బీసీసీఐ ప్రక్షాళన.. సెలక్టర్లకు ఉద్వాసన.. ఆటగాళ్ల వంతెప్పుడు?
posted on Nov 19, 2022 @ 3:42PM
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ లో టీమ్ఇండియా ఘోర పరాజయం నేపథ్యంలో బీసీసీఐ ప్రక్షాళన మొదలెట్టింది. ముందుగా సెలక్టర్లపై వేటేసింది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో టీమ్ ఇండియా ఘోరంగా పరాజయం పాలైన సంగతి విదితమే. ఆ మ్యాచ్ లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో చేసిన పరుగులను ఇంగ్లాండ్ అలవోకగా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించేసింది.
భారత్ నిర్దేశించిన 168 పరుగుల విజయ లక్ష్యాన్ని ఒక్కవికెట్ కూడా నష్టపోకుండానే ఇంగ్లాండ్ ఉఫ్ మని ఊదేసింది. ఈ ఓటమితో టీమ్ ఇండియా బలహీనతలపై మళ్లీ చర్చ మొదలైంది. ఆటగాళ్ల సెలక్షన్ అధ్వానంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ను జట్టులోకి తీసుకుని ఎవరినీ సరిగ్గా ఉపయోగించుకోని పరిస్థితిని క్రీడాభిమానులే కాదు.. మాజీలు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు.
వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇచ్చుకుంటూ పోవడంపై కూడా విరమ్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ మొదటిగా సెలక్టర్లపై వేటు వేసింది. టి20 వరల్డ్ కప్ కు జట్టును ఎంపిక చేసిన చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీనీ ఇంటికి పంపించింది. అంతేకాకుండా కొత్త సెలక్షన్ కమిటీ ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. సీనియర్ పురుషుల క్రికెట్ జట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సెలక్టర్లు కావాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఓ ప్రకటనను చేసింది. కనీసం ఏడు టెస్ట్ మ్యాచ్‌లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, లేదంటే 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వారు సెలక్టర్ పదవికి అర్హులనీ, అలాగే సెలక్షన్ బోర్డుకు ఎంపిక అవ్వాలంటే.. ఐదు సంవత్సరాల క్రితమే క్రికెట్ ఆటకు వీడ్కోలు పలికి ఉండాలని, అంతేకాకుండా ఐదేళ్ల పాటు ఏ క్రికెట్ కమిటీలోనూ సభ్యుడిగా లేని వాళ్లకు ప్రాధాన్యం ఇస్తామనీ ఆ ప్రకటనలో పేర్కొంది.
ఆసక్తి ఉన్న వారు ఈనెల 28వ తేదీలోగా దరఖాస్తులు పంపాలని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రక్షాళనలో భాగంగా తరువాతి వంతు వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్లదేనని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. గతమెంత ఘనకీర్తి ఉన్నా.. ప్రస్తుత పెర్ఫార్మెన్స్ ఆధారంగానే జట్టులో స్థానం ఉంటుందన్నది బీసీసీఐ స్పష్టంగా చెబుతోందంటున్నారు.
ఈ నేపథ్యంలోనే రాహుల్, దినేష్ కార్తిక్, పృధ్వీషా, భువనేశ్వర్ కుమార్ తదితర ఆటగాళ్ల భవిష్యత్ పై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. మొత్తం మీద టి20 వరల్డ్ కప్ సెమీస్ లో ఓటమితో టీమ్ ఇండియా లోటుపాట్లను సరిదిద్దే దిశగా బీసీసీఐ చర్యలు చేపట్టడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.