తెలంగాణ కాంగ్రెస్ కు కషాయం.. కాషాయం గూటికి మర్రి
posted on Nov 19, 2022 6:25AM
తెలంగాణ కాంగ్రెస్ పతనం నుంచి పతనానికి జారిపోతోందా? ఒక్కరొక్కరుగా సీనియర్లు పార్టీకి దూరమౌతున్నారా? అంటే ఔననక తప్పని పరిస్థితి ఏర్పడింది. కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి శశిథర్ రెడ్డి కమలం గూటికి చేరనున్నారు.
మర్రి శశిథర్ రెడ్డి హస్తిన వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బీజేపీ నేతలు బండి సంజయ్, డీకే అరుణలు మర్రిని అమిత్ షా వద్దకు తీసుకువెళ్లారు. దీంతో ఆయన కమలం గూటికి చేరడం ఖాయమైపోయినట్లే అంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో మర్రిశశిధర్ రెడ్డి నేడో రేపో కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ప్రచారాన్ని మర్రి శశిధర్ రెడ్డి ఖండించారు. తాను పార్టీ మారడం లేదని, కలిసి ప్రయాణం చేసినంత మాత్రాన పార్టీ మారుతున్నట్లా అని ఎదురు ప్రశ్నించారు. అలా ప్రశ్నించిన రెండు రోజుల్లోనే మర్రి శశిథర్ రెడ్డి అమిత్ షాతో శుక్రవారం (నవంబర్ 18)భేటీ అయ్యారు.