చిరంజీవికి ప్రధాని మోడీ ప్రశంసలు
posted on Nov 21, 2022 @ 3:51PM
సినీ రంగానికి చేసిన సేవలకు గాను మెగాస్టార్ చిరంజీవిని అరుదైన ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్- 2022’ అవార్డు వరించింది. గోవాలో జరుగుతున్న 53వ ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ వేడుకల్లో 2022కి చిరంజీవికి ఈ అవార్డును కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ ప్రకటించారు. దీంతో ప్రధాని మోడీ సహా పలువురు చిరంజీవిని ప్రశంసలతో ముంచెత్తుతూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఈ మేరకు తాజాగా తెలుగులో ట్వీట్ చేసిన మోడీ.. చిరంజీవి వ్యక్తిత్వాన్ని, నటనా సామర్ధ్యాలను అభినందించారు. ‘చిరంజీవి విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్ని, ఆదరణనూ చూరగొన్నారు. గోవాలో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఆయనకు అభినందనలు’ అంటూ చిరంజీవిని ట్యాగ్ చేస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మోడీ ట్వీట్ చేసిన కాసేపటికే చిరంజీవి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇలాంటి మంచి మాటలు చెప్పిన గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కృతజ్ఞతలు’అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇంతకు ముందే ఈ అవార్డు విషయం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్కి ధన్యవాదాలు చెబుతూ చిరంజీవి మరో ట్వీట్చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ట్విట్టర్ వేదికగా చిరంజీవికి అభినందనలు తెలిపారు.
ఇక చిరంజీవి సోదరుడు, పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవికి అవార్డు పట్ల స్పందించారు. ‘నాలుగు దశాబ్దాలు పైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలుచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం తనతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తికిరీటంలో చేరిన మరొక వజ్రం. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’ అని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా చిరంజీవిపై తన భక్తిని చాటుకున్నారు. ‘ధర్మం తెలిసిన ధర్మాత్ముడు, న్యాయం తెలిసిన న్యాయకోవిదుడు, మంచితనానికి మారుపేరు, మానవత్వం ఇంటిపేరు, అందరికీ నేనున్నా అనే మా అన్న మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు’ అని బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. తండ్రి చిరంజీవికి దక్కిన ఈ అరుదైన గౌరవానికి ఆయన తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే.. మరింతగా మురిసిపోయారు. ‘53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’గా నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అప్పా- నిజంగా ఎంతో గర్వంగా ఉంది. మీరు ఎప్పటికీ అందరికీ స్ఫూర్తిదాయకమే’ అంటూ రామ్ చరణ్ ఆనందంతో సంబరపడిపోయారు.
ఎటువంటి సినిమా నేపథ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టిన చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు టాలీవుడ్ కు గాడ్ ఫాదర్ గా గౌరవం పొందుతున్నారు. సుమారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో 150కి పైగా సినిమాల్లో నటించిన చిరంజీవి ఇప్పటికి ఇంకా వెండితెరపై తన హవా కొనసాగిస్తున్నారు. గతంలో ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని చిత్రరంగం నుంచి అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, ఇళయరాజా, బాలసుబ్రహ్మణ్యం, వహీదా రెహమాన్, సలీమ్ ఖాన్, బిశ్వజిత్ ఛటర్జీ, హేమమాలిని, ప్రసూన్ జోషి లాంటి ప్రముఖులు అందుకున్నారు.