పొత్తులే సార్వత్రిక ఫలితాన్ని నిర్ణయిస్తాయా?
posted on Nov 16, 2022 @ 12:20PM
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శతృవులు ఉండరు... ఇది ఎవరంగీకరించినా అంగీకరించకున్నా యూనివర్సల్ ట్రూత్.. అందుకే పార్టీల మధ్య స్నేహ సంబంధాలు అటూ ఇటూ కావడం తరచూ జరుగుతుంటుంది. పొత్తులు, కూటములు విచ్చిన్నం కావడం.. అలాగే పాత పొత్తులు వాడి, కొత్త పొత్తులు చిగురించడం రివాజు. ఇటీవల బీహార్ లో ఏం జరిగిందో చూశాం. మహారాష్ట్రలో శివసేన ఎలా చీలిపోయిందో చూశాం. ఇలా చీలిక వర్గం చిటికెలో కమలంతో ఎలా జట్టు కట్టిందో చూశాం. బీహార్ లో అయితే రెండేళ్ళ క్రితం 2020 అక్టోబర్, నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనతా దళ్ (యు) పార్టీలు పొత్తు పెట్టుకుని, ఒకే కూటమిగా (ఎన్డీఎ) పోటీ చేశాయి. కూటమి విజయం సాధించింది.
ఎన్డీఎ ప్రభుత్వం ఏర్పడింది. జేడీయు కంటే బీజేపీకి రెట్టింపు సీట్లు వచ్చినా, మిత్ర ధర్మం మేరకు జేడీయు నేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ మిత్రధర్మాన్ని బీజేపీ జేడీయూలు రెండేళ్లు కూడా పూర్తిగా పాటించలేకపోయారు. నితీష్ కుమార్ బీజేపీని వదిలించుకుని ఆర్జేడీ చేయి పట్టుకున్నారు. మళ్లీ బీహార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. నితీష్ కుమార్ మనసు మళ్ళీ ఎప్పుడు మారుతుంది, ఈ ప్రభుత్వం ఎంతకాలం మనుగడ సాగిస్తుందనే ప్రశ్నలను పక్కన పెడితే.. రాజకీయ ఎన్నికల పొత్తులకు సంబంధించి ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఈ ఉదంతం రుజువు చేసింది. ఔను నిజమే ఎందుకంటే.. ఇంతకు ముందు ఇదే బీహారులో ఇదే తరహ పొత్తులు కుడి ఎడమలు అయిన సందర్భాలున్నాయి.
మహారాష్ట్రలోనూ కొంచెం అటూ ఇటుగా అదే జరిగింది. ఇతర రాష్ట్రలలోనూ, చివరకు జాతీయ స్థాయిలోనూ ఇలాంటి ఉదంతాలు అనేక ఉన్నాయి. కూటమిలో వచ్చిన కుమ్ములాటల కారణంగా ఒకే ఒక్క ఓటు తేడాతో అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం కూలి పోయింది. అదలా ఉంచితే, ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల వరకు పొత్తులు, ఎత్తులకు సంబంధించిన చర్చలే జోరుగా జరుగుతన్నాయి. టీవీ డిబేట్స్ మొదలు రచ్చబండ రాజకీయ చర్చల వరకు పొత్తుల సెంట్రిక్ గానే జరిగాయి. ఎవరితో ఎవరు జట్టు కడతారు, ఎవరితో ఎవరు చేతులు కలుపుతారు ఎవరు ఎవరితో చేతులు కలిపితే ఫలితాలు ఎలా తారుమారు అవుతాయి అనే లెక్కల చుట్టూనే చర్చలు సాగుతున్నాయి.
ఆంద్ర ప్రదేశ్’ లో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తుపొడుపు కథ రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ మధ్య కేంద్రం ఆహ్వానం మేరకు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు హస్తిన వెళ్లిన చంద్రబాబుతో.. మడీ ఆప్యాయంగా మాట్లాడటం.. తనంత తానే స్వయంగా చంద్రబాబు వద్దకు వచ్చి మరీ మాట్లాటం, మరో మారు కలుద్దామంటూ ఆహ్వానించడంతో ఏపీ నేతపై మరోసారి కమలం సైకిల్ కలిసి నడుస్తాయన్న చర్చ విస్తృతంగా నడిచింది. అయితే ఆ తరువాత ఆ దిశగా ఎలాంటి పురోగతీ కనిపించలేదు. అసలు అంత కంటే ముందుగానే పొత్తు పొడుపుల చర్చకు జనసేనాని పవన్ కల్యాణ్ తెరలేపారు.
రాష్ట్రంలో ప్రబుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీల నీయను అంటూ.. పొత్తుల ఊహాగాన సభలకు తెర తీశారు. అదలా ఉంచితే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఏపీ అభివృద్ది కోసం అవసరాన్ని బట్టి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడం ద్వారా పొత్తు ఊహలను సజీవంగా ఉంచడానికి తన వంతు దోహదం తాను చేశారు. నిజం, గతంలోనూ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే, ప్రత్యేక హోదా కోసమే పెట్టుకున్న పొత్తును తుంచేసుకుంది. ఇప్పుడు కూడా అదే పద్దతిలో, ఎన్నికలు వచ్చినప్పుడు, అప్పటి రాజకీయ పరిస్థితి, రాజకీయ అవసరాలు, అన్నిటినీ మించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడమే సరైన నిర్ణయం అవుతుందని టీడీపీ భావిస్తోంది.చంద్రబాబు నాయుడు చెప్పింది కూడా అదే.
నిజానికి ఇప్పడు కాదు, మొదటి నుంచి చంద్ర బాబు నాయుడు పొత్తుల చర్చలకు ఇంకా సమయం రాలేదనే అభిప్రాయం తోనే ఉన్నారు. అయితే పొత్తుల ఊసును పూర్తిగా కొట్టిపారేయకండా చర్చలో ఉండేలా మాట్లాడారు. అదలా ఉంటే తెలంగాణలో మునుగోడులో అధికార తెరాసకు మద్దతు ఇవ్వడం ద్వారా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కేసీఆర్ జాతీయ పార్టీకి అండగా ఒక ప్లాట్ ఫామ్ కు క్రియేట్ చేశారని చెప్పాలి. అంతే కాకుండా కొత్త పొత్తులకు పాత తగవులు అడ్డు రావని, లెఫ్ట్ పార్టీలు ఈ పొత్తు ద్వారా నిరూపించారు. ఇక ఇప్పుడు ఆ పార్టీలకు బీజేపీ తెలుగుదేశం పార్టీల పొత్తు.. ఒక వేళ భవిష్యత్ లో కుదిరితే.. మాట్లాడే నైతికత లేనట్లేనని పరిశీలకులు అంటున్నారు. అయితే ఇక్కడ నైతిక విలువలు అవీ ఇవీ అని మాట్లాడవలసిన అవసరం లేదు.
సిపిఐ, సిపిఎం పార్టీలు బీజేపీని ఓడించేందుకు తెరాసకు మద్దతు ఇస్తున్నామని చెప్పుకోవడం తాడి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే ... ఆవుదూడ మేతకు అన్నట్లు ఉందని కొందరు అంటున్నారు , అందుకు కారణం, గతంలో కేసేఆర్ లెఫ్ట్ పార్టీలను, ఆ పార్టీ నాయకులను ఎంతగా చులకన చేశారు, ఎంతగా అవహేళన చేశారు, అలాగే లెఫ్ట్ నేతలు కేసీఆర్ ను ఏ భాషలో దూషించారు, అనేది అందరికీ తెలిసినదే. ఇక దేశ వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్నది ఏపీలో పొత్తులు ఎటు తిరిగి ఎటు కుదురుతాయి అన్న అంశంపైనే. విశాఖలో జనసేనాని పర్యటనను అధికార పార్టీ అడ్డుకున్న తరువాత ఆవేశంతో ఆయన చేసిన ప్రసంగం, చంద్రబాబు స్వయంగా కదిలి వచ్చి మరీ తెలిపిస సంఘీ భావం తరువాత తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు పొడిచేసిందనే విశ్లేషణలు వెల్లు వెత్తాయి.
చంద్రబాబు, పవన్ సంయుక్తంగా అప్పట్లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా పవన్ కల్యాణ్ రాష్ట్రంలో బీజేపీ నేతలతో కలిసి ముందుకు నడవలేని పరిస్థితి ఉందన్న నిర్వేదం వ్యక్తం చేశారు. దీంతో తెలుగుదేశంతోనే ఆయన అడుగులు వేయనున్నారన్న నిర్ధారణకు రాజకీయ వర్గాలు వచ్చేశాయి. అయితే తాజాగా విశాఖలో మోడీతో భేటీ తరువాత పవన్ స్వరంలో మార్పు కనిపించింది. ఒంటరి పోరుపై సంకేతాలిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా జాతీయ స్థాయిలో పొత్తు పొడుపులే సార్వత్రిక ఫలితాన్ని నిర్ణయిస్తాయన్న చర్చ అయితే రాజకీయ వర్గాలలో విస్తృతంగా జరుగుతోంది.