భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు..బీహార్ లో12 మంది దుర్మరణం
posted on Nov 21, 2022 @ 10:14AM
బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా ఓ ఆలయం బయట పూజలు చేస్తున్న భక్తులపైకి ట్రక్కు దూసుకెళ్లిన సంఘటనలో 12 మంది అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
వైశాలీ జిల్లాలోని హాజీపూర్ ప్రధాన రహదారి పక్కనున్న ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఆలయంలో స్థలం సరిపోకపోవడంతో కొందరు ఆలయం బయట ఉన్న రావి చెట్టు వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఒక ట్రక్కు అదుపు తప్పి వారిపైకి దూసుకొచ్చింది. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి జరిగింది.
ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా ఈ దుర్ఘటన పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఈ దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతేల కుటుంబాలకు ప్రగాఘ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.