గుజరాత్ లో రెండో స్థానం కోసమేనా కేజ్రీవాల్ పోరాటం?
posted on Nov 21, 2022 @ 9:46AM
గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెల 1,5 తేదీలలో రెండు విడతలలో ఎన్నికలు జరగనున్నాయి. గత ఆరు దఫాలుగా గుజరాత్ లో బీజేపీ తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తోంది. వరుసగా ఏడో సారి కూడా విజయం ఖాయమన్న ధీమానూ వ్యక్తం చేస్తోంది. అయితే ఈ సారి గుజరాత్ లో బీజేపీకి విజయం నల్లేరు మీద బండి నడక ఎంతమాత్రం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ సారి గుజరాత్ లో బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఏదైనా ఉందంటే.. అది రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోటీలో ఉండటమేనంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలలో ఆప్, గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ చాలా చాలా బలంగా పుంజుకున్నాయి. గుజరాత్ ఎన్నికలపై సర్వేలన్నీ.. ఇదే విషయాన్ని ప్రస్ఫుటంగా తేల్చేశాయి.
లోక్ నీతి -సి.ఎస్.డి.ఎస్. సర్వే మాత్రం ఆప్ గట్టి పోటీ ఇస్తుండటంతో కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లన్నీ ఆ పార్టీ వైపు మళ్లిపోతాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ కు ఎంత గట్టి పట్టు ఉన్నా.. దానిని ఓట్ల రూపంలో మరచుకునే వ్యూహాలూ, ప్రచారంలో కాంగ్రెస్ బాగా వెనుకబడిందంటున్నారు. రాహుల్ జోడో యాత్రలో ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ కు స్థానం లేకపోవడంపై పార్టీలో పెల్లుబికిన అసంతృప్తి కారణంగా చివరి నిముషంలో ఆయన పాదయాత్ర రూట్ మ్యాప్ లో గుజరాత్ ను చేర్చినప్పటికీ, అప్పటికే ఆలస్యమైపోయిందంటున్నారు.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 41.4 శాతం ఓట్లు దక్కాయి. 77 స్థానాలలో విజయం సాధించి, ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. కానీ ఈ సారి ఆ సీన్ లేదంటోంది లోక్ నీతి సర్వే. ఆ సర్వే ప్రకారం గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారిందంటోంది. ఆ పార్టీకి రానున్న ఎన్నికలలో వచ్చే ఓట్లలో ఎక్కువ భాగం కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లేనని చెబుతోంది. గతంలో పరిశీలకులు సైతం ఇదే రీతిలో విశ్లేషణలు చేసిన సంగతి విదితమే. అంటే కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లలో కనీపం 20 శాతం ఆప్ కు మరలి పోయినా ఆశ్చర్యంలేదని సర్వే అంటోంది.
అంటే ఈ సారి కాంగ్రెస్ కు గతంలో వచ్చిన ఓట్ల శాతం గణనీయంగా తగ్గిపోతుందని లోక్ నీతి సర్వే పేర్కొంటోంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలో కాకుండా ఆప్ ఖాతాలో పడే అవకాశాలే ఎక్కవ ఉన్నాయంటోంది. అంటే ఆప్ ప్రభావం వల్ల బారీగా నష్టపోయేది కాంగ్రెస్సేనన్నది సర్వే సారాంశం. దీంతో ఈ సారి ఎన్నికలలో గుజరాత్ లో కాంగ్రెస్ కు కనీసం రెండో స్థానం కూడా దక్కే అవకాశం లేదన్నది లోక్ నీతి సర్వే సారాంశం.
గుజరాత్ లో ఆప్ అంతగా పుంజుకున్నా.. అధికారాన్ని చేపట్టే పరిస్థితి అయితే లేదని.. కానీ కాంగ్రెస్ అవకాశాలను మాత్రం భారీగా గండి కొడుతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి కేజ్రీవాల్ వ్యూహం కూడా అదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ మరో సారి అధికారంలోకి వచ్చినా సరే కానీ రాష్ట్రంలో రెండో స్థానంలో ఆప్ ఉండాలన్న వ్యూహంతో కేజ్రీవాల్ ఉన్నారని అంటున్నారు.