రస్నా ఫౌండర్ కన్నుమూత
posted on Nov 21, 2022 @ 11:03PM
ఐలవ్యూ రస్నా.. ఈ ప్రకటన ఎంత ప్రాచుర్యం పొదిందంటే.. అప్పట్లో చిన్నారులందరి నోటా ఇదే వినిపించేది. మండు వేసవిలో చల్లటి పానియం అంటే అప్పట్లో ఏకైక ఆప్షన్ రస్నానే. అప్పట్లో రస్నా సాఫ్ట్ డ్రింక్ కి ఉన్నడిమాండ్, ఫేమే వేరప్పా అన్నట్లుండేది. అలాంటి రస్నాఫౌండర్ అరీజ్ ఫిరోజ్ షా శనివారం (నవంబర్ 19) కన్నుమూశారు.
రస్నా కంపెనీ ఈ విషయాన్ని ఆదివారం (నవంబర్ 20) ఒక ప్రకటనలో పేర్కొంది. మండు వేసవిలో చల్లని పానియాన్ని తాగాలనుకునే మధ్య తరగతి జీవులకు రస్నా ఏకైక ఆప్షన్ గా మారింది. తక్కువ ధరకే మంచి మంచి ఫ్లేవర్లతో ఇంటిల్లిపాదీ చల్లని సాఫ్ట్ డ్రింక్ తాగేందుకు అవకాశం కల్పించింది రస్నా.
అప్పట్లో ఇళ్లల్లో కాఫీ టీలు మానేసి రస్నా వైపే మొగ్గు చూపేవారంటే అతి శయోక్తి కాదు. తొలుత ఆరెంజ్ ఫ్లేవర్ తో మార్కెట్లోకి వచ్చిన ఈ సాఫ్ట్ డ్రింక్.. క్రమంగా రకరకాల ఫ్లేవర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తరువాత తరువాత సాఫ్ట్ డ్రింక్స్ లో ఎన్నిరకాల కంపెనీలు వచ్చినా రస్నా మాత్రం తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. అరీజ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.