తెలంగాణలో ముందస్తు ఖాయం.. మార్చి తరువాత ఏ క్షణంలోనైనా అసెంబ్లీ రద్దు
posted on Nov 18, 2022 @ 4:23PM
‘ముందస్తు ముచ్చటే లేదు.. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు’ ఇటీవల తెరాస విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు. అంటే రాష్ట్రంలో ముందస్తు ప్రశక్తే లేదు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. పూర్తి కాలం మనం అధికారంలోకి ఉంటాం అని పార్టీ శ్రేషులకు విస్పష్టంగా చెప్పేశారు కేసీఆర్. ఆయన అంత స్పష్టంగా చెప్పినా ఆ మాటలను పార్టీ శ్రేణులు నమ్మడం లేదు.
ఆ మాటల వెనుక ఉన్న అర్ధం వేరని రాజకీయ వర్గాలు సైతం భాష్యం చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మాట మాట్లాడారంటే, ఆ మాటకు అర్థాలు, అంతరార్ధాలు, టీకా తాత్పర్యాలు ఇలా చాలానే ఉంటాయని పార్టీలో సీనియర్ నాయకులే అంటున్నారు. అలాగే ఇప్పుడు ముందస్తు లేదు అని ఖచ్చితంగా చెప్పేశారంటే.. ఆ మాటల వెనుక అర్ధాలు చాలానే ఉంటాయన్న చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. కేసీఆర్ చెప్పింది చేయరనీ, చేసేది చెప్పరనీ పార్టీ వర్గాలే కాదు రాజకీయ వర్గాలు కూడా అంటుంటాయి. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ముందస్తు ముచ్చటే లేదన్న కేసీఆర్ మాటల వెనుక నిగూఢార్థం ఉందని అంటున్నారు. వారి అంచనాకు తగ్గట్టుగానే కేసీఆర్ తీసుకుంటున్నచర్యలు, ప్రకటిస్తున్నపథకాలు, వేస్తున్న అడుగులూ అన్నీ కూడా ఎన్నికల దిశగానే వేగంగా సాగుతున్నాయి.
ఆయన తాజాగా మరోసారి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు, వచ్చే జనవరి 18 నుంచి రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ల జోళ్లు అందించాలని నిర్ణయించారు. అలాగే ఇటీవల నూతన సచివాలయ నిరాణాన్ని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకునే విధంగా సచివాలయానికి ఎదరుగా అమర వీరుల స్థూపం నిర్మాణం జరుగుతోందని చెప్పి తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ ను స్పృశించారు. ఇటువంటి పథకాలు, ప్రారంభోత్సవాలు, సెంటిమెంట్ రగిల్చే చర్యలను కేసీఆర్ సరిగ్గా ఎన్నికల ముందే చేపడతారని గత అనుభవాలు చెబుతున్నాయి. 2018 ఎన్నికల ముందు కూడా కేసీఆర్ ఆర్భాటంగా కంటివెలుగు వంటి కార్యక్రమాలను చేపట్టిన సంగతి విదితమే.
అప్పట్లోనే విడతల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పినప్పటికీ ఎన్నికల అనంతరం ఆ ఊసే ఎత్తేలేదు. ఇప్పుడు మళ్లీ హఠాత్తుగా ఆయన కంటి వెలుగు రెండో విడతను తెరమీదకు తీసుకురావడంతో ఆయన ఎన్నికల సన్నాహాలు ప్రారంభించేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అలాగే సెక్రటేరియెట్ ప్రారంభోత్సవం గురించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, అమరవీరుల స్మారక స్థూపం నిర్మాణం గురించి చెప్పడం ప్రజలలో ఉద్యమ సెంటిమెంట్ రగల్చడానికేనని చెబుతున్నారు. ఇక పరిశీలకులు కూడా కేసీఆర్ ముందస్తుకే అడుగులు వేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తియన తరువాత మార్చిలో ఏ క్షణంలోనైనా అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం వరకూ సాధ్యమైనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించి, ప్రారంభించి ప్రజాదరణను ప్రోది చేసుకోవాలన్న ఉద్దేశంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ వ్యూహానికి అనుగుణంగానే తెరాస ఎన్నికల సన్నాహాలలో ముగినిపోయిందని చెబుతున్నారు. అంతే కాకుండా కేసీఆర్ వ్యూహాలు, ఎత్తుగడలపై ఇప్పటికే పూర్తి అవగాహన ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎన్నికల సన్నాహాలు మొదలెట్టేశాయి. అయితే బడ్జెట్ తరువాత ఏ క్షణంలోనైనా కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు నగారా మోగించే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అసెంబ్లీ రద్దైన వెంటనే ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు వస్తుందా రాదా అన్నది చూడాల్సి ఉంది.
అసెంబ్లీ రద్దైన ఆరు నెలల లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. సో ఎన్నికల నిర్వహణకు సీఈసీ ఆరు నెలల వ్యవధినీ పూర్తిగా ఉపయోగించుకుంటే సెప్టెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. అంత వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారు. ఈ వ్యూహంతోనే కేసీఆర్ ముందకు వెళుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెరాస వర్గాలూ అదే చెబుతున్నాయి. ముందస్తు ముచ్చట లేదని కేసీఆర్ అనడం వెనుక అంతరార్దం ఇదేననీ రాజకీయవర్గాలు చెబుతున్నాయి.