యాంగర్.. ఎమోషన్.. ఇన్స పిరేషన్.. చంద్రబాబులో కొత్త డైమన్షన్స్!
posted on Nov 19, 2022 5:32AM
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సరికొత్త డైమన్షన్స్ తో జనం మధ్యకు వచ్చారు. ఇంతకు ముందు కన్నా చంద్రబాబు మాటల్లో మంచి ఫైర్ కనిపిస్తోంది. చెప్పాల్సిన విషయం జనం గుండెలను సూటిగా తాకేలా చెబుతున్నారు. సీఎం జగన్ రెడ్డిపై నిశితంగా విమర్శలు చేస్తూనే.. పదునైన మాటల తూటాలు పేలుస్తున్నారు. జగన్ పాలనా విధానాలను తూర్పారపడుతూనే.. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఏమిచేస్తామనేది క్లియర్ గా చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో చంద్రబాబులో ఈ సరికొత్త యాంగిల్ స్పష్టంగా కనిపిస్తోందని జనం అంటున్నారు. చంద్రబాబు తాజాగా మాట్లాడుతున్న మాటల్ని చూస్తే.. ఆయనలో ఇంత ఫైర్ గతంలో ఎప్పుడూ చూడలేదని జనం ఆశ్చర్యపోతున్నారు.
జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపితే తప్ప ఏపీకి.. రాష్ట్ర ప్రజలకు మోక్షం లేదు. రాష్ట్రానికి వైసీపీ దొంగలు చేసిన అన్యాయం మర్చిపోతామా? అంటూ నిప్పులు చెరుగుతున్నారు. నేను అసెంబ్లీకి వెళ్లాలంటే.. రాజకీయాల్లో ఉండాలంటే.. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే. రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించక తప్పదు. లేదంటే నేను అసెంబ్లీ వెళ్లలేను అని చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించడం ప్రజలకు ఎంత అవసరమో సూటిగా ప్రజల హృదయాలకు హత్తుకునేలా చెబుతుండడం గమనార్హం. నా నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో నన్ను అవమానించే సాహసం ఎవరూ చేయలేదు. కానీ.. జగన్ సారథ్యంలోని వైసీపీ సభ్యులు అసెంబ్లీ సాక్షిగా నన్ను.. నా సతీమణిని అవమానించారు. అది గౌరవసభ కాదు.. కౌరవసభ. మళ్లీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెడతానని ఆ రోజు చెప్పాను. నేను అసెంబ్లీ వెళ్లాలంటే.. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే.. రేపు జరిగే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని మిమ్మల్ని అడుగుతున్నా’ అని చంద్రబాబు చేసిన అప్పీల్ ప్రజలను కదిలించేదిగా ఉంది.
వచ్చే ఎన్నికల్లో జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించి కోలుకోకుండా చేస్తా.. పవన్ కళ్యాణ్ సభకు స్థలం ఇచ్చారనే కక్షతో రోడ్ల విస్తరణ పేరుతో గుంటూరు జిల్లా ఇప్పటంలో ఇళ్లన్నీ కూలగొట్టారు. ఎంత కొవ్వెక్కితే.. ఇలాంటి దుర్మార్గాలకు దిగుతారు? నేను అనుకుంటే జగన్మోహన్ రెడ్డి రోడ్డుపై తిరిగేవారా? ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందర్నీ కలుపుకుని వెళ్లాం. ఓట్లు వేయటం మీ ఇష్టం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం సీనియర్ నాయకుడిగా నా బాధ్యత’ వచ్చే ఎన్నికల్లో టీడీపీని మీరు గెలిపించి, అసెంబ్లీకి పంపిస్తే సరి.. లేదంటే ఇదే నాకు చివరి ఎన్నిక’ అని చంద్రబాబు అంటూ.. ఎన్నడూ లేని విధంగా ఎమోషనల్ అవడంతో ప్రజలు కదిలిపోయారు.
‘జగన్ ఇచ్చేది గోరంత.. దోచేసేది కొండంత. జగన్ రెడ్డీ మీ నాన్నను చూశా.. మీ తాతను చూశా.. నీకు భయపడతానా..? నేను ఎవరికీ భయపడను’ అంటూ జగన్ కు చంద్రబాబు స్పష్టమైన హెచ్చరిక చేయడం విశేషం. ‘ఏపీలో భూ బకాసురుడిని, నరరూప రాక్షసుడిని కట్టడి చేయాలి.. లేదంటే ఎవరినీ వదిలిపెట్టడు’ అని రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు స్పష్టమైన సూచన చేశారు. ‘రాష్ట్రంలో రోడ్ల గుంతల్లో గంపెడు మట్టి వేయని జగన్ రెడ్డి మూడు రాజధానులు కడతానంటే ఎలా నమ్మాలి?’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ‘జగన్ కు పాలించడం చేతకాదు. నియంతలా మారాడు. అండర్ వరల్డ్ డాన్ దావూడ్ ఇబ్రహీంను మించిపోయాడు. మద్యం తయారీ కేంద్రాలన్నీ జగన్ వే.. ఆరు వేల స్కూళ్లను మూసేశాడు. ఒక్క టీచర్ పోస్లు కూడా భర్తీ చేయలేదు. రాయలసీమకు ఒక్క పరిశ్రమను కూడా తేలేదు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశాడు’ అని చంద్రబాబు ప్రజలను హెచ్చరించడమే కాకుండా, ‘తన బాబాయ్ వివేకానందరెడ్డిని చంపి, నారాసుర రక్త చరిత్ర అని వాళ్ల పేపర్లో రాశారు. తండ్రిని చంపిన హంతకులకు శిక్ష పడాలని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టుకు వెళ్లింది. జగన్ ఏలుబడిలో ఉన్న ఏపీలో తనకు న్యాయం జరగదని, కేసు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని పోరాటం చేస్తోంది. ఆమెకు మనమంతా అండగా నిలబడదామ’ని చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
చంద్రబాబు ఎప్పుడైనా.. ఎక్కడైనా సందర్భానికి అనుగుణంగా, వివరణాత్మకంగా మాట్లాడతారనే పేరుంది. అలాంటి చంద్రబాబులో కర్నూలు జిల్లా పర్యటనలో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకున్న తీరు, కొత్త తరహాలో మాట్లాడుతున్న వైనం బాగా ఆకట్టుకుంటోంది.