అవుటాఫ్ 175 వైనాట్?’ అంటూ వారిని ఊదరగొడుతున్నారు. అంటే.. ఆ ఎన్నికల తర్వాత ఏపీలో ప్రతిపక్షం అనే మాటే లేకుండా చేయాలని, ఏకపక్షంగా రాష్ట్రాన్ని ఏలాలనే గట్టి పట్టుదలతో జగన్ ఉన్నారంటున్నారు. అంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఉనికే లేకుండా చేయాలనేది జగన్ మిషన్ అంటున్నారు.
పరిపాలనలో అనుభవ రాహిత్యంతో ఏపీని ‘అప్పుల ఆంధ్ర’గా మార్చేసిన జగన్, అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకు అనుభవంలోకి రాకుండా చేసిన జగన్, విధ్వంసంతో ఏలుబడి ప్రారంభించి, ఈ మూడున్నరేళ్లుగా అదే పంథాలో కొనసాగుతున్న జగన్ పట్ల, వైసీపీ నేతల తీరుపట్ల విపక్షాల్లో, రాష్ట్ర ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని పూర్తికాలం కొనసాగాక ఎన్నికలకు వెళ్లే.. వ్యతిరేకత మరింత పెరిగిపోయి, కొంప కొల్లేరవుతుందని, పార్టీకి పుట్టగతులు ఉండవని, రాష్ట్రాన్ని ముప్పై ఏళ్లు తానే ఏలాలనే ఆశ ఆడియాస అయిపోతుందనే భయం జగన్ లో గూడుకట్టుకుందంటున్నారు. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లి లబ్ధి పొందాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయంటున్నారు.
ఏపీలో ఇప్పటికే జనసేన- బీజేపీ పొత్తులో ఉన్నాయి. మరో పక్కన వైసీపీ సర్కార్ వైఫల్యాలు, జగన్ రెడ్డి ప్రజా వ్యతిరేక తీరుతెన్నులపై తెలుగుదేశం అధినేత, నాయకులు నిత్యం విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వైజాగ్ సంఘటన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ పై నేరుగా యుద్ధం ప్రకటించి, రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించారు. రోజులు గడిచే కొద్దీ జనసేన- బీజేపీ కూటమికి బలమైన క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా తోడయ్యే సూచనలు కనిపిస్తున్నాయనే రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి.
ఏపీ అసెంబ్లీకి కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే పోలింగ్ నిర్వహిస్తే.. అది జగన్ కోరికకు, ఆశకు గండి పడే ప్రమాదం ఉందంటున్నారు. అడగకుండా ప్రతిసారీ తనకు మద్దతు ఇస్తున్న వైసీపీ పట్ల బీజేపీ అగ్రనేతలు మోడీ-షా జోడీకి ఎక్కడో ఏదో ఆగ్రహం ఉన్న ఛాయలే కనిపిన్నాయి. అందుకే విశాఖలో ఇటీవలి మోడీ పర్యటన, బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు వైసీపీ అధినేత, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంతగా పాటుబడినా పెద్దగా గుర్తించలేదంటారు. పైగా వైసీపీపై యుద్ధం ప్రకటించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా పిలిపించుకుని అరగంటకు పైగా మోడీ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ పెద్దల కన్నా జనసేనానికే మోడీ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో స్పష్టం అయిందంటున్నారు.
2024 మేనెలలో సాధారణ ఎన్నికల సమయంలోనే ఏపీ ఎన్నికలు కూడా జరిగితే.. అప్పుడు మోడీ ఫీవర్ గట్టిగా ఉంటే.. తనకు ఇబ్బంది తప్పదని జగన్ లెక్కలు వేసుకుంటున్నారని చెబుతున్నారు. సాధారణ ఎన్నికలతో పాటు ఏపీ ఎన్నికలు కూడా జరిగితే.. మోడీ- షా ద్వయం రాష్ట్రంలో ఉధృతంగా పర్యటిస్తే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాలుగు దిక్కులా విపరీతంగా ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉంటుందంటున్నారు.
అందుకే.. 2023 డిసెంబర్ లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే సమయంలో ఏపీలో ముందస్తుకు వెళ్తే.. ప్రయోజనం ఉండొచ్చనే నిర్ణయానికి జగన్ వచ్చారని తెలుస్తోంది. అలా ఎన్నికలు జరిపితే.. తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ నేతలు, అధినేతలు అక్కడే ఎక్కువగా ఫోకస్ పెడతారని, తద్వారా ఏపీపై అంతగా వారి ప్రభావం ఉండదని జగన్ బేరీజు వేసుకుంటున్నారంటున్నారు.
తెలంగాణలో టీడీపీ మద్దతును బీజేపీ కచ్చితంగా తీసుకుంటుందనే ఊహాగానాలు వస్తున్నాయి. అందుకు ప్రతిగా ఏపీలో టీడీపీకి బీజేపీ పొత్తు కుదురుతుందన్న అంచనాలు ఉన్నాయి. దాంతో టీడీపీ, బీజేపీ, జనసేనల నుంచి గట్టి పోటీనే వైసీపీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే జరిగితే తన ముప్పై ఏళ్ల అధికారం కల కలగానే మిగిలిపోతుందనే భయం జగన్ లో నెలకొందని అంటున్నారు.
ఏపీలో ముందే ఎన్నికలు నిర్వహించి, అధికారం మళ్లీ చేజిక్కించుకుంటే.. పార్లమెంట్ ఎన్నికలపై ఆ ఫలితాల ప్రభావం ఉంటుందనేది వైసీపీ అధినేత అభిప్రాయం అంటున్నారు. అప్పుడు మరిన్ని ఎక్కువ లోక్ సభా స్థానాలు తాము గెలుచుకోవచ్చనేది జగన్ వ్యూహం అని చెబుతున్నారు. ఇలాంటి కారణాలతోనే జగన్ ముందస్తు ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.