నేపాల్ తెల్ల రాబందును రక్షించిన భారత్
posted on Nov 22, 2022 9:15AM
నేపాల్ కు చెందిన అత్యంత అరుదైన రాబందును భారత్ అధికారులు రక్షించి సంరక్షించారు. పర్యావరణ మార్పుల కారణంగా రాబందుల సంతతి అంతరిస్తున్నది. అందులోనూ అత్యంత అరుదైన తెల్ల రాబందుల మనుగడ ప్రమాదంలో పడింది.
దాదాపు అంతరించిపోయిందనుకున్న ఈ సంతతి రాబందు ఒకటి నేపాల్ లో కనిపించింది. తిండి కరవై చిక్కి శల్యమైన స్థితిలో కనిపించిన ఈ తెల్ల రాబందును నేపాల్ అటవీ శాఖ అధికారులు సపర్యలు చేసి రక్షించారు. దాని సంరక్షణ బాధ్యతను అత్యంత శ్రద్ధగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాని కదలికలు తెలుసుకునేందుకు డియో ట్యాగింగ్ కూడా చేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ రాబందు రాడార్ దృష్టికి కూడా అందలేదు.
దీని ఆచూకీ తెలియక నేపాల్ అధికారులు కంగారు పడుతుండగా దీని ఆచూకీ బీహార్‌లో పక్షుల సంరక్షణ కేంద్రం అధికారులు కనుగొన్నారు. ప్రస్తుతం బీహార్‌లో కనుగొన్న రాబందును భగల్పూరులోని పక్షుల పర్యవేక్షణ కేంద్రం నిపుణుల పర్యవేక్షణలో ఉంచారు.
దీనికి వైద్య పరీక్షలు జరిపారు. కొద్దిరోజుల తరువాత దీనిని విడిచిపెడతామని అధికారులు తెలిపారు. తమ దేశంలో తప్పిపోయిన రాబందు జాడ పట్టేసినందుకు నేపాల్ వన్యపరిరక్షణ అధికారులు భారత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.