భారత్ జోడో యాత్ర సక్సెస్.. మరి కాంగ్రెస్ జోడో మాటేమిటి ...?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. సెప్టెంబర్ 7 న తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన యాత్ర, తమిళ నాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహరాష్ట్ర మీదగా, మధ్య ప్రదేశ్ లో ప్రవేశించింది. రాహుల్ యాత్ర సాగిన అన్ని రాష్ట్రాలలో ప్రజల స్పందన అధ్బుతంగా ఉందని, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ పీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నారు.
అంతే కాదు, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే మరో అడుగు ముందుకెళ్ళి, రాహుల గాంధీ జోడో యాత్రకు వస్తున్న విశేష స్పందన, ప్రధాని మోడీని భయపెడుతోందని, ఆయన వెన్నులో చలి పుట్టిస్తోందని అన్నారు. మోడీని రాహుల్ భయం పట్టుకుందని, అందుకే ఆయన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని, నిరాధార నిందలు మోపుతున్నారని ఖర్గే అంటున్నారు.
నిజమే రాహుల్ గాంధీ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ముఖ్యంగా రాజకీయాలతో సంభంధం లేకుండా యువతీ యువకులు, విద్యార్ధులు, చిన్నారులు, మహిళలు, రైతులు, కార్మికులు ఇలా అన్నివర్గాల ప్రజలు రాహుల్ గాంధీ యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆటపాటలతో, ఆడుతూ పాడుతూ రాహుల్ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. మధ్య మద్యలో సినిమా స్టార్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇంకో విశేషం ఏమంటే, తెలంగాణ సహా రాహుల్ గాంధీ యాత్ర జరిగిన అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ నాయకులు తమ మధ్య ఉన్న విభేదాలు మరిచి, అంతా ఒకటిగా కష్టపడి యాత్రను సక్సెస్ చేశారు. అయితే, అసలు కథ ఆతర్వాతనే ప్రారంభమవుతోంది. కాంగ్రెస్ నాయకుల మధ్య ఐక్యత రాహుల్ యాత్ర వరకే పరిమితమనే విషయం తేలిపోయింది.
తెలంగాణ విషయాన్నే తీసుకుంటే రాష్ట్రంలో రాహుల్ గాంధీ యాత్ర ఒక విధంగా జరగ కూడని సమయంలో జరిగింది. ఓ వంక మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ముఖ్యనేతలంతా మునిగి తేలుతున్న సమయంలో రాష్ట్రంలో రాహుల్ యాత్ర మొదలైంది. అయినా నాయకులు ఇటు యాత్రను, అటు ఉప ఎన్నిక ప్రచారాన్నిసమాంతరంగా సాగించారు. సరే మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయినా రాహుల్ యాత్ర మాత్రం సక్సెస్ అయిందనే సంతోషం కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గానికి ఒక విధమైన ఊరట మిగిల్చింది.
కానీ ఆ తర్వాత ఏమి జరిగింది, ఏమి జరుగుతోంది అన్నది గమనిస్తే రాష్ట్ర కాంగ్రెస్ లో అంతర్గత విబేధాలు మళ్ళీ మొదటి కొచ్చాయి. మొదటికి రావడం కాదు పతాక స్థాయికి చేరాయి. కాంగ్రెస్ సీనియర్లకు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గానికి మధ్య ఇంతవరకు కొంత చాటుమాటుగా సాగుతున్న తగువు బహిరంగంగా బయట కోస్తోంది. రోజుకో కొత్త వివాదం తెరపైకి వస్తోంది. నిజమే కావచ్చు కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకు తెరాస, బీజేపీ షాడో ఫైట్ చేస్తున్నాయని రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలలో ఎంతో కొంత నిజం ఉన్నా ఉండవచ్చును కానీ, బీజేపీ,తెరాసల షాడో ఫైట్ విషయం ఎలా ఉన్నా, మునుగోడు ఓటమికంటే, కాంగ్రెస్ నాయకుల మధ్య భగ్గుమంటున్న అంతర్గత విభేదాలు కాంగ్రెస్ ప్రతిష్టను మరింతగా దిగజార్చి వేస్తున్నాయనేది కాదనలేని నిజం. ఓ వంక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంతి మర్రి చెన్నారెడ్డి కుమారుడు, మర్రి శశిధర్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య గత కొంత కాలంగా సాగుతున్న డైరెక్ట్ ఫైట్, చిలికి చిలికి గాలివానగా మారి,క్లైమాక్స్ కు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ, శశిధర్ రెడ్డిని ఆరేళ్ళ పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది, శశిధర్ రెడ్డి శాశ్వతంగా పార్టీకి రాజీనామా చేశారు. తాను బీజేపీ లో చేరనున్నట్లు ప్రకటించేశారు.
అదొకటి అలాఉంటే, మునుగోడుకు ముందు నుంచి భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకుండానే మంటలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఇక మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే, వెంకటరెడ్డి సోదరుడు, కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి, పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో, కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య వైరం మరింతగా ముదిరి పాకాన పడింది. వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే, మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగిన సోదరుడు రాజగోపాల రెడ్డికి ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ స్టేట్ స్టార్ క్యాంపైనర్ కూడా అయిన ఆయన, మునుగుడు ప్రచారానికి దూరంగా ఉన్నారు. అంతే కాకుండా, అదే సమయంలో ఆస్ట్రేలియా వెళ్ళిన ఆయన మునుగోడులో కాంగ్రెస్ ఓడిపోతుందని, ఆ విషయం స్పష్టంగా తెలిసి కూడా ప్రచారం చేయడం ఎందుకని తాను దూరంగా ఉన్నానంటూ పార్టీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నారు. అ
లాగే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అవహేళన చేస్తూ, ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చింది, కానీ చర్యలు తీసుకునే సాహసం మాత్రం చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ అయన పై చర్యలు తీసుకుంటే, ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసి, తమ్ముడి బాటలో బీజేపీ గూటికి చేరతారని, అందుకే, మర్ర శశిధర్ రెడ్డి విషయంలో తీసుకున్న శీఘ్ర నిర్ణయం, కోమటి రెడ్డి విషయంలో తీసుకోలేక పోతోందని అంటున్నారు.
అదొకటి అలా ఉంటే, పీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్’కు గైర్హాజరైన 11 మంది పీసీసీ అధికార ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారు. అలాగే, రేవంత్ రెడ్డి వ్యవహర శైలిపై, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరో మారు ధ్వజ మెత్తారు. పార్టీని నడిపించే పద్దతి ఇది కాదని చురకలు అంటించారు. ఇలా, తెలంగాణలో రాహుల్ గాంధీ జోడో యాత్ర ప్రజలను అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయినా, పార్టీలోని అంతర్గత విభేదాలను చల్లబరచడంలో సక్సెస్ కాలేక పోయిందని కాంగ్రెస్ నాయకులే వాపోతున్నారు.
నిజానికి ఒక్క తెలంగాణలోనే కాదు, ఇప్పటికే రాహుల్ యాత్ర పూర్తిచేసుకున్న కేరళలో, మరో కొద్ది రోజులలో రాహుల్ కాలు పెట్టనున్న, రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది. పార్టీ అధ్యక్ష పదవివికి పోటీ చేసి ఓడిపోయిన శశి థరూర్ తమ స్వరాష్ట్ర కేరళలో సాగిస్తున్న రాజకీయ యాత్ర పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అలాగే, రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్, పార్టీ సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ వర్గాల మధ్య విబేధాలు మళ్ళీ మరో మారు భగ్గుమంటున్నాయి. రాహుల్ యాత్ర త్వరలో రాష్ట్రంలో ప్రవేశిస్తున్న నేపధ్యంలో పైలట్ వర్గానికి చెందిన ఒకరిద్దరుమంత్రులు,ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా పార్టీ అధిష్టానం ఆదేశాలను ఉల్లంగించి, పార్టీ క్రమ శిక్షణను ఉల్లంగించిన గేహ్లోట్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.అది కూడా రాహుల్ యాత్రకు ముందే జరగాలని, లేదంటే ప్రజలో కాంగ్రెస్ పార్టీ చులకన అవుతుందని అంటున్నారు.
సో.. మొత్తంగా చూస్తే, రాహుల్ జోడో యాత్ర ప్రజలను ఏకం చేయడంలో సక్సెస్ అయినా, కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత ముఠాలను ఏకం చేయడంలో మాత్రం సక్సెస్ కాలేక పోతోంది. అంతే కాకుండా, రాహుల గాంధీ జోడో యాత్ర హిట్టా, ఫట్టా అనేది తేలాలంటే, హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే (డిసెంబర్ 8) వరకు ఆగక తప్పుదు. ఆ రెండు రాష్ట్రాలలో కూడా పంజాబ్,ఉత్తర ప్రదేశ్ ఫలితాలే పునరావృతమై, అక్కడా కాంగ్రెస్ పార్టీ ఓడిపొతే,రాహుల్ జోడో యాత్ర ... కూడా ఓడిపోయినట్లే భావించవలసి ఉంటుందని అంటున్నారు. ఇక ఆ తర్వాత తెలంగాణ సహా చాలా వరకు రాష్ట్రాలలో రాజకీయ సమీకరణలు మారిపోతాయని అంటున్నారు.