భార్య కిడ్నీ అమ్మేశాడు!
posted on Nov 19, 2022 @ 11:06AM
ఆరోగ్యం బాలేదు.. ఆస్పత్రికి తీసుకెళ్లమని అడిగిన భార్య కిడ్నీని అమ్మేశాడో ప్రబుద్ధుడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని మల్కాన్ గిరిలో జరిగింది. కథామేట గ్రామానికి చెందిన ప్రశాంత్ తన భార్య కిడ్నీని ఆమెకే తెలియకుండా ఆమ్మేశాడు.
ఆ సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు జరిగిందేమిటంటే.. తనకు ఒకింత అస్వస్థతగా ఉందనీ, ఆసుపత్రికి తీసుకెళ్లమనీ భార్య రంజిత కుండు భర్తను అడిగింది. దీంతో ప్రశాంత్ భువనేశ్వర్ లోని ఒక ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు. అక్కడి వైద్యులతో ఏం చెప్పాడో ఏమో.. ఆమె కిడ్నీని తీయిచేసి అమ్మేసుకున్నాడు. ఇందుకోసం ప్రశాంత్ తనను తాను రంజిత తండ్రిగా చెప్పుకుని అవసరమైన సంతకాలు చేశాడు. తడపాల్సిన వారి చేతులు తడిపాడు.
ఇదంతా నాలుగేళ్ల కిందట 2018లో జరిగింది. విషయం తెలుసుకున్న రంజితా కుండు ఇంత కాలం ఎవరికీ చెప్పకుండా తనలో తానే కుమిలిపోయింది. అయితే ఇటీవల ప్రశాంత్ రంజితాకుండు తనను నిర్లక్ష్యం చేస్తూ వేరే మహిళతో చనువుగా ఉండటంతో సహించలేకపోయింది.
దీంతో రంజిత తన కిడ్నీని భర్త అమ్మేసిన విషయాన్ని మల్కాన్ గిరి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు విషయం వాస్తవమేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో కిడ్నీ విక్రయం విషయంలో ప్రశాంత్ కు సహకరించిన అధికారులను అరెస్టు చేశారు. ప్రశాంత్ పరారీలో ఉండటంతో అతని కోసం గాలిస్తున్నారు.