కేసీఆర్ చెబుతున్న తెలంగాణ ఎక్ నాథ్ షిండే హరీష్ రావేనా?
posted on Nov 18, 2022 @ 3:58PM
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో బయటకు కనిపించని ఏదో రాజకీయ సంక్షోభం ముదురుతున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలలో తలదూర్చాలని నిర్ణయించుకున్నప్పటి నుంచే తెరాసలో బయటకు కనిపించని ముసలం పుట్టిందని పార్టీ వర్గాలలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఆ ముసలం పుట్టడానికి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరే కారణమని కూడా అంటున్నారు. ఇప్పుడు ఆ ముసలం హరీష్ రావు రూపంలో బయటపడబోతోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. తెరాస రెండో సారి అధికారం చేపట్టినప్పటి నుంచీ కూడా కేసీఆర్ తనయుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చో బెట్టాలన్న వ్యూహంతో కేసీఆర్ వేసిన అడుగులు ఇప్పటి వరకూ తడబడుతూనే ఉన్నాయి. అయితే ఈ తడబాటుకు కారణం పార్టీలోని ఒక వర్గం కేటీఆర్ ను సీఎం పీఠంపై కూర్చో పెట్టడాన్ని బలంగా వ్యతిరేకిస్తుండటమే కారణమని అంటున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తరువాత నుంచీ ఇక ఇహనో ఇప్పుడో కేటీఆర్ ను సీఎం పీఠం మీద కూర్చో పెట్టేయడమే తరువాయి అన్నంతగా పార్టీలోనూ రాజకీయ వర్గాలలోనూ కూడా చర్చోపచర్చలు జరిగాయి. కానీ అది జరగలేదు. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా.. ముందు ముందు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందో, ఆ తరువాతో కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అంటున్నారు.
అందుకోసమే గత చాలా కాలంగా కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వస్తున్నారని కూడా అంటున్నారు. ఆ వ్యూహంతోనే.. ఆ ఎత్తుగడతోనే ఒక పద్ధతి ప్రకారం పార్టీలో కీలకంగా, కేటీఆర్ కు పోటీగా ఎదిగే అవకాశం ఉందని భావించిన వారిని ఒక్కొక్కరిగా పార్టీకి దూరం చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలోనే అత్యంత అవమానకరంగా ఈటలకు పార్టీ నుంచి ఉద్వాసనకు గురిచేశారు. అలాగే పార్టీలో మరో కీలక నేత హరీష్ రావును పకడ్బందీగా మెయిన్ స్ట్రీమ్ నుంచి పక్కన పెడుతూ వస్తున్నారంటున్నారు. అందుకే కేసీఆర్ రెండో సారి సీఎం అయిన తరువాత ఏర్పాటు చేసిన కేబినెట్ లో హరీష్ రావుకు స్థానం కల్పించలేదదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అప్పుడు పక్కన పెట్టిన ఇద్దరు నేతలలో హరీష్ ఒకరైతే, రెండో వ్యక్తి ఈటల. ఆ తరువాత అనివార్యంగా ఇరువురినీ కేబినెట్ లోకి తీసుకున్నప్పటికీ... ఆ తరువాత కాలంలో ఈటలపై భూ కబ్జా ఆరోపణల నెపంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కించారు. సరే ఆ తరువాత ఆయన కమలం గూటికి చేరి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హరీష్ రావు వంతు వచ్చిందని చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో హరీష్ ను పక్కన పెట్టాలని కేసీఆర్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారంటున్నారు. హరీష్ నియోజకవర్గం అయిన సిద్ధిపేట నుంచి కేసీఆర్ తన అన్న కుమారుడు వంశీధరరావును అభ్యర్థిగా రంగంలోకి దింపాలని భావిస్తున్నారు.ఒక వేళ అది సాధ్యం కాకుంటే.. మంత్రి కేటీఆర్ ను సిరిసిల్ల నుంచి సిద్ధిపేటకు తీసుకువచ్చి పోటీలో నిలబెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిరిసిల్లలో కేసీఆర్ పట్ల వ్యతిరేకత గూడుకట్టుకుని ఉండటంతో అనివార్యంగా ఆయన మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది.
మరి ఈ విషయంపై హరీష్ రావు ఎలా రియాక్ట్ అవుతారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే కేసీఆర్ ను తన జాతీయ రాజకీయాల ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు ఉపయోగించుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఈ విషయాన్ని నేరుగా కాకపోయినా.. పార్టీ ముఖ్య నేతలు బీఆర్ఎస్ తరఫున ఇతర రాష్ట్రాలలో బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందని బీఆర్ఎస్ ఆవిర్బావ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హరీష్ రావును ఉద్దేశించి చేసినవేనని అప్పట్లోనే పార్టీ వర్గాలలో చర్చ నడిచిన సంగతి తెలిసింది. అంటే అప్పుడే కేసీఆర్ తన కుమారుడికి హరీష్ రావు పోటీకి రాకుండా జాతీయ బాధ్యతలు అప్పగించేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అయితే ఇందుకు హరీష్ రావు అంగీకారం ఉంటుందా? ఉండదా? అన్న విషయం పక్కన పెడితే.. కేసీఆర్ నిర్ణయం తీసేసుకున్నారంటే అంగీకరించి తీరాలి? లేదా పార్టీ వీడి వెళ్లాలి. అంతే ఎవరికీ మరో గత్యంతరం ఉండదు. హరీష రావుకైనా అంతే.. అందుకే కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఇచ్చిన సంకేతాల మేరకు తన మేనల్లుడు ప్రస్తుత ఆరోగ్య మంత్రి హరీష్ రావుకు స్థాన చలనం తప్పదని పార్టీ వర్గాలలోనే కాకుండా, రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.
అయితే ఇక్కడే తెరాసలో ముసలానికి బీజం పడిందని అంటున్నారు. తనయుడు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడం కోసం పార్టీలో క్రీయాశీలంగా, కీలకంగా వ్యవహరిస్తున్న హరీష్ రావును పక్కన పెట్టడంపై ఒకింత అసంతృప్తి అంతర్గతంగా పార్టీలో రగులుతోందని అంటున్నారు. పైపెచ్చు తొలి నుంచీ కూడా కేటీఆర్ కు అగ్రపీఠం కట్టబెట్టేందకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారనీ, కేసీఆర్ సీఎంగా ఉంటే ఎటువంటి అభ్యంతరం ఉండదనీ, అదే తనయుడు కేటీఆర్ కు ఆ బాధ్యతలకు కట్టబెడితే మాత్రం అంగీకరించేది లేదని హరీష్ రావు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని కూడా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకు జాతీయ బాధ్యతల పేర రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. అయితే ఇందుకు హరీష్ రావు అంగీకరిస్తారా? లేక వేరు కుంపటి పెట్టుకుంటారా? అన్న చర్చ కూడా పార్టీలోనూ, రాజకీయ వర్గాలలోనూ జోరుగా సాగుతోంది. అన్నిటికీ మించి పార్టీలో ఉంటూనే మహారాష్ట్రలో ఏక్ నాథ్ షించే పోషించిన పాత్రను ఇక్కడ తెరాసలో హరీష్ రావు పోషిస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.
పైగా సెంటిమెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్ హరీష్ రావును పక్కన పెట్టే విషయంలో కూడా అదే పంథాను అనుసరిస్తున్నారంటున్నారు. కేసీఆర్ తొలి కేబినెట్ లో ఆరోగ్య మంత్రి రాజయ్య అవినీతి ఆరోపనలపై బర్త్ రఫ్ అయ్యారు. ఆ తరువాత రెండో సారి అధికారం చేపట్టిన తరువాత ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఈటలకు కట్టబెట్టారు. ఆయనను కూడా భూ కబ్జా ఆరోపణలపై పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడిక ఆ వంతు హరీష్ రావుది అని అంటున్నారు. ప్రస్తతం హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ బాధ్యతల పేరిట ఆయనను రాష్ట్ర రాజకీయాలకు దూరం చేయాలన్న భావనతో కేసీఆర్ ఉన్నారు. అయితే అందుకు సుముఖంగా లేని హరీష్ రావు.. పార్టీని చీల్చి ఏక్ నాథ్ షించే పాత్ర పోషించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలలోనే చర్చ నడుస్తోంది. తొలి నుంచీ కూడా పైకి అంతా బాగానే ఉన్నట్లుగా కనిపించినా.. హరీష్ రావు కేటీఆర్ ల మధ్య అంతగా సత్సంబంధాలు లేవన్న విషయం బహిరంగ రహస్యమేనని పార్టీ వర్గాలు చెబుతూవస్తున్నాయి.
ఒక సమయంలో అయితే హరీష్ రావుకు సంబంధించిన ఏ చిన్న వార్తా కూడా మీడియాలో రాకూడదన్న పట్టుదలను కూడా కేటీఆర్ ప్రదర్శించారని చెబుతారు. ఇప్పుడు రాజకీయ సమీకరణలను సరిచూసుకుని కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు, జాతీయ రాజకీయ వ్యుహలకు సమాంతరంగా వ్యూహ రచన సాగుతోందంటున్నారు ఆ వ్యూహాలలో భాగంగానే హరీష్ రావుకు జాతీయ బాధ్యలు అప్పగించి, పక్కకు తప్పించే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. అదే నిజమైతే, అధికార మార్పిడి, అంత సులభంగా జరిగే అవకాశాలు లేవనీ, ముఖ్యమంత్రే స్వయంగా అనేక సందర్భాలలో చెప్పిన విధంగా తెలంగాణ షిండే గా హరీష్ రావు తెరమీదకు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.