సానుభూతి కోసమే ఉత్తుత్తి ఆరోపణలా?
posted on Nov 19, 2022 @ 10:50AM
ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారాన్ని మించి ఎమ్మెల్సీ కవితను చేర్చుకోవడానికి బీజేపీ పెద్దలు ఆమెను సంప్రదించారన్న ఆరోపణలు దుమారం లేపుతున్నాయి. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావే ఈ ఆరోపణలు చేయడం, తండ్రి మాటలు వాస్తవమేనని కవిత ధృవీకరించడంతో ఇప్పుడీ వ్యవహారం రాజకీయంగా పెను సంచలనానికి కారణమైంది. ఇంతకాలం తెరాసలో షిండేలు అంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కవితను ఉద్దేశించి చేస్తున్నవేనా అన్న చర్చ ఒక్క సారిగా రాజకీయ వర్గాలలో జోరందుకుంది.
ఎందుకంటే . ఎందుకంటే షిండే మోడల్ రాజకీయం అంటే.. పార్టీలో ఉంటేనే దానిని చీల్చి.. పార్టీని సొంతం చేసుకోవడం. సరిగ్గా కవితను కూడా అలా షిండే తరహాలో రాజకీయం చేయాలని బీజేపీ నేతలు తనతో చెప్పారని కవిత అన్నారు. ఈ ఆరోపణలన్నీ ఒకెత్తు అయితే.. బీజేపీపై ఇంతటి తీవ్ర ఆరోపణలు చేసిన తండ్రీ తనయలు (కేసీఆర్, కవిత) కవితను సంప్రదించింది ఎవరు? ఎలా సంప్రదించారు? ఫోన్ లో మాట్లాడారా? స్వయంగా కలిసి చర్చించారా? చర్చలు జరిగాయా? ఎలాంటి ఆఫర్ ఇచ్చారు? ఇత్యాది వివరాలను బయట పెట్టలేదు.
వాటిని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల నుంచి వస్తున్నాయి. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో పకడ్బందీ స్టింగ్ ఆపరేషన్ ను నిర్వహించిన కేసీఆర్ కవిత విషయంలో అలా ఎందుకు వ్యవహరించలేదన్న ప్రశ్న కూడా ఎదురౌతోంది. ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలను బయటపెట్టాల్సిన బాధ్యత కేసీఆర్, కవితల మీద ఉందని, లేకుంటే వాటిని ఎవరూ పట్టించుకోరనీ, రాజకీయ లబ్ధి కోసం చేసిన ఆరోపణలుగానే భావిస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఫామ్ హౌస్ కేసులో విచారణ జరుపుతున్న సిట్ కవితస్టేట్ మెంట్ రికార్డు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమెను సంప్రదించిందెవరో తెలుసుకుని వారి పేర్లు బయటపెట్టి కేసులు నమోదు చేయాలని అంటున్నారు. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. లేకుండా ఇదంతా బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమే అనుకోవలసి ఉంటుందని రేవంత్ అంటున్నారు. తన బిడ్డను కమలం గూటికి చేరాల్సిందిగా బీజేపీ వారు కోరారని కేసీఆర్ ఆరోపించారు
సరే.. కవిత స్వయంగా వారు తనను సంప్రదించారని చెబుతున్నప్పుడు ఆ మేరకు ఇప్పటి వరకూ ఫిర్యాదు ఎందుకు చేయలేదని విపక్షాలు నిలదీస్తున్నాయి. ఫామ్ హౌస్ వ్యవహారంలో సీరియస్ యాక్షన్ తీసుకున్న కేసీఆర్ తన కుమార్తె విషయంలో అలా ఎందుకు వ్యవహరించలేదని ప్రశ్నిస్తున్నాయి. రాజకీయంగా లబ్ధి కోసం, లిక్కర్ స్కాం వ్యవహారంలో కవితపై సానుభూతి కోసమే ఈ ఆరోపణలు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.