లిక్కర్ స్కాం నుంచి కవితను రక్షించుకునే వ్యూహమేనా?
posted on Nov 19, 2022 9:08AM
తన కుమార్తెను కూడా బీజేపీలో చేరమని అడిగారని, అంత కంటే దారుణం ఉంటుందా అంటూ కేసీఆర్ పార్టీ అంతర్గత సమావేశంలో అన్నారు. తన తండ్రి మాటలు అక్షర సత్యాలనీ, బీజేపీనుంచి తనకు ఆఫర్ వచ్చిందనీ, తెలంగాణలో షిండే మోడల్ అమలు చేయడం పై మాట్లాడానీ కవిత చెప్పారు. షిండే మోడల్ అంటే.. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే శివసేనకు చెందిన ఎమ్మెల్యేలను చీల్చి ఆ తరువాత తనదే శివసేన అని ప్రకటిం కోవడంఅన్నమాట.
ఆ తరహా రాజకీయం చేయాలని తనకు ఆఫర్ వచ్చిందని కవిత చెబుతూ తన తండ్రి మాటలకు వత్తాసు పలుకుతున్నారు. ఇక్కడే రాజకీయ వర్గాలలో పలు ప్రశ్నలు వినవస్తున్నాయి. ఇదే కేసీఆర్ తన పార్టీకి చెందిన ఓ నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేసి, కొనుగోలుకు బేరసారాలు చేసిందని ఆరోపిస్తూ ఊరూ వాడా ఏకం చేశారు. కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా.. తెరాస ఎమ్మెల్యే పటేల్ రోహిత్ రెడ్డి పామ్ హౌస్ లో బీజేపీ దూతలు తెరాస ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారంటూ అందుకు సంబంధించి ఆడియోలు, వీడియోలూ విడుదల చేశారు. అంతటితో ఊరుకోకుండా మీడియా సమావేశం పెట్టి మరీ ఆరోపణలు గుప్పించారు.
ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలనే కాదు.. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొట్టడానికి కమలనాథులు భారీ కుట్ర చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తులందరికీ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలకు సంబంధించి తమ స్టింగ్ ఆపరేషన్ తాలూకా ఆడియోలూ, వీడియోలు పంపించారు. అక్కడితో ఆగకుండా దర్యాప్తునకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేశారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో బీజేపీని ఇరికించడానికి అంత ట్రాప్ చేసిన ముఖ్యమంత్రి, తన కుమార్తె విషయానికి వచ్చేసరికి కేవలం బీజేపీ తన కుమార్తెను పార్టీలో చేరాల్సిందిగా కోరిందన్న ఆరోపణలకు మాత్రమే ఎందుకు పరిమితమయ్యారు.
ఆమెతో మాట్లాడిన బీజేపీ పెద్దల మాటలను, వారి సంప్రదింపులను ఎందుకు ఆడియో, వీడియో లలో నిక్షిప్తం చేసి రచ్చ చేయలేదు? అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ వర్గాలు కేసీఆర్ ఒక అంశంలో అంటే నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల విషయంలో ఒకలా.. తన కుమార్తె విషయంలో మరోలా ఎందుకు వ్యవహరించారని నిలదీస్తున్నాయి. అలాగే బీజేపీ ఎంపీ అర్వింద్ కూడా కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో మాట్లాడారు అని ఆరోపించారు. అందుకే తెరాస శ్రేణులు భగ్గుమన్నాయి. హైదరాబాద్ లోని అరవింద్ నివాసంపై దాడికి దిగాయి. స్వయంగా కవిత నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా అని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ తన కుమార్తెను పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ వారు కోరారు అన్న కేసీఆర్ మాటలకు, కవిత ఖర్గేతో చర్చించారన్న ఆర్వింద్ ఆరోపణకూ తేడా ఏముందని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు కేసీఆర్ చేసినదీ, ఇటు అర్వింద్ అన్నదీ కూడా కేవలం నోటి మాటేననీ, ఆరోపణేననీ అంటున్నారు. కేసీఆర్ తనకు తెలిసింది చెప్పినట్లుగానే అరవింద్ తన దృష్టికి వచ్చింది వెల్లడించారని తేడా ఎముంది అంటున్నారు. అదే ఫామ్ హౌస్ వ్యవహారంలో అయితే.. కేసీఆర్ బీజేపీని ఇరికించడానికి పకడ్బందీగా వ్యవహరించారు.
మరి తన కుమార్తె విషయంలో ఎందుకు అలా చేయలేదు? బట్ట కాల్చి మొహాన వేసిన చందంగా కేవలం ఆరోపణలకే ఎందుకు పరిమితమయ్యారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఇంతకీ కేసీఆర్ తన కుమార్తెను ప్రలోభాలకు గురి చేసి పార్టీలో చేర్చుకోవడానికి బీజేపీ పెద్దలు ప్రయత్నించారని అంటున్నారే కానీ.. కవితతో ఎవరు సంప్రదించారు, ఎం చర్చించారు వంటి వివరాలను అటు కేసీఆర్ కానీ, ఇటు తండ్రి మాటలు అక్షర సత్యాలన్న కవిత కానీ వెల్లడించడం లేదు. ఆ వివరాలు ఎందుకు వెల్లడించడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఫామ్ హౌస్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ముందుగా కవితను విచారించి స్టేట్ మెంట్ ఎందుకు తీసుకోవడం లేదన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. వేర్వేరు ఘటనలైనా ఫామ్ హౌస్ ప్రలోభాలూ, కవితకు ఆఫర్ ఒకే కోవకు చెందుతాయని అంటున్నారు. రెండు సంఘటనలనూ వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేదంటున్నారు. అక్కడా బీజేపీయే ఫామ్ హౌస్ వేదికగా తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి కారు దించేసి గులాబీగూటికి చేర్చుకోవడానికి ప్రయత్నిస్తే.. ఇక్కడ కవితను కూడా బీజేపీ దాదాపు అదే విధంగా ఆఫర్లు ఇచ్చిందని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే చెబుతున్నారు కదా.
మరి ఈ విషయంలో సిట్ ఎందుకు కవితను ప్రశ్నించడం లేదనీ, నోటీసు ఇచ్చి ఎందుకు స్టేట్ మెంట్ తీసుకోవడం లేదనీ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద కవితపై ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు రావడానికి ఆమె బీజేపీ ఆఫర్ ను తిరస్కరించడమే కారణమన్నది ఎస్టాబ్లిష్ చేసి ఆమెను రక్షించుకోవాలన్న ప్రయత్నంలోనే కేసీఆర్ ఈ ఆరోపణలు చేసి ఉంటారని, అదే సమయంలో ఈడీ, సీబీఐ,ఐటీ దాడుల వెనుక బీజేపీ విస్తరణ కాంక్ష మాత్రమే ఉందని చాటాలన్నది కేసీఆర్ లక్ష్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికీ ఎమ్మెల్యేల ట్రాప్ చేసు దర్యాప్తు చేస్తున్నసిట్ కవితకు నోటీసులు ఇచ్చి ఆమె స్టేట్ మెంట్ తీసుకోవాలని, ఆమెను సంప్రదించినదెవరో వెల్లడించి వారిపై కేసులు నమోదు చేయాలన్న డిమాండ్ విపక్షాల నుంచి వస్తున్నది. ఒక వేళ అలా జరగకపోతే ఇదంతా కూతురిని రక్షంచుకోవడం కోసం కేసీఆర్ ఆడుతున్న నాటకమే అనుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.