మహిళల పట్ల రామ్ దేవ్ బాబా అనుచిత వ్యాఖ్యలు

పురుషాధిక్య సమాజంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు సరికదా.. మహిళలపై అఘాయిత్యాల సంఖ్య ఇంతింతై అన్నట్లుగా పెరిగిపోతోంది. అన్నిటికంటే బాధాకరమైన విషయమేమిటంటే మహిళల పట్ల చులకన భావంతో వ్యాఖ్యలు చేసే వారిలో ప్రసిద్ధులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఏకంగా మంత్రులు కూడా ఉండటం. ఏపీలో మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. అలాగే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో బాగోతమూ తెలిసిందే. తమిళనాడు విద్యాశాఖ మంత్రి కూడా ఇటీవల ఒక సందర్భంగా తమ రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణాలపై చులకన భావంతో వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నారు. అయితే కాషాయ బట్టలు వేసుకుని ఆధ్మాత్మిక బోధలు చేస్తూ, యోగాతో జీవన శైలిని మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని ఉద్బోధనలు చేసే యోగాగురు రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం చీదరించుకునేలా ఉంది.  ఇలా సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వారే మహిళలను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రామ్ దేవ్ బాబా  పతంజలి యోగా పీఠ్ ముంబై మహిళా పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం థానేలోని హాయ్ల్యాండ్ ప్రాంతంలో యోగా సైన్స్ క్యాంపు మహిళల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ కార్యక్రమంలో మాట్లాడిన రామ్ దేవ్ బాబా మహిళల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళలు చీరలోనూ, సల్వార్ కమీజ్ సూట్లోనూ అందంగా ఉంటారు అని.. అక్కడితో ఊరుకోకుండా వారు దుస్తులు ధరించకున్నా అందంగానే ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే వంటి వారు కూడా ఉన్నారు.  రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అనుచిత వ్యాఖ్యలు చేసిన బాబా రామ్ దేవ్ పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అన్నివర్గాల నుంచీ వస్తోంది. ఆధ్యాత్మికత ముసుగులో వ్యాపార సామ్రాజ్యాన్నినిర్మించుకున్న బాబారామ్ దేవ్ కాషాయ వస్త్రధారణ మాటున తన పురుషాధిక్య వికృత స్వరూపాన్ని చూపారని విమర్శిస్తున్నారు. సామాజిక మాధ్యమంలో బాబారామ్ దేవ్ ను నెటిజనులు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఉచ్ఛనీచాలు లేకుండా అసభ్యంగా, అసహ్యంగా మాట్లాడిన రామ్ దేవ్ ను కఠినంగా శిక్షించాలని, ఆయన పతంజలి గ్రూప్ ఉత్పత్తులను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎవరిని మార్చినా నో ఛేంజ్.. సెకండ్ ఛాన్స్ కు ..నో ఛాన్స్ ...

తత్త్వం బోధ పడింది. విషయం అర్థమైంది. సెకండ్ ఛాన్స్ కు నో ఛాన్స్ అనే నిజం కొంచం ఆలస్యంగానే అయినా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. నిజానికి, జగన్మోహన్ రెడ్డికి తత్త్వం బోధపడేందుకు కొంత సమయం పట్టింది కానీ  పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు  ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజాగ్రహం ఏ స్థాయిలో వుందో, ముందుగానే గ్రహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ‘మీటల’ మీద ఆశలు పెంచుకుని తమకు ఇక తిరుగులేదని ధీమా వ్యక్తం చేసినా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు మాత్రం ఆయన లెక్కలు సీరియస్ గా తీసుకోలేదు. అందుకే, గడపగడపకు కదలండి అంటూ ముఖ్యమంత్రి పదేపదే ముళ్ళ కర్రతో పొడిచినా, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు అంతగా కదలలేదు. అందుకే చాలా వరకు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పదవిలో ఉన్నంత వరకు వుందాం,అందినంత వరకు వెనకేసుకుందాం ఆ తర్వాత రాజెవరో .. రెడ్డెవరో అనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అందుకే, గడప గడపకు వెళ్ళని వారికి మళ్ళీ టికెట్ ఉండదని ముఖ్యమంత్రి హెచ్చరించినా ఎమ్మెల్యేలు ఇచ్చినా పుచ్చుకునేది లేదులే అని మనసులోనే అనుకుంటున్నారో  ఏమో కానీ ఎవరిదారిన వారు దీపం ఉండగానే, ఇల్లు  చక్క పెట్టుకునే పనిలో పడిపోయారని, పార్టీ నాయకులు గుసగుసలు పోతున్నారు.   ఎప్పుడైతే, ఎమ్మెల్యేలలో ఈ విధమైన నిర్లిప్తత బయటకు పొక్కడం మొదలైందో, ఎప్పుడైతే గడప గడపలో  చిత్కారాలు,చేదు అనుభవాలు ఎదురయ్యాయో అప్పుడే జగన్ రెడ్డికి తత్త్వం బోధపడడం మొదలైంది. అదే సమయంలో,ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్  బృందంతో పాటుగా ఇతర సర్వే సంస్థలతో చేయించిన సర్వేలు నో సెకండ్ ఛాన్స్   అని స్పష్టం చేశాయి, ఇక అక్కడి నుంచి జగన్ రెడ్డిలో కలవరపాటు మొదలైందని, అందుకే ఆయన, నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారని అంటున్నారు.  అయితే, రోగం ఒకటైతే మందు మరొకటి ఇస్తే ప్రయోజనం ఉందని  అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు, ఎక్కడో పారేసుకుని ఇంకెక్కడో వెతుక్కున్నట్లు ఉందని అంటున్నారు. ఈ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇటీవల పార్టీలో మార్పులు, చేర్పులు చేపట్టారు. జిల్లా అధ్యక్షులు, జిల్లా, ప్రాంతీయ సమన్వయ కర్తలను మార్చారు. అయితే ఈ మార్పులు, చేర్పుల తతంగాన్ని, సూక్ష్మంగా పరిశీలిస్తే, ఇవ్వన్నీ అలంకార ప్రాయమైన ( కాస్మెటిక్) మార్పులే తప్ప ప్రయోజనం చేకూర్చే మార్పులు కాదని పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా రెడ్డి డామినేషన్ ఇమేజ్ ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా  చేసిన మార్పులు చేర్పులు, బూమరాంగ్ అయ్యే ప్రమాదముందని అంటున్నారు. బీసీలు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన కొద్ది మంది నాయకులకు పదవులు ఇచ్చినా, పక్కలో బల్లెంలా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని జోడించడంతో పెద్దగా ప్రయోజానం ఉండదని అంటున్నారు. పేరుకు ఇతర సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించినా. పెత్తనం మాత్రం, రెడ్డి సామాజిక వర్గ చేతిలోనే ఉంటుందని, ఇది  అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి వరకూ నాకించినట్టు ఉందని అంటున్నారు. ఉదాహరణకు, బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్ర బోసుకు కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల సమన్వయ కర్త బాధ్యతలు అప్పగించారు. అయితే, మిధున్ రెడ్డిని కూడా జత చేశారు. అలాగే, గుంటూరు, ఎన్టీఅర్ కృష్ణా జిల్లా బాధ్యతలను కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ కు అప్పగించారు, ఆయన నెత్తిన ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితునిగా పేరున్న ఆళ్ళ అయోధ్య రామి రెడ్డిని కూర్చో పెట్టారు. అంటే పార్టీలో చేసిన మార్పులు చేర్పులు మసిపూసి మారేడుకాయ చేసేందుకు చేసే ప్రయత్నమే తప్ప  మరొకటి కాదని అంటున్నారు.   నిజానికి వైసీపీలో మార వలసింది, మార్పు రావాల్సింది ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలోనే కానీ, మరెవరిలోనో కాదని పరిశీలకులు పేర్కొంటున్నారు. వైసీపీ పతనానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి అహంకార పూరిత ధోరణి, ఆనాలోచిత నిర్ణయాలు కారణం. అయితే, ఆయన  మాత్రం అందరిలో లోపాలు చూస్తున్నారే కానీ, అద్దంలో తనను తను మాత్రం చూసుకోవడం లేదు. అలాగే, సంక్షేమ పథకాల అమలుపై ముఖ్యమంత్రి ఆశలు పెంచుకున్నా, వాస్తవంలో సంక్షేమ పధకాల ప్రయోజనాలు పొందుతున్న వారిలో ఒక విధమైన అసంతృప్తి ఉంటే, పథకాలు అందని వారిలో మరోరకం అసంతృప్తి ఉందని అంటున్నారు. అతేకాకుండా సంక్షేమ పథకాలు అందుతున్నది మూడింట ఒక వంతు మందికి మాత్రమే అని ఈ లెక్కన చూస్తే, ముఖ్యమంత్రి లెక్క తప్పిందని తేలుతోందని, గడపగడపలో నిరసనకు ఇదే కారణమని అంటున్నారు. అందుకే, ముఖ్యమంత్రి ఎన్ని మార్పులు చేర్పులు చేసినా, సెకండ్ ఛాన్స్’కు నో ఛాన్స్ .. చాన్సే లేదని అంటున్నారు.

ముందస్తుకే మొగ్గు.. అందుకే ఉద్యోగ ప్రకటన, ప్రారంభోత్సవాలతో కేసీఆర్ పరుగు

దక్షిణాదిలో ఎంట్రీకి తెలంగాణ గేట్ వే అని బీజేపీ పెద్దలు డిసైడ్ అయ్యారు. అందుకే తెలంగాణలో దూకుడు పెంచారు. గత సార్వత్రిక ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు, ఒక అసెంబ్లీ సీటు గెలుచుకోవడంతో బీజేపీ పెద్దల కన్ను తెలంగాణపై బాగానే పడింది. తర్వాత దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం, జీహెచ్ఎంసీలో ఊహించనన్ని సీట్లు గెలుచుకోవడంతో తెలంగాణపై బీజేపీ దృష్టి మరింతగా సారించింది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో 86 వేలకు పైగా ఓట్లు సాధించడంతో మరింతగా దూకుడు పెంచింది. మొన్న కోమటి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే.. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా కమలం కండువా కప్పుకున్నారు. శశిధర్ రెడ్డి బాటలో మరికొందరు సీనియర్ నేతలు ఉన్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బీజేపీ డబుల్ ఇంజిన్ మోడీ- షా జోడీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా తెలంగాణ ప్రజల నాడి తెలుసు.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక సీట్లు గెలిచి విజయ ఢంకా మోగిస్తాం. బీజేపీ అధికారం చేపడుతుంది. నేనే స్వయంగా తెలంగాణకు వెళ్లి బీజేపీని గెలిపిస్తా  అన్నారు. బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో అమిత్ షా తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ నేతల వ్యాఖ్యలు, తెలంగాణ సీనియర్ నేతలు కమలం పార్టీలో వరుసగా చేరుతున్న నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీని రద్దుచేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ముహూర్తం నిర్ణయించినట్లు సంకేతాలు వస్తున్నాయి. బీజేపీ దూకుడుకు ముకుతాడు వేయడంతో పాటు రాష్ట్రంలో హ్యాట్రిక్ గెలుపు కొట్టాలంటే ముందస్తే మందు అని ఆయన ఫిక్స్ అయ్యారని పార్టీ వర్గాలే అంటున్నాయి. అందుకే పరిపానలలో కేసీఆర్ దూకుడు పెంచారంటున్నారు. టీఆర్ఎస్ కీలక నేతలకు ఇప్పటికే గులాబీ బాస్ ముందస్తు సంకేతాలు ఇచ్చారంటున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ.. ముందస్తు ముచ్చటే లేదు అని కేసీఆర్ ఇటీవలే కుండబద్దలు కొట్టారు. అయినప్పటికీ తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వకుండా గండి కొట్టాలంటే.. ఆ పార్టీ నేతలకు ఎన్నికల ప్రణాళిక వేసుకునే సమయం ఇవ్వకూడదంటే.. ముందస్తే బెటర్ అని కేసీఆర్ నిర్ణయించారని ఆ పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. పరిపాలనలో దూకుడు పెంచడం, ఈ డిసెంబర్ లోనే అసెంబ్లీ  ప్రత్యేక సమావేశాలు  నిర్వహిస్తుండడం,  తాజాగా 9 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కేసీఆర్ ముందస్తు ఎన్నికల సన్నాహాలే, సంకేతాలే అంటున్నారు రాజకీయ పండితులు. అసెంబ్లీని ఏ నిమిషంలో అయినా రద్దు చేయాలనే  గులాబీ బాస్ స్కెచ్ వేసినట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం 2023 డిసెంబర్ వరకు ఆగితే.. ఆ లోగా బీజేపీ మరింత మంది సీనియర్ నేతల్ని ఆపరేషన్ ఆకర్ష్ చేసుకుంటే.. ఎన్నికల్లో కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని కేసీఆర్ భావన. ఆ అవకాశం కమలం పెద్దలకు ఇవ్వకూడదని కేసీఆర్ బలంగా డిసైడ్ అయ్యారంటున్నారు. దీంతో పాటు 2023 డిసెంబర్ దాకా ఆగితే.. 2024 మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించే యోచన బీజేపీ పెద్దలు చేస్తున్నట్లు కేసీఆర్ కు అనుమానం ఉందంటున్నారు. ఆ ఛాన్స్ బీజేపీకి ఇవ్వకూడదంటే.. ముందస్తు ఎన్నికలు ఒక్కటే మందు అని గులాబీ బాస్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 2023 ఏప్రిల్, మేనెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు జరిగేలా కేసీఆర్ ప్రణాళిక వేస్తున్నారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. జనవరి చివరిలో లేదంటే ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేసినా.. కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించేందుకు మూడు నెలల సమయం సరిపోతుందని కేసీఆర్ స్కెచ్ అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ లో నిర్వహించిన అనంతరం కొత్తగా నిర్మిస్తున్న సెక్రటేరియట్, ఎన్టీఆర్ ఘాట్ పక్కనే ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించాలని డిసైడ్ అయ్యారంటున్నారు. సెక్రటేరియట్ ప్రారంభోత్సవం సంక్రాంతిని ముహూర్తంగా నిర్ణయించారని సమాచారం. అమరుల స్మారకాన్ని కూడా అదే రోజు ప్రారంభించేందుకు పనులు జరుగుతున్నాయంటున్నారు. డిసెంబర్ తొలి వారం నుంచే జిల్లా కలెక్టరేట్ల భవనాలకు వరుస ప్రారంభోత్సవాలు చేసేలా సీఎం కేసీఆర్ షెడ్యూల్ రెడీ అయింది. ఆ సందర్భంగానే భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారంటున్నారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం, ఫ్లైఓవర్ల నిర్మాణాలు, ప్రారంభోత్సవాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక లాంటివన్నీ వచ్చే మార్చి నెలలోగా పూర్తిచేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తథ్యం అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తప్పు సరిదిద్దాను.. ట్రంప్ ఖాతా పునరుద్ధరణపై ఎలాన్ మస్క్

ప్రపంచ వ్యాప్తంగా అసంఖ్యాక ఖాతాదారులతో ఉన్న ట్విట్టర్ ఎలాన్ మస్క్ పుణ్యమా అని కనీవినీ ఎరుగని గందరగోళంలో పడిపోయింది. సంస్థలో ఉద్యోగులకు భద్రత లేదు. పని గంటలు పెరిగిపోయాయి. పెద్ద సంఖ్యలో సిబ్బంది ఉద్వాసనకు గురయ్యారు. రిప్ ట్విట్టర్ పోస్టులతో సామాజిక మాధ్యమం హోరెత్తింది. అయినా ఎలాన్ మస్క్ తగ్గేదేలే అంటున్నారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ పగ్గాలు చేపట్టి పట్టడంతోనే అనూహ్య మార్పులకు శ్రీకారం చుట్టారు.   ఉద్యోగులపై వేటుతో మొదలు పెట్టి.. ఉన్న ఉద్యోగులపై పనిఒత్తిడి పెంచేయడంతో ట్విట్టర్ సిబ్బంది  స్వచ్చంద రాజీనామాలతో క్యూ కట్టారు. అయినా ఏం ఫరలేదు కొత్త వారికి కొలువులిస్తామంటూ ఎలాన్ మస్క్ తన ధోరణిలో తాను ముందుకు సాగుతున్నారు. అంతేనా త్వరలోనే ట్విట్టర్ 2.0ను తీసుకొస్తామంటున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించిన సందర్భంగా మాట్లాడిన ఆయన ఒక దేశ అధ్యక్షుడి హోదాలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఖాతాను బ్యాన్ చేయడం ట్విట్టర్ చేసిన ఘోరమైన తప్పు  అన్నారు.  2021 జనవరి 6న అధ్యక్ష ఎన్నిక సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. క్యాపిటల్ భవనంలోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. వారిని రెచ్చగొట్టే విధంగా ట్రంప్ వ్యవహరించారని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ట్రంప్ చేసిన ట్వీట్లు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయంటూ ట్విట్టర్ ఆయన ఖాతాని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. మస్క్ తిరిగి వచ్చాక.. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించారు. కానీ.. ట్విట్టర్ కు తిరిగి రావడానికి ట్రంట్ ఇష్టపడలేదు.అక్కౌంట్ ను మస్క్ పునరుద్ధరించినా ఒక్కట్వీట్ కూడా చేయలేదు. దీనిపై మస్క్ ట్రంప్ ట్వీట్లు చేయడం లేదు. అయినా పర్వాలేదు. ఒక ఘోరమైన తప్పును ట్విట్టర్ సరిదిద్దుకోవడమనేది చాలా ముఖ్యమైన విషయం.  అది నేను చేశారు. దేశాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఖాతాను బ్యాన్ చేయడం వల్ల అమెరికాలోని సగం మంది ప్రజల విశ్వాసాన్ని ట్విట్టర్ కోల్పోయింది.అన్నాడు. మరి ఇంతగా ట్రంప్ ను పొగిడి మునగ చెట్టు ఎక్కించిన ఎలాన్ మస్క్ కోసమేనైనా ట్రంప్ మళ్లీ ట్విట్టర్ లోకి వస్తాడేమో చూడాలి.

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జగన్ పాలన.. ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన అంబేడ్కర్ మాటలను ఉటంకిస్తూ రాజ్యాంగం పాలకుడు మంచి వాడైతే మంచి ఫలితం ఇస్తుందనీ, చెడ్డవాడైతే చెడు ఫలితాలే వస్తాయనీ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ దుష్టపాలన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సాగుతోందని విమర్శించారు. జగన్ నియంతృత్వ పాలనకు చరమగీతం పడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జగన్ దుష్టపాలనను దునుమాడుతూ ఆయన రాసిన బహిరంగ లేఖను తెలుగు వన్ పాఠకుల కోసం యధాతథంగా ఇస్తున్నాం...   అందరికీ నమస్కారం.... ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతిఒక్కరికీ స్వేచ్ఛ, సమన్యాయం అందించే ఉన్నత లక్ష్యాలతో రూపొందించిన రాజ్యాంగం మనది. ప్రపంచంలో అత్యున్నత రాజ్యాంగాన్ని మనకు అందించిన  రాజ్యాంగ రూపకర్తల ఆశయాల అమలుకు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సంకల్పం తీసుకుందాం. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రజలకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ‘‘రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే పాలకుడు చెడ్డవాడు అయితే అది చెడ్డ ఫలితాలనే ఇస్తుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు చేసే పాలకుడు మంచివాడు అయితే అది మంచి ఫలితాలు ఇస్తుంది’’ అని డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ 1949లో రాజ్యాంగ సభలో అభిప్రాయపడ్డారు. ఆయన నాడు చేసిన వ్యాఖ్యలు జగన్‌ రెడ్డి లాంటి చెడ్డ పాలకులు భవిష్యత్తు లో వస్తారని ముందే ఊహించి చెప్పి ఉంటారు. నేడు ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పాలన జరుగుతోంది. అధికారంలో ఉన్నామని, తామేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగ విలువల్ని పాటించడంలేదు. రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కుతూ ప్రజల హక్కులు, స్వేచ్ఛను హరిస్తున్నారు.  ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వ పోకడలతో జగన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ టెర్రరిజంతో రాష్ట్రంలో ఆరాచక, ఆటవిక పాలన సాగుతోంది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించినా...పాలకులు, పాలనను  విమర్శించినా ప్రజలు, రాజకీయ పార్టీలపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారు. ప్రజా సమస్యలపై రాజకీయ పక్షాలు నిరసనలు తెలిపే హక్కు కూడా లేదన్నట్లు అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలియజేసే హక్కును హరిస్తున్నారు. కొంతమంది కళంకిత అధికారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ తాము ప్రజలకు జవాబుదారీ అనే విషయాన్ని మరచిపోయారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించే చట్టసభలను దూషణలకు, అసత్యాలకు వేదికగా చేశారు. చట్టసభల గౌరవాన్ని తగ్గించారు. ప్రతిపక్షాలనే కాకుండా మీడియా, న్యాయ వ్యవస్థలపైనా దాడికి దిగుతున్నారు. న్యాయమూర్తులపై ఆరోపణలు చేసే స్థితికి వైసీపీ నాయకులు తెగించారు. అలాంటివారిని వైసీపీ ప్రభుత్వ పెద్దలే రక్షించి, ప్రోత్సహించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఫోర్త్‌ ఎస్టేట్‌గా ఉన్న మీడియాను సైతం చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు రాజద్రోహం వంటి కేసులు పెడుతున్నారు. మీడియా ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలోఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలపై దాడులు పెరిగిపోయాయి. బడుగు, బలహీన వర్గాలపై శిరోముండనాలు, హత్యాయత్నాలు, అక్రమ కేసులు నాటి నాజీ పాలనను గుర్తుకు తెస్తున్నాయి. మాస్క్‌ అడిగిన దళిత డాక్టర్‌ సుధాకర్‌ను నర్సీపట్నంలో ఎలా వేధించి చంపేశారో... న్యాయం అడిగిన అబ్దుల్‌ సలాంను నంద్యాలలో ఎలా బలితీసుకున్నారో... తమను ప్రశ్నించిన సొంత పార్టీ లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజును అక్రమ కేసులతో కస్టడీలో ఎలా చిత్రహింసలకు గురిచేశారో మీరంతా  చూశారు. 42 నెలల్లో ప్రభుత్వ విధానాలకు సంబంధించి దాదాపు 330 పైగా కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రావడం ప్రజా వ్యతిరేక పాలనకు అద్దం పడుతోంది. వందల సంఖ్యలో కోర్టు ధిక్కార పిటిషన్లు గాడి తప్పిన పాలనకు నిదర్శనం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా పలువురు అధికారులు కోర్టు బోనులో నుంచోవాల్సిన దుస్థితి గతంలో ఎప్పడూ లేదు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా లక్షల కోట్ల అప్పులు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. రాష్ట్ర భవిష్యత్‌కు ఇది అత్యంత ప్రమాదకరం, గొడ్డలిపెట్టు. ఇలా అన్ని వ్యవస్థలను ఈ ప్రభుత్వం నాశనం చేసింది. ఒకప్పుడు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే ముందున్న రాష్ట్రం ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయింది... ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి? ప్రజలంతా ఆలోచన చేయాలి. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా తాము చెప్పిందే రాజ్యాంగం అనే గర్వంతో విర్రవీగుతున్న వైసీపీ నేతలను ప్రజాక్షేత్రంలో శిక్షించి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుంబిగించాలి. లేకపోతే వైసీపీ శ్రేణుల ఆకృత్యాలు మీ ఇంటిని చుట్టుముడతాయి. దుర్మార్గులు మీ ఆస్తులను చెరబడతారు. మీ ప్రాణాలకు ముప్పు తీసుకువస్తారు. నేడు రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక పాలనపై ప్రజలందరూ ఏకమై రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాలి. లేకుంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమవుతుంది. భారత రాజ్యాంగం అత్యున్నతమైనది. రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజల హక్కుల రక్షణ కోసం ప్రతిపక్షపార్టీగా మేము చేసే పోరాటానికి ప్రజలంతా కలిసి రావాలని భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పిలుపునిస్తున్నాం.  ధన్యవాదములతో... మీ నారా చంద్రబాబునాయుడు

పశువులకు మరణశాసనం రాస్తున్న కొత్త వైరస్

దేశంలో బయటపడిన ఒక వైరస్ మరణశాసం లిఖిస్తోంది. అయితే ఈ  వైరస్ మనుషులకు కాదు.. పశువులకు మృత్యు పాశంగా మారింది. ఈ వైరస్ నే లంపి చర్మ వ్యాధి అని అంటారు. ఈ వ్యాథి వేగంగా వ్యాపిస్తోంది. ఇన్ఫెక్షన్ సోకగానే ఈ చర్మ వ్యాధి పశువు చర్మం మొత్తం వ్యాపిస్తున్నది.  గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ తో  సహా పద్దెనిమిది  రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ ఈ వ్యాధి బారిన పడి మూడు లక్షల పశువులు చనిపోయాయి. అయితే  మిగిలిన రాష్ట్రాల కంటే రాజస్థాన్ లో పశువులలో  ఈ వ్యాధి వ్యాప్తి అత్యంత తీవ్రంగా ఉంది. లంపి స్కిన్ డిసీజ్ రాజస్థాన్‌, గుజరాత్ లో భయంకరమైన వేగంతో వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు గుజరాత్, రాజస్థాన్ లోనే 70 వేలకు పైగా పశువులు మరణించాయి.  గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్‌, ఇమ్యునైజేషన్ నివేదిక ప్రకారం, లంపి చర్మ వ్యాధి  కాప్రిపోక్స్ అనే వైరస్ వల్ల సంక్రమిస్తుంది. ఇది “ప్రపంచవ్యాప్తంగా పశుసంపదకు పెను ముప్పుగా పరిణమించనుంది.  ఈ వైరస్ సాధారణంగా  ఈగలు, దోమలు లేదా పేల ద్వారా వ్యాపిస్తుంది.  ఈ వ్యాధి సోకిన పశువులలో దీర్ఘకాలిక బలహీనత, పాల ఉత్పత్తి క్షీణత, పెరుగుదల ఆగిపోవడం, వంధ్యత్వం, గర్భస్రావం, చివరిగా  మరణం సంభవిస్తాయి. 

కాంగ్రెస్ పరాజయ పరంపరకు ప్రియాంక చెక్ పెడతారా?

ఎన్నిక ఏదైనా.. ఎక్కడైనా పరాజయం ఫిక్స్ అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఉంది. రేవంత్ టీపీసీసీ చీఫ్ అయిన తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లు కనిపించినా.. ఏం మారలేదన్నది మునుగోడు ఉప ఎన్నిక ఫలితం నిర్ద్వంద్వంగా తేల్చేసింది. మునుగోడు ఉప ఎన్నికలో సిట్టింగ్ సీటును కోల్పోవడమే కాదు.. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడం రాష్ట్రంలో ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన పార్టీగా తెరాసకు ఎంత సానుకూలత ఉందో.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కూ అంతే సానుకూలత ఉండాలి. కానీ రాష్ట్ర ఆవిర్బావం తరువాత నుంచీ ఆ పార్టీ రోజురోజుకూ దిగజారిపోతోంది. ఇందుకు అంతర్గత విభేదాలు ఎంత కారణమో, పార్టీలో నాయకత్వ లోపమూ అంతే కారణం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కి ఉన్న అవకాశాలను పార్టీలో  అంతర్గత కుమ్ములాటలు భగ్నం చేశాయనడంలో సందేహం అవసరంలేదు. రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత  క్యాడర్ లో   జోష్ పెరిగినా పార్టీలో మిగతా నేతల వైఖరితో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళిలాగే ఉంది.  అధ్యక్షుడితో పార్టీ సీనియర్లు కలిసి రాకపోవడం.. వర్కింగ్ ప్రెసిడెంట్లు యాక్టివ్ లేకపోవడంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. దీంతో అందరికీ తెలిసిన విషయమే అయినా అధిష్ఠానం అసలు రాష్ట్ర కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది అన్న ప్రశ్న వేసి సమాధానం కోసం అన్వేషించడం మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ గాడిన పడకపోవడానికి కారణం ఏమిటి? రేవంత్ రెడ్డి సీనియర్లను దూరం పెడుతున్నారా? సీనియర్లే రేవంత్ కు దూరం జరుగుతున్నారా? అన్న విషయంపై గతంలో ఒక సారి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక గాంధీ హస్తిన లో భేటీ అయ్యారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో ఘోర పరాజయం తరువాత మరో సారి ప్రియాంక తెలంగాణ రాష్ట్రంపై దృష్టి పెట్టారని పార్టీ వర్గాలు అంటున్నాయి. నేతలను  పోవడం లేదా? ఇక తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలను ప్రియాంక తన భుజస్కంధాలపై వేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అంటే పేరుకు రేవంత్ టీసీసీసీ అధ్యక్షుడే అయినా.. అధికారాలన్నీ ప్రియాంకా తన వద్ద అట్టే పెట్టుకుంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీ కార్యక్రమాలు.. సమావేశాలు.. కార్యాచరణ అన్నీ ఆమె ఆదేశాల ప్రకారమే  ఉంటాయని అంటున్నారు.  ఇందుకు కారణం రేవంత్ తన సొంత అజెండాతో పని చేస్తున్నారంటూ సీనియర్లు పదే పదే అధిష్ఠానానికి చేసిన ఫిర్యాదులే కారణమని చెబుతున్నారు. అన్నిటికీ మించి మర్రి శశిథర్ రెడ్డి పార్టీకి దూరం అవ్వడాన్ని కాంగ్రెస్ హై కమాండ్ ఒకింత తీవ్రంగానే పరిగణించిందని అంటున్నారు. పార్టీలో సీనియర్ లంతా ఒకరి వెంట ఒకరు క్యూ కట్టినట్లుగా వెళ్లి పోతుండటం, వారిని నిలువరించడానికి రేవంత్ ఎటువంటి ప్రయత్నం చేయడం లేదన్న భావనతోనే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నిర్వహణ పగ్గాలను ప్రియాంక తన చేతికి తీసుకోవాలని నిర్ణయించారంటున్నారు. ఈ నిర్ణయం ఒక విధంగా పార్టీలో రేవంత్ దూకుడుకూ, అదే సమయంలో సీనియర్ల సహాయ నిరాకరణకూ చెక్ పెట్టినట్లౌతుందన్నది కాంగ్రెస్ హై కమాండ్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రియాంక నేరుగా పర్యవేక్షిస్తేనైనా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగౌతుందా అన్నది వేచి చూడాల్సిందే. పార్టీ పట్ల ప్రజలలో సానుకూలత ఉన్నా కాంగ్రెస్ నాయకులకు ప్రజలతో సంబంధాలు తెగిపోవడమే రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితికి కారణమంటున్నారు.

మళ్లీ జగన్ బీసీ కార్డ్.. మరో సారి జనం ముందుకు వైసీపీ బీసీ నేతలు?

దిగజారిపోతున్న ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడుకోవడానికి జగన్ పార్టీలోని బీసీ నేతలపై ఆధారపడనున్నారా? ఇప్పటికే ఒక సారి బీసీ మంత్రులను బస్సు యాత్రపేరిట రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి భంగపడిన జగన్ మరోసారి అదే దారిలో నడవనున్నారా? అందుకే బీసీ నేతలతో సమావేశం అవుతున్నారా అన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.  మంత్రి బొత్స సత్యనారాయణ, ముత్యాల నాయుడు, జోగి రమేష్ గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మోపిదేవి వెంకటరమణ, పార్థసారథి, జంగాకృష్ణ మూర్తి, అనిల్ కుమార్ యాదవ్ సహా పార్టీలోని బీసీ నేతలందరూ జగన్ తో భేటీ అయ్యారు. భేటీ వివరాలు వెంటనే బయటకు తెలయరాలేదు. అయినా ఈ సమావేశంలో జగన్ వారికి మరో సారి ఆవు కథ వినిపించారనీ, ప్రభుత్వం బీసీలకు అందిస్తున్న పథకాలను ఏకరవు పెట్టారనీ, వీటన్నిటినీ బీసీలలో విస్తృతంగా ప్రచారం చేసి వారిని పార్టీకి దగ్గర చేసే బాధ్యతను పార్టీలోని బీసీ నేతలంతా తీసుకోవాలని దిశా నిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. అసలు పార్టీలోని బీసీ నేతలతో జగన్ భేటీకి కారణం కూడా ఇదేననీ అంటున్నారు. ప్రస్తుతం పార్టీలోని సీనియర్ బీసీ నేతలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. కేబినెట్ లో సముచిత స్థానం లేకపోవడం.. మంత్రివర్గ పునర్వ్వవస్థీకరణలో ఉద్వాసనకు గురైన వారిలో ఎక్కువ మంది బీసీ నేతలే కావడం ఇందుకు కారణంగా చెబుతున్నారు.  ఇక నామినేటెడ్ పదవుల పందేరంలో కూడా బీసీ నేతలకు జగన్ న్యాయం చేయలేదన్న అసంతృప్తి వారిలో గూడుకట్టుకుని ఉందంటున్నారు. అయితే జగన్ మాత్రం వారి అసంతృప్తిని చల్లార్చేందుకు ఇప్పటి వరకూ ఎటువంటి ప్రయత్నం చేయలేదంటున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ప్రతికూల పవనాలు వీస్తున్న తరుణంలో గట్టెక్కాలంటే.. బీసీల మద్దతే శరణ్యం అన్న భావనతో బీసీ నేతలతో జగన్ బేటీ అయ్యారనీ, అయితే ఈ భేటీలో కూడా వారిలో అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం కాకుండా.. బీసీ నేతలుగా పార్టీకి బీసీలను దగ్గర చేయాల్సిన బాధ్యత మీదే అన్న హుకుం జారీ చేయడానికే పరిమితమయ్యారని అంటున్నారు. ఈ భేటీతో వైసీపీ బీసీ నేతల్లో అసంతృప్తి మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు మరింత ఎక్కువయ్యాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. విపక్షాల విమర్శలను తిప్పి కొట్టడానికి, బీసీల మద్దతు కూడగట్టడానికి బీసీ నేతలను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు జగన్ పురమాయించారని అంటున్నారు.  

సెటిలర్లపై కాషాయం కన్ను.. తెలంగాణలో అధికారానికి అదే దన్ను!

తెలంగాణలో అధికారం దక్కించుకోవాలంటే. సెటిలర్ల మద్దతు అనివార్యమన్న నిర్ణయానికి బీజేపీ వచ్చేసింది. సెటిలర్ల మద్దతు సంపూర్ణంగా లేకుంటే తెలంగాణలో అధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోతుందని భావిస్తున్న బీజేపీ ఇక ఇప్పుడు సెటిలర్ల ఓట్లపై గురిపెట్టిందని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. గంపగుత్తగా సెటిలర్ల ఓట్లను తమ ఖాతాలో వేసుకోవాలంటే.. తెలంగాణలో ఇప్పుడున్న తెలుగుదేశం స్థానానికి బీజేపీ చేరుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణలో కనీసం 40 స్థానాలలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి గణనీయమైన ఓటు బ్యాంకు ఉందన్న అంచనాలున్నాయి. అందుకే బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం మద్దతు కోరుతోందని పరిశీలకులూ అంటున్నారు. 2019 ఎన్నికల వరకూ కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీని కానీ, ఆ పార్టీకి ఉన్న జన మద్దతును గానీ పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే తెలంగాణలో అధికారం కనుచూపు మేరలో కనిపిస్తోందో.. రాష్ట్రంలో పార్టీ బలోపేతమై.. అధికార పగ్గాలు చేపట్టడానికి చేరువకు వచ్చిందన్న భావన వచ్చిందో.. అప్పటి నుంచీ కమలనాథుల దృష్టి సెటిలర్ల మద్దతు కూడగట్టడంపై కేంద్రీకృతమైంది. అందులో భాగంగానే ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందట రద్దైన ఆంధ్రా బీసీకులాల రిజర్వేషన్ల పునరుద్ధరణ కోసం బీజేపీ ఇప్పుడు గళమెత్తుతోంది. నాడు రద్దు చేసిన ఆంధ్రా బీసీ కులాల రిజర్వేషన్ పునరుద్ధరణ కోరుతూ గవర్నర్ తమిళిసైకి వినతి పత్రం ఇవ్వడం వెనుక కారణం ఇదేనని పరిశీలకులు అంటున్నారు. ఎనిమిదేళ్ల కిందట కేసీఆర్ ఆంధ్రా బీసీ కులాల రిజర్వేషన్ రద్దు చేసినప్పుడు ఏపీ బీసీ సంఘాలు వినా ఎవరూ స్పందించలేదు. ఇన్నేళ్లైన తరువాత ఇప్పుడు బీజేపీ నాడు రద్దు చేసిన రిజర్వేషన్ల పునరుద్ధరణకు గళం ఎత్తడం వెనుక సెటిలర్ల ఓట్లకు గాలం వేయడమనే లక్ష్యమే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణపై పట్టు సాధించేందుకు   అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ వినియోగించుకోవడమే లక్ష్యంగా కాషాయదళం అడుగులేస్తోంది. అందులో భాగంగానే రద్దైన ఆంధ్రా బీసీ రిజర్వేషన్ల పునరుద్ధరణ నినాదాన్ని అందుకుంది. దీని వల్ల సెటిలర్ల ఓట్లతో పాటు బీసీల ఓట్లు గంపగుత్తగా తమ వైపు మళ్లుతాయని ఆశిస్తోంది. అయితే నాణేనికి రెండో వైపు ఈ రిజర్వేషన్ల పునరుద్ధరణ నిర్ణయం తెలంగాణ బీసీలను దూరం చేసే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయంలో బీజేపీ వ్యూహాలు వేరేగా ఉంటున్నాయంటున్నారు. సెటిలర్లు ఇప్పటి వరకూ తెలుగుదేశంకు అనుకూలంగానే ఉన్నారు తప్ప మరో పార్టీ వైపు చూపు సారించలేదు. అందుకే ఏపీలో బీసీ సంఘాలు సంతృప్తి చెందేలా.. రద్దైన రిజర్వేషన్ల పునరుద్ధరణ నినాదం అందుకుంటే వారికి దగ్గర కావచ్చునని బీజేపీ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. విభజన తరువాత కూడా 21014 ఎన్నికలలో తెలుగుదేశంతో కలిసి పోటీ చేసిన బీజేపీ ఐదు స్థానాలలో విజయం సాధించిన సంగతిని బీజేపీ ఈ సందర్బంగా గుర్తు చేసుకుంటున్నది. తెలుగుదేశం పార్టీకి ఆ ఎన్నికలో 15 స్థానాలు వచ్చిన సంగతి తెలిసిందే. మళ్లీ ఆ పరిస్థితిని పునరావృతం చేయాలన్నదే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది.  తెలుగుదేశంతో సంబంధం లేకుండానే సెటిలర్లకు దగ్గరవ్వడానికి బీజేపీ ప్రస్తుతం ప్రయత్నిస్తోంది. ఒక వేళ అలా సాధ్యం కాకపోతే.. ఆ పార్టీతో పొత్తుకు కూడా సిద్ధపడేందుకు బీజేపీ ఇప్పటికే ఒక  నిర్ణయానికి వచ్చేశారంటున్నారు. 

ఫోన్ మిస్సింగ్ లోగుట్టేంటి?

వరుస ఐటీ, ఈడీ అధికారుల సోదాలతో తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ నాయకులు హడలెల్తిపోతున్నారు. తాజాగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి నివాసంతోపాటు ఆయన సంస్థల్లో ఐటీ శాఖ సోదాల చేపట్టింది. ఆ క్రమంలో సదరు మంత్రిగారి వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. ఐటీ సోదాల నేపథ్యంలో మల్లారెడ్డి.. తన సెల్ ఫోన్‌ను డస్ట్ బీన్‌లో చెత్త మాటున దాచి పెట్టినట్లు సోషల్ మీడియా సాక్షిగా ఓ వార్త అయితే తెగ వైరల్ అవుతోంది.  అయితే ఆ ఘటన జరిగిన జస్ట్ 24 గంటల్లోనే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీకి చెందిన అత్యంత శక్తివంతమైన నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెల్ ఫోన్.. నవంబర్ 21న పోయిందంటూ.. ఆయన వ్యక్తిగత కార్యదర్శి .. నవంబర్ 23వ తేదీన తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై సోషల్ మీడియా సాక్షిగా విజయసాయిరెడ్డిపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మాయల ఫకీర్ ప్రాణాలు.. సప్త సముద్రాల అవతల మర్రిచెట్టు తొర్రలో ఉన్నట్లు.. ఈ విజయసాయిరెడ్డిగారి గుట్టంతా.. ఆయనగారి ఐఫోన్‌లో ఉందని ఒకరు కామెంట్ చేస్తే..  ఈ మూడున్నరేళ్లలో ఈ ఏ2 గారు చేసిన అరాచకాలకు అసలు సిసలు సాక్షి.. ఆ సెల్ ఫోనే అంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానిస్తూ పోస్ట్ పెట్టారు. మరోకరు అయితే ఇంకొంచెం ముందుకెళ్లి ఉత్తరాంధ్రలో రుషి కొండను చెక్కినా.. మైనింగ్ కోసం పాతాళం వరకు తవ్వినా... ఏదైనా.. దేనికైనా.. విజయసాయిరెడ్డి సెల్ ఫోనే అందుకు సాక్షి అని వారు సోషల్ మీడియా సాక్షిగా స్పష్టం చేస్తున్నారు. ఇంకొకరు అయితే.. నేడు తెలంగాణలోని మంత్రి మల్లారెడ్డి దాకా వచ్చింది... రేపు నా దాకా రాదనే గ్యారెంట్ అయితే లేదని.. ఆ క్రమంలోనే ఈ సాయిరెడ్డి..ముందుగానే తన సెల్ ఫోన్.. మాయం చేశారని మరొ నెటిజన్ తనదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సెల్ ఫోన్‌ మాయం వెనుక పెద్ద మతలబే ఉండి ఉంటుందని మరో నెటిజన్ సందేహంతో కామెంట్ పెట్టారు.  మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. సూట్ కేసు కంపెనీలు.. వైయస్ జగన్ వ్యాపారం.. వేల కోట్ల రూపాయిల అక్రమాస్తుల ఎపిసోడ్‌కి కర్మ.. కర్త... క్రియా అంతా ఈ ఏ2 విజయసాయిరెడ్డి గారేననే చర్చ నాడే కాదు.. నేటికి నాంపల్లి పరిసర ప్రాంతాల్లో తరుచు వినిపిస్తోందని ఓ నెటిజన్ అయితే సెటైరికల్‌గా కామెంట్ పెట్టారు. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సైతం ఈ విజయసాయి రెడ్డి.. తన చదవిన చదువుకు మెరుగులు పెట్టి మరి... నీకు అది నాకు ఇది పథకానికి మరింత మెరుగు పెట్టారనే ఓ చర్చ సైతం.. ఫ్యాన్ పార్టీలో గుప్పు గుప్పుమంటోందని ఓ నెటిజన్... తన మార్క్ పొలిటికల్ థియరీతో అనాలసిస్ చేసేయడం విశేషం.    అయినా ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్ తర్వాత స్థానంలో ఉన్న ఈ విజయసాయి సెల్ ఫోన్ మాయం కావడం నిజంగా నిజమేనా? అంతా ఫుల్ సెక్యూరిటీ.. ఆయన గారి చుట్టు మంది మార్బలం ఎప్పుడు ఉంటారు. అయినా సాయిరెడ్డిగారి సెల్ ఫోన్ ఎప్పుడు పోయింది.. ఎక్కడ పోయింది.. ఎలా పోయిందంటూ ఓ నెటిజన్ తన దేహంలో పుట్టిన సందేహాలతో సోషల్ మీడియా సాక్షిగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించేశారు. మరో నెటిజన్ అయితే.. ఒక్క సెల్ ఫోన్... లక్ష సందేహాలు లాగా పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు.   ఇక మరోవైపు విజయసాయిరెడ్డి సెల్ ఫోన్ పోయిందంటూ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేయడంతో ప్రతిపక్ష టీడీపీ ఆగమేఘాల మీద స్పందించింది. ఆ పార్టీలోని కీలక నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి.. సెల్ పోయిందా లేక.. పారేశారా లేదంటే.. విజయసాయి రెడ్డి ఫోన్ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బలవంతంగా లేగాసుకున్నారా? అంటు మీడియా సాక్షిగా ప్రశ్నల వర్షం కురిపించేశారు. అయినా విజయసాయి ఫోన్ పోయిందో లేదో కానీ.. ఆయనగారి ఒక్కగానొక్క సెల్ ఫోన్ మిస్సింగ్‌తో ఎంతో మంది అటు మీడియా సాక్షిగా ఇటు సోషల్ మీడియా సాక్షిగా తమదైన శైలిలో స్పందించడం విశేషం. ఏదీ ఏమైనా.. ఓ వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ, ఐటీ శాఖలు  రంగంలోకి దిగితే... పాత్రదారులు, సూత్రధారులు పని పట్టడం ఎంత సేపు అనే ఓ చర్చ అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన... సాగుతోంది.

గొప్ప నేతల జాబితాలో మోడీ టాప్

కీలక అంశాలలో మౌనం.. ఉద్వేగాలను రెచ్చగొట్టే విషయంలో అనర్గళ ప్రసంగాలు.. దేశంలో సమస్యలు వెల్లువెత్తుతున్నా పట్టించుకోని తీరు.. వెరసి గత ఎనిమిదేళ్ల మోడీ పాలనపై దేశంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అదే సమయంలో ఎన్నికలలో మాత్రం బీజేపీ వరుస విజయాలు అందుకుంటోంది. హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల మొదటి వారంలో వెలువడనున్నాయి. హిమాచల్ అసెంబ్లీకి ఒకే విడతలో ఇప్పటికే ఎన్నికలు పూర్తి అయ్యాయి. గజరాత్  అసెంబ్లీ కి వచ్చే నెల1, 5 తేదీలలో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలూ వచ్చే నెల 8న వెలువడతాయి. అయితే రెండు రాష్ట్రాలలో కూడా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడం తథ్యమనే ఇప్పటి వరకూ వెలువడిన పలు సర్వేలు పేర్కొన్నాయి. ఒక వైపు వ్యతిరేకత వెల్లువెత్తుతున్నా.. జనం మాత్రం మోడీ పాలనవైపే మొగ్గు చూపుతున్నారు. ఇదేలా సాధ్యమంటే బీజేపీ వారు అదే మోడీ మ్యాజిక్ అంటారు. ఇదిలా ఉంటే.. ప్రపంచంలోని గొప్ప నేతల జాబితాలో మోడీ తన అగ్రస్థానాన్ని మరో సారి నిలబెట్టుకున్నారు. మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ప్రపంచంలోని గొప్ప నేతలు ఎవరన్న అంశంపై నిర్వహించిన సర్వేలో మోడీ మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ జాబితాలో 77శాతం రేటింగ్ తో మోడీ టాప్ గా నిలిచారు. మోడీ తరువాత రెండో స్థానంో ఉన్న ఆస్ట్రేలియా ప్రధానికి దక్కిన రేటింగ్ 56శాతం మాత్రమే. ఇక అగ్రరాజ్యం జోబెడెన్ 44శాతం రేటింగ్ తో మూడో స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో టాప్ ఫైవ్ లో కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రుడో 39 శాతం రేటింగ్,  బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ 36శాతం రేటింగ్ ఉన్నారు. మొత్తం 22 దేశాల అధినేతల రేటింగ్స్ తో ఈ సంస్థ గొప్ప నాయకుల జాబితాను విడుదల చేసింది. ఈ సంస్థ ప్రభుత్వాలు, నేతల తీరును ట్రాక్ చేస్తుంటుంది. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో కూడా మోడీ 75 శాతం రేటింగ్ తో తొలి స్థానంలో నిలిచారు. అప్పటి కంటే తాజా సర్వేలో మోడీ రేటింగ్ మరో 2 శాతం పెరగడం గమనార్హం.

సీబీఐ చార్జ్ షీట్ లో కనిపించని మనీష్ సిసోడియా, శరత్ చంద్రారెడ్డి పేర్లు

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సీబీఐ, ఈడీలో పోటీలు పడి మరీ ఈ కేసు దర్యాప్తులో అంతులేని వేగం ప్రదర్శించాయి. దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించాయి. పలువురు ప్రముఖ రాజకీయ నేతల పేర్లు ఈ కుంభకోణం కేసులో వెలుగులోకి వచ్చాయి. అసలీ కేసులు ఏ1గా డిల్లీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడిగా పేరును సీబీఐ ఎఫ్ఐఆర్ పే పేర్కొంది. సరే పలువురిని ఈ కేసులో అరెస్టు చేయడం కూడా జరిగింది. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ కేసులో సీబీఐ ఢిల్లీ హైకోర్టులో శుక్రవారం తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. అయితే విచిత్రంగా ఎఫ్ఐఆర్ లో ఎ1 ముద్దాయిగా పేర్కొన్న మనీష్ సిసోడియా పేరును చార్జిషీట్ లో పేర్కొన లేదు. ఇంకా ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్ లో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉన్నారు. మరో ఐదుగురు ప్రైవుటు వ్యక్తులు ఉన్నారు. ఆ ప్రైవేటు వ్యక్తులలో తెలంగాణకు చెందిన అభిషేక్ రావు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రచురితమౌతున్న ఒక ప్రముఖ దినపత్రిక ఎండీ ఉన్నారు. అలాగే మరో వ్యక్తి అరుణ్ రామచంద్రపిళ్లై ఉన్నారు. ఇదే కేసులో సీబీఐ అప్రూవర్ గా పేర్కొన్న దినేష్ అరోరా కూడా ఉన్నారు. కానీ ఈ కేసులో ఎ1గా ఎఫ్ ఐఆర్ లో సీబీఐ పేర్కొన్న మనీష్ సిసోడియా పేరు లేకపోవడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. అలాగే ఈ స్కాం కు సంబంధించి ఇటీవల అరెస్టయిన అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేరూ కూడా సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో లేదు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశమేమిటంటే.. శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కాంలోనే అరెస్టయినా ఆయనను అరెస్టు చేసింది మాత్రం ఈడీ. సీబీఐ కాదు. అందుకే సీబీఐ చార్జ్ షీట్ లో ఆయన పేరు లేదంటున్నారు. మొత్తం మీద సీబీఐ చార్జిషీట్ లో మనీష్ సిసోడియా పేరు లేకపోవడంతో.. ఆప్ ఆరోపిస్తున్నట్లుగానే లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగానే ఏ1గా నమోదు చేశారా అన్న అనుమానాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. అయితే సిసోడియా సన్నిహితుడైన దినేష్ అరోరాను సీబీఐ అప్రూవర్ గా ప్రకటించడంతో ముందు ముందు మరేవైనా సంచలనాలు బయటపెట్టనుందా అన్న అనుమానాలూ వ్యక్త మౌతున్నాయి. ఇక నేడో రోపో ఇదే కేసులో ఈడీ కూడా చార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఆ చార్జిషీట్ లో ఎవరెవరి పేర్లు ఉంటాయన్న ఆసక్తి రాజకీయ వర్గాలలో నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అవినీతి కోణాన్ని సీబీఐ, మనీల్యాండరింగ్ అంశంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి విదితమే. 

ఏపీ నూతన సీఎస్ గా జవహర్‌రెడ్డి?

ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త  సీఎస్‌గా కేఎస్ జవహర్ ‌రెడ్డి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం. మరో సారి సమీర్ శర్మకు ఎక్స్ టెన్షన్ కోరుతారని తొలుత అంతా భావించినా.. జగన్ నుంచి అటువంటి కదలిక ఏదీ కనిపించలేదు. సమీర్ శర్మ పదవీ విరమణ సమయం సమీపిస్తుండటంతో ఆయనకు మరో ఏడాది పదవీ కాలం పొడగింపునకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందన్న వార్తలు వినవచ్చాయి. అయితే జగన్ సర్కార్ కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలే చెబుతుండటంతో సమీర్ శర్మ పదవీ కాలం పొడగింపు ఊహాగానాలకు చెక్ పడింది. స్వయంగా సమీర్ శర్మ కూడా రిటైర్మెంట్ కే మొగ్గు చూపారనీ, ఇందుకు తన ఆరోగ్య పరిస్థితి కారణంగా చెప్పారని అంటున్నారు. దీంతో జగన్ కొత్త సీఎస్ గా జవహర్ రెడ్డి వైపు మొగ్గు చూపారని అంటున్నారు. ఆయన పేరును నేడో రేపో ప్రకటించే అవకాశాలున్నాయని అంటున్నారు.  అయితే జవహర్ రెడ్డి విషయానికి వస్తే.. జగన్ అధికార పగ్గాలు చేపట్టేంత వరకూ..   జవహర్ రెడ్డి ప్రధాన లేదా కీలక పదవులలో బాధ్యతలు నిర్వహించలేదు. అయితే ఆయనకు  జగన్  ముఖ్యమంత్రి అయిన తరువాత   ఎక్కడ లేని ప్రాధాన్యతా వచ్చి పడింది. కరోనా సమయంలో ఆరోగ్య శాఖ మొత్తం జవహర్ రెడ్డి కనుసన్నలలోనే పని చేసింది. తర్వాత ఆయన తనంత తానుగా  కోరుకుని మరీ   టీటీడీ చైర్మన్  పోస్టుకు వెళ్లారు. అయితే అది అతి కొద్ది కాలం మాత్రమే. తరువాత జగన్ ఆయనను ముఖ్యమంత్రి కార్యాలయానికి తెచ్చుకుని కీలక బాధ్యతలు అప్పగించారు.  ఇప్పుడు సీఎస్ గా ఆయన పేరునే పరిశీలిస్తున్నారు.   సమీర్ శర్మ రిటైర్మెంట్ తరువాత సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సీఎస్ గా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా.. అది ప్రచారంగానే మిగిలిపోయింది. గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ జగన్ అక్రమాస్తుల కేసులో ఆమెపై కేసులు ఆలాగే ఉండటంతో ఆమెకు అవకాశం దక్కలేదని అంటున్నారు.   ఇక, సీఎస్‌గా పదవీ విరమణ చేయనున్న సమీర్ శర్మకు కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. అలాగే, ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్, ఎక్స్‌లెన్స్ అండ్ గవర్నెన్స్ (ఐఎల్ఈ అండ్ జీ) వైస్ చైర్మన్ ‌గానూ ఆయనను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. జవహర్ రెడ్డి  ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 

కివీస్ పై ఇండియా చెత్త రికార్డు

న్యూజిలాండ్ పై ఓటముల్లో టీమ్ ఇండియా ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. ఆక్లాండ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో శుక్రవారం జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త జ‌ట్టు 7 వికెట్ల తేడాతో ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమితో టీమ్ఇండియా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వ‌న్డేల్లో న్యూజిలాండ్ పై వ‌రుస‌గా ఐదు మ్యాచుల్లో ఓడిన రికార్డును టీమ్ ఇండియా సాధించింది. 2019 ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్‌లో మొద‌లైన ఓట‌ముల ప‌రంప‌ర ఇప్పటి వరకూ కొనసాగింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ లో భారత్ 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై పరాజయం పాలైంది.  ఆ త‌రువాత 2020లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత్ మరోసారి న్యూజిలాండ్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమ్ ఇండియా ఓటమినే మూటగట్టుకుంది. ఇప్పుడు శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారత్  తొలి వన్డేలో ఓడిపోయింది. దీంతో  వన్డేల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు ఇది వరుసగా ఐదో ఓటమి. చ‌రిత్ర‌లో ఇలా వ‌రుస‌గా కివీస్ పై వ‌న్డేల్లో భార‌త్ ఐదు మ్యాచుల్లో ఎన్న‌డూ ఓడిపోలేదు. చివ‌రి సారిగా ఫిబ్రవరి 2019లో కివీస్ పై భార‌త్ విజ‌యం సాధించింది. ఆ మ్యాచ్‌లో అంబటి రాయుడు 90 పరుగులు చేయ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 252 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సంతోష్ కు బిగ్ రిలీఫ్

ఎమ్మెల్యేలకు కొనుగోలు బేరసారాల కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని తెలంగాణ‌ సిట్‌  నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  తదుపరి విచారణను డిసెంబర్ 5కి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ ను నిందితుల జాబితాలో చేర్చి సీఆర్‌పీసీ 41ఏ కింద సిట్ ఆయనకు   నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, నోటీసు ర‌ద్దు చేయాల‌ని బీఎల్ సంతోష్ న్యాయ‌స్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు లంచ్ మోష‌న్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదులో బీఎల్ సంతోష్ పేరు లేద‌ని, ఎఫ్ఐఆర్‌లో కూడా పేరు లేన‌ప్పుడు ఆయ‌న్ని నిందితుల జాబితాలో ఎలా చేరుస్తార‌ని అభ్యంత‌రం లేవ‌నెత్తారు. ఈ విష‌యాల‌ను అన్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు బీఎల్ సంతోష్ కు ఊరట కలిగిస్తూ  ఆదేశాలు జారీ చేసింది.   కాగా ఈ కేసులో బీఎల్ సంతోష్ ప్రమేయంపై  ఆధారాలు ఉన్నాయని తెలంగాణ అడ్వకేట్ జనరల్ వాదించారు.ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల   కేసుకు సంబంధించి బీఎల్ సంతోష్, కేరళ ఎన్డీయే కన్వీనర్ తుషార్, డాక్టర్ జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్ ను సిట్ నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. 

డ్రాగన్ దేశంలో మళ్లీ కరోనా విలయం

కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోందా? మరో సారి వైరస్ ముప్పు ముంచుకు రాబోతోందా? మళ్లీ లాక్ డౌన్ లో క్వారంటైన్ లూ తప్పవా? అంటే చైనా ఔననే అంటోంది. కరోనా వైరస్ పుట్టిన చైనాలో ఆ మహమ్మారి మరో సారి విజృంభిస్తోంది. డ్రాగన్ దేశంలో ఒకే రోజు 33వేల మందికి పైగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఒక్క సారిగా కరోనా కేసులు పెరిగిపోవడంతో చైనా బెంబేలెత్తిపోతోంది. గురువారం ఒక్కరోజే 32వేల 943 కేసులు నమోదయ్యాయి. వీటిలో 29వేల 840 కేసులు అసింప్టొమేటిక్, 3వేల 103 కేసులు సింప్టొమేటిక్ అని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించినా, కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా.. రికార్డు స్థాయిలో వేల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తోంది. మళ్లీ ప్రబలుతున్న కరోనా మహమ్మారి.. చైనా ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీసింది. ఈ వ్యాప్తి వేగం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరో వేవ్ తప్పదా అన్న అనుమానాలకు తావిస్తోంది. ప్రపంచంలో చాలా దేశాలు మళ్లీ కరోనా జాగ్రత్తలు పాటించాలంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాయి.

ఫిఫా వరల్డ్ కప్.. వేల్స్ పై ఇరాన్ విజయం..చివరి నిముషాల్లో అద్భుతం

ఖ‌తార్ వేదిక‌గా జ‌రుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2022లో ఇరాన్ జ‌ట్టు బోణి కొట్టింది. వేల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో విజ‌యం సాధించి ప్రపంచ‌క‌ప్‌లో త‌మ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. ఆట అద‌న‌పు స‌మ‌యంలో రూజ్‌బే చేష్మీ (90+9 నిమిషం), రామిన్ రిజయాన్(90+11 నిమిషం)లో చెరో గోల్ చేయ‌డంతో ఇరాన్ అద్భుత విజ‌యాన్ని అందుకుంది.  ఇరు జ‌ట్లు హోరా హోరీగా తలబడ్డ ఈ మ్యాచ్లో వేల్స్ గోల్‌పోస్ట్‌పైకి ఇరాన్ ఆట‌గాళ్లు ప‌దే ప‌దే దాడులు చేసినా ఫ‌లితం లేక‌పోయింది. వేల్స్ డిఫెన్స్  స‌మ‌ర్థ‌వంతంగా వాటిని అడ్డుకుంది. దీంతో తొలి అర్థ‌భాగంలో ఇరు జ‌ట్లు ఒక్క గోల్ కూడా చేయ‌లేక‌పోయాయి. సెకండాఫ్‌లోనూ దాదాపుగా అదే ప‌రిస్థితి కొన‌సాగింది. ఆట మ‌రికాసేప‌ట్లో ముగుస్తుంద‌న‌గా వేల్స్ గోల్ కీప‌ర్ వేన్ హెన్నెస్సీ అత్యుత్సాహం ఆ జ‌ట్టు కొంప ముంచింది. ప్ర‌త్య‌ర్థి ఆట‌గాడిని అడ్డుకునే విష‌యంలో కాస్త దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో రిఫ‌రీ అత‌డికి రెడ్ కార్డు చూయించాడు. దీంతో వేల్స్ 10 మంది ఆట‌గాళ్ల‌తోనే మ్యాచ్ కొన‌సాగించింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌త్య‌ర్థికి ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. నిర్ణీత స‌మ‌యం ముగిసే స‌మ‌యానికి ఇరు జ‌ట్లు ఒక్క గోల్ కూడా చేయ‌లేక‌పోయాయి. అద‌న‌పు స‌మ‌యంలోనూ గోల్ చేయ‌డంలో విఫ‌లం కావ‌డంతో ఇక మ్యాచ్ దాదాపు డ్రా అనుకుంటున్న త‌రుణంలో ఇరాన్ ఆట‌గాళ్లు అద్భుతం చేశారు. 90+9 నిమిషంలో ఇరాన్ ప్లేయర్ రూజ్‌బే చేష్మీ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించి ఖాతా తెరువ‌గా మరో రెండు నిమిషాల వ్యవధిలోనే ఆ ఆనందాన్ని డబుల్ చేస్తూ మరో ఇరాన్ ప్లేయర్ రామిన్ రిజయాన్ గోల్ కొట్టాడు. దీంతో ఇరాన్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ లోగా అద‌న‌పు స‌మ‌యం ముగియ‌డంతో మ్యాచ్ ఇరాన్ సొంతమైంది. త‌మ తొలి మ్యాచ్‌లో 6-2 తేడాతో ఇరాన్ ఓడిపోయింది. దీంతో ఈ టోర్నీలో ముందు అడుగువేయాలంటే ఈ మ్యాచ్‌లో త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితిలో గెలిచి రౌండ్ ఆఫ్ 16 ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది.

మియావ్ మియావ్ పిల్లి.. సెంచరీ నాటౌట్?!

ఈ ఫొటోలో కనిపిస్తున్న పిల్లి వయస్సు 120 సంవత్సరాలు. నమ్మ లేకపోతున్నారు కదా! కానీ నమ్మక తప్పదు.  ఎందుకంటే ప్రపంచంలోనే అతి ఎక్కువ కాలం జీవించిన పిల్లిగా దీనికి గన్నిస్ బుక్ ఆప్ రికార్డ్స్ లో స్థానం లభించింది. ఈ పిల్లి బతికిన వయస్సును మనుషుల వయస్సుతో పోలిస్తే 120 ఏళ్లు అందుకే ఈ పిల్లి వయస్సు 120 ఏళ్లు అని చెబుతారు. వాస్తవానికి ఈ మార్జాలం 26 ఏళ్ల కిందట పుట్టింది. ఏ పిల్లైనా సరే మహా బతికితే ఓ 18 ఏళ్లు బతుకుతుంది. అలాంటిది ఈ పిల్లి 26 ఏళ్లుగా జీవిస్తూ ప్రపంచంలోనే అతి ఎక్కువ వయస్సున్న పిల్లిగా గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. మనుషుల జీవన ప్రమాణంతో పోల్చి చెప్పుకోవాలంటే..దీని వయస్సు ఇప్పుడు 120 ఏళ్లుగా చెప్పాలి.పిల్లి సగటు వయస్సును మించి ఇప్పటికే ఇది పదేళ్లు ఎక్కువగా బతికేసింది. ఈ

రేవంత్ సొంత అజెండాతో భవిష్యత్ కార్యాచరణ.?

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉంది. ఆ పార్టీ రాస్ట్ర నాయకుడిగా ప్రజాకర్షణ శక్తి ఉన్న యువనేత రేవంత్ రెడ్డి ఉన్నారు. అన్నీ ఉన్నా అదేదో అన్నట్లు.. కాంగ్రెస్ తనకున్న మద్దతులు ఓట్లుగా మలచుకోవడంలో మాత్రం విఫలమౌతోంది. ఇందుకు నేతల మధ్య విభేదాలు, గ్రూపుల ఘర్షణలూ కరణమే అయినా అది ఒక్కటే కారణం కాదు. రాష్ట్ర విభజనకు ముందు వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉందనడంలో సందేహం లేదు. అంతెందుకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందంటే అందుకే తెరాస సుదీర్ఘ ఉద్యమమొక్కటే కారణం కాదు. కేంద్రంలో అప్పటికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా విస్మరించడానికి వీలులేని ఒక కారణమే. కేంద్రం ఆమోదం లేకుండా రాష్ట్రం ఆవిర్బవించే అవకాశమే లేదు. తెలంగాణ కంటే ఉవ్వెత్తున ఎగసిన గూర్ఖాలాండ్ వంటి ఉద్యమాలు విజయవంతం కాకపోవడమే ఇందుకు ఉదాహరణ. ఇక తెలంగాణ విషయానికి వస్తే అప్పట్లో అధిష్ఠానాన్ని తెలంగాణకు అనుకూలంగా అంగీకరించేలా చేయడంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వాన్ని విస్మరించడం సాధ్యం కాదు. సరే అన్నీ కలిసి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇందు కోసం కాంగ్రెస్ అధిష్ఠానం ఏపీలో పార్టీ కాడెను వదిలేసింది. ఏకంగా ఆ రాష్ట్రంలో పార్టీ శూన్యంగా మిగిలిపోతుందని తెలిసీ త్యాగానికి సిద్ధపడింది. ఆ మేరకు తెలంగాణలో పార్టీ బలోపేతం అవుతుందని అంచననా వేసింది. తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావానికి క్రెడిట్ అంతా తెరాస ఖాతాలో పడింది. అప్పటి నుంచీ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి తిరోగమనం నుంచి తిరోగమనంగా తయారైంది. ఈ పరిస్థితిలో  రాష్ట్ర విభజన తరువాత తన రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని అనివార్యంగా హస్తం గూటికి చేరిన నేత రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ హై కమాండ్.   కేవలం ఒక రాజకీయ పార్టీలో వంద మంది నేతలలో ఒకరిగా మిగిలిపోయు వ్యక్తిత్వం కాదు రేవంత్ రెడ్డిది. తనదైన ప్రత్యేకత, రాజకీయ వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. తెలుగుదేశం పార్టీలో  కూడా రేవంత్ రెడ్డి ఆ పార్టీలో ప్రత్యేకత ఉన్న ముఖ్య నేతగా ఎదిగారు. 2009 ఎన్నికల సమయంలో తన ప్రచారంతో రాష్ట్రాన్ని ఉర్రూతలూగించిన జూనియర్ ఎన్టీఆర్ కు ప్రసంగాలు చేయడంలో శిక్షణ ఇచ్చినది రేవంత్ రెడ్డే అని చెబుతారు. అలాంటి వ్యక్తి  రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ తెలుగుదేశం దాదాపుగా నిర్వీర్యమైపోయిందన్న భావనతో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ లోనూ తన ప్రత్యేకత చాటుకుని పలువురు సీనియర్లను అధిగమించి మరీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మాత్రం ఆయన పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు చందంగా సాగుతోంది. వాస్తవానికి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత గత ఎనిమిదేళ్లుగా ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. యువత పార్టీ వైపు ఎక్కువగా దృష్టి సారించింది. క్షేత్ర స్థాయిలో క్యాడర్ లో ఉత్సాహం ఉరకలేసింది. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరో వైపు రేవంత్ పార్టీ పటిష్టత దిశగా వేసే ప్రతి అడుగునూ అడ్డుకోవడానికి కాంగ్రెస్ లోని ఆయన వ్యతిరేకులు అడుగడుగునా అడ్డం పడ్డారు. ఆయన ఒక అడుగు ముందుకు వేస్తే.. వారు రెండడుగులు వెనక్కు వేసి పార్టీ పురోగతికి అవరోధంగా నిలిచారు.  ఈ అవరోధాలను అధిష్ఠానం అండతో అధిగమించి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో ఆయన అడుగులు వేసినప్పటికీ.. మునుగోడు ఉప ఎన్నికల ఫలితం తరువాత ఆయనకు కూడా తత్వం బోధపడింది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు బయటి శత్రువులు కంటే ఇంటి శత్రువులే ఎక్కువ అన్న నిర్దారణకు వచ్చిన ఆయన ఇప్పుడు తన భవిష్యత్ కార్యాచరణపై సీరియస్ గా దృష్టి పెట్టారు. రేవంత్ రెడ్డి  సన్నిహితుల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రావడం అన్న మిషన్ ను పక్కన పెట్టి రేవంత్ రాష్ట్రంలో ఓ పాతిక నియోజకవర్గాలపై సీరియస్ గా దృష్టి సారిస్తారు. ఆ పాతిక నియోజకవర్గాలలోనే అధిష్ఠానాన్ని ఒప్పించి తన వర్గం వారికి పార్టీ టికెట్లు సాధిస్తారు. వాటిలో తన వారిని గెలిపించుకోవడంపైనే దృష్టిసారిస్తారు.  అలా గెలిపించుకున్న పాతిక మంది ఎమ్మెల్యేలతో రాష్ట్ర రాజకీయాలలో బలమైన శక్తిగా రేవంత్ అవతరించే అవకాశాలున్నాయంటున్నారు. మరో వైపు  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కాసాని జ్ణానేశ్వర్ తెలంగాణ తెలుగుదేశం సారథ్య బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు రానున్న జోరందుకోనున్నాయన్న అంచనాలున్నాయి. సెటిలర్స్ అధికంగా ఉన్ననియోజకవర్గాలతో పాటు మరి కొన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం అభ్యర్థులు గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాని పరిస్థితి ఏర్పడుతుందనీ, హంగ్ అనివార్యమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ గా రేవంత్ అవసరిస్తారని అంటున్నారు. ఆ వ్యూహంతోనే రేవంత్ అడుగులు పడుతున్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.