పాపం వసుంధరారాజె.. మొదటికే మోసం
posted on Nov 19, 2022 @ 11:23AM
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేస్తే ఏమౌతుంది.. ఏమౌతుందో రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరరాజెను చేస్తే అర్ధమౌతుంది. రాజస్థాన్ సీఎం అభ్యర్థిగా తననే ప్రకటించాలని పట్టుబట్టిన వసుంధరరాజేకు మోడీషా ద్వయం గట్టి షాక్ ఇచ్చింది.
రాజస్థాన్ సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించాలంటూ పట్టుబడుతూ వస్తున్నా మోడీ షా పట్టించుకోకపోవడంతో.. తన సత్తా చాటాలంటే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో విస్తృతంగా ప్రచారం చేసి సత్ఫలితాలను చూపాలని ఆమె భావించారు. ఇందు కోసం అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఆమె ప్రచార రంగంలోకి దూకేందుకు రెడీ అయిపోయారు. సరిగ్గా ఇక్కడే మోడీషా ద్వయం ఆమెకు ఆమె స్థానం ఏమిటన్నది దిమ్మదిరిగేలా తెలియ చేశారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో వసుంధరరాజేకు స్థానం కల్పించలేదు. దీంతో ఆమెకు గుజరాత్ లో ప్రచారం చేసే అవకాశమే లేదన్నది స్పష్టమైపోయింది. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే.. వచ్చే ఏడాది రాజస్థాన్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో ఆమెకు బీజేపీ మొండి చెయ్యి చూపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక బీజేపీలో ఆమె రాజకీయ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్లేనని అంటున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ రాజస్థాన్ రాష్ట్ర రాజకీయ సంప్రదాయం ప్రకారం ప్రతి 5 ఏళ్లకోమారు సర్కారు మారుతుంది,
ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో నెక్ట్స్ గవర్నమెంట్ బీజేపీదే అన్న ధీమాను వ్యక్తం చేస్తున్న కమల నాథులు గెహ్లాట్ వర్గంతో కుమ్మక్కై వసుంధరా రాజే రాజకీయం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెకు చెక్ పెట్టడానికే బీజేపీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చేసిదనడానికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆమె పేరు లేకపోవడమే నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.