ఎమ్మెల్యేల బేరసారాల కేసులో సిట్ దూకుడు.. ఇక రాజకీయ దుమారమేనా?
posted on Nov 19, 2022 5:59AM
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో సిట్ దూకుడు పెంచింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సీఆర్ పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసుల్లో హెచ్చరించింది.
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసుకు సంబంధించి అధికారులు అక్టోబర్ 26న ఆడియో, వీడియో సంభాషణలకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించారు. వారితో సంబంధాలు ఉన్న వారికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. అందులో ప్రధానంగా ఎన్డీయే కన్వీనర్ తుషార్ తో పాటు కేరళకు చెందిన వైద్యుడు డాక్టర్ జగ్గు స్వామి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రధాన అనుచరుడు, న్యాయవాది శ్రీనివాస్ కు ఉన్నారు.
ఫ్లైట్ టికెట్ల కొనుగోలులో వీరందరి ప్రమేయం ఉందని, సిట్ అనుమానిస్తోంది. పైలెట్ రోహిత్ రెడ్డితో మాట్లాడారంటూ వీరి పేర్లు ప్రస్తావనకు రావడంతో వారికి సైతం నోటీసులు ఇచ్చి విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.
తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంతోష్ కు సైతం సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురికి నోటీసులు జారీ చేశారు. కేరళ, చిత్తూరు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని (నందకుమార్, సింహయాజి స్వామి, రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ) అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆ ముగ్గురి స్టేట్ మెంట్ నమోదు చేశారు.
కొచ్చిలోని ఓ ఆశ్రమానికి చెందిన వైద్య కళాశాలలో పని చేస్తున్న జగ్గుస్వామి ఇంటికి సిట్ అధికారులు గత శనివారం వెళ్లారు. అయితే అప్పటికే ఆయన వెళ్లిపోయారు. జగ్గుస్వామి ఇంటితో పాటు కార్యాలయంలో సోదాలు చేసిన సిట్ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొచ్చి పోలీసుల సాయంతో జగ్గుస్వామి కోసం గాలించినా ఆయన చిక్కకపోవడంతో ఆయన ఇంటికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉన్న సిట్ కార్యాలయంలో 21వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కేరళలో బీజేపీకి అనుబంధంగా ఉన్న బీడీజెఎస్ (భారత్ ధర్మ జనసేన) అధ్యక్షుడు తుషార్‌కు కూడా సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో సిట్ అధికారులు ఐదు రోజుల పాటు కేరళలో దర్యాప్తు చేశారు. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో సిట్ అధికారులు కేరళ వెళ్లి దర్యాప్తు చేశారు. ఇక కరీంనగర్ కు చెందిన న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌కూ సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
సింహయాజీ స్వామీజీ తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి న్యాయవాది శ్రీనివాస్ టికెట్ బుక్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వీళ్లిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది? ఎవరైనా చెబితే టికెట్ బుక్ చేశారా? అనే కోణంలోనూ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఉండగా సిట్ నోటీసులపై బీజేపీ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. బి.ఎల్. సంతోష్, న్యాయవాది శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చిన విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వారిని ఇరికించేందుకు సిట్ నోటీసులిచ్చి వేధిస్తోందని పేర్కొంటూ.. వీటిపై స్టే ఇవ్వాలని కోరారు.
ఈ కేసులో నలుగురికి (తుషార్, జగ్గు స్వామి, న్యాయవాది శ్రీనివాస్, బీఎల్ సంతోష్) సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అందరికీ సీఆర్ పీసీ సెక్షన్ 41ఏ కిందే నోటీసులు ఇచ్చారు. వారందరిని ఒకే రోజున విచారణకు పిలిచారు. ఒకే రోజున అందరినీ సిట్ ప్రశ్నించనుంది. ఫామ్ హౌస్ బేరసారాల సమయంలో నిందితుల నోట బీఎల్ సంతోష్, తుషార్ పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. తుషార్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఫోన్ లో మాట్లాడారు.