మంత్రుల గుండెల్లో గుబులు.. వెంటాడుతున్న అరెస్ట్ భయం
ఆట మొదలైంది.. కాదు.. కాదు.. ఆట క్లైమాక్స్ కు చేరింది. అయితే, చివరకు ఏమి జరుగుతుంది? ఎండ్ రిజుల్ట్ ఏమిటి? ప్రధాని నరేంద్ర మోడీ పై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు విజయం సాధిస్తారా, లేక ఇటీవల పునరుద్ధరించిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ప్రధాని మోడీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబపాలన,అవినీతి పాలనను ఎండగడుతూ తెలంగాణలో కమల వికాసం ఖాయమంటూ చేసిన హెచ్చరిక, అందుకు అనుబంధంగా తెలంగాణ రాజకీయాలు ఇకపై రంజుగా ఉంటాయంటూ వినిపించిన భవిష్యవాణి నిజం అవుతుందా అనేది చూడవలసి వుంది.
అయితే,అక్కడ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెరాసల నడుమ జరుగతున్న రాజకీయ పోరాటానికి, ఉభయ పక్షాలూ దర్యాప్తు సంస్థలను అస్త్రాలుగా చేసుకోవడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే ఆందోళన ఉభయ పార్టీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ఓ వంక కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ లిక్కర్ స్కామ్, మరో వైపు తెరాస ఎమ్మెల్యేల ఎర కేసు పోటాపోటీగా ఉత్కంఠ రేకేతిస్తుంటే, మరో వంక తెరాస మంత్రులు, నాయకులు లక్ష్యంగా జరుగతున్న ఐటీ దాడులు మరింత రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి.
నిజానికి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నెలరోజులకు పైగానే తెరాస ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయినా ఇంతవరకు ఈ కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యక్షంగా ఎక్కడా ఆమె పేరు ఎత్తలేదు. ఆమెకు నోటీసు అయినా యివ్వలేదు. కానీ, ఈ కుంభకోణంలో ఆమెదే కీలక పాత్ర అని నిరూపించే దిశగా పావులు కదులుతున్నాయనే, సంకేతాలు మాత్రం స్పష్టమవుతున్నాయి. అందుకే,అమెలోనే కాదు, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో, తెరాస నాయకుల్లో కలవరపాటు కనిపిస్తోంది.
అంతే కాదు, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత వైపు వేలెత్తి చూపించే అవకాశాన్ని, తెరాస నాయకత్వమే కల్పిస్తోందా, అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కవితను తమ పార్టీలోకి రావాలని బీజేపీ నాయకత్వం ఆమెపై వత్తిడి తెచ్చిందని చేసిన ప్రకటన ఉద్దేశం ఏదైనా పలు అనుమానాలకు ఆస్కారం కల్పించిందని అంటున్నారు. అంతకు ముందు కవితను వెంట పెట్టుకుని ముఖ్యమంత్రి పది రోజులు ఢిల్లీలో మకాం చేయడం, ఈ పది రోజుల్లో ఆయన ఏమి చేశారు అనే విషయంగా వస్తున్న కథనాలు లిక్కర్ స్కాం కు సంబంధించి కవిత రియాక్షన్స్, అలాగే ఆమె ఆకస్మిక ఢిల్లీ పర్యటనలు ఇంకా అనేక పరిణామాలు ఆమె వైపు వేలెత్తి చూపించే అవకాశాన్ని, కల్పిస్తున్నాయని అంటున్నారు.
అలాగే, కవితను లిక్కర్ స్కాం నుంచి కాపాడేందుకే ముఖ్యమంత్రి, తెరాస ఎమ్మెల్యేల ఎర కేసును తెర మీదకు తెచ్చారనే అభిప్రాయం బలపడుతోంది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన, ‘సిట్’ సాగిస్తున్న దర్యాప్తు బీజీపీ నాయకులని ఇరకాటంలోకి నెట్టింది. ఏకంగా, బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసు ఇవ్వడంతో, బీజేపీతో పాటుగా రాష్ట్రీయ స్వయం సీవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ను ఎమ్మెల్యేల ‘ఎర’ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని, బీజేపీ అగ్ర నాయకత్వం గుర్తించింది. అందుకు కౌంటర్ గా మంత్రులు టార్గెట్ గా ఐటీ దాడులకు తెర లేపింది. నిజమే, ఐటీ దాడులు కొత్త విషయం కాదు కానీ, మంత్రులే టార్గెట్ గా ఐటీ దాడులు జరగడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.
మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఐటీ దాడుల్లో చిక్కిన మంత్రులు చాలా వరకు జైలు పాలయ్యారు లేదా జైలుకు వెళ్లే దారిలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమత బెనర్జీకి అత్యంత సన్నిహితునిగా పేర్కొనే, పార్థ చట్టేర్జీని, ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన సత్యేంద్ర జైన్, మహారాష్ట్రలో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మంత్రివర్గంలో కీలక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు నవాబ్ మాలిక్, అలాగే, ఐటీ దాడులలో చిక్కుకున్న ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, అరెస్ట్ కావడంతో, ఇప్పడు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులోనూ గుబులు మొదలైంది. ముఖ్యంగా ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థల ఉచ్చులో చిక్కున్న మంత్రులు ఎప్పడు ఏమవుతుందో అని భయపడుతుంటే, రేపు ఏమవుతుందో అని మరికొందరు మంత్రులు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు.
కేసినో వ్యవహారంలో తలసాని కుటుంబంపై ఈడీ నజర్ పడింది. గతంలో ఈ వ్యవహారానికి సంబంధించి చీకోటి ప్రవీణ్ ను విచారించింది ఈడీ. అతను చెప్పిన వివరాల ఆధారంగా కొందరు టీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. అవన్నీ ఒకెత్తు అయితే ఇప్పడు మంత్రి తలసాని కుటుంబ సభ్యులు, ఆయన పీఏ ఇతర సన్నిహితులను ఈడీ విచారించింది. అలాగే అక్రమంగా విదేశాలకు గ్రానైట్ తరలించారనే పాత కేసుకు సంబంధించి మంత్రి గంగుల కమలాకర్ కంపెనీలు, ఇల్లు, ఇతర అనుమానిత ప్రదేశాల్లో ఈడీ, ఐటీ, అధికారులు తనిఖీలు నిర్వహించారు. తాజాగా మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన సోదరులు, కుమారులు, అల్లుడి నివాసాల్లో, విద్యా సంస్థల్లో, లావాదేవీలకు సంబంధించిన బ్యాంకుల్లో ఐటీ సోదాలకు దిగింది. భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో, మంత్రులలో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం మంత్రి మల్లారెడ్డి బంధు, మిత్రుల ఇళ్లు, ఆయన కాలేజీలు, కార్యాలయాలపై దాడులు కొనసాగుతున్న సమయంలోనే అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ఈడీ, ఐటీ దాడుల దృష్ట్యా నేతలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి సూచించారని అంటున్నారు. అయితే, పార్థ చట్టేర్జీ, సత్యేంద్ర జైన్, నవాబ్ మాలిక్ ఉదంతాలు కళ్ళముందు కదలాడుతున్న మంత్రులు ఇతర నాయకులు ఆందోళన చెందుతున్నారు. నిజానికి, 40కి పైగా తెరాస ఎమ్మెల్యేలపై ఇప్పటికే కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో తెరాస నాయకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని అంటున్నారు.