తుమ్మల దారెటు?
posted on Nov 21, 2022 @ 9:22PM
తెరాసలో ఇప్పుడు ఎవరికీ పట్టని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాత్రమే. తుమ్మల అంటే ఆషామాషీ వ్యక్తేం కాదు. సీఎం కేసీఆర్ తనంత తానుగా స్వయంగా టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. గత ఎన్నికల నాటి వరకూ తుమ్మల మాటే ఖమ్మం వ్యాప్తంగా చెల్లుబాటు అయ్యేది. అయితే 2018 ఎన్నికలలో తుమ్మల పాలేరు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
దాంతో ఆయన హవా పార్టీలో బాగా తగ్గింది. కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తుమ్మల నాగేశ్వరరావుపై గత ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం ఆయన కేసీఆర్ సమక్షంలో అధికార పార్టీలో చేరారు. అప్పటి నుంచి పాలేరు నియోజకవర్గంలో తుమ్మల వర్సెస్ కందాల అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. కందాలకు ఉమ్మడి జిల్లాలోని మిగిలిన అధికార పార్టీ నాయకుల మద్దతు ఉండటంతో తుమ్మల ఏకాకిగా మిగిలిపోయారు. ఖమ్మం జిల్లా నుంచి మంత్రి హోదాలో పువ్వాడ, పార్లమెంటరీ నేతగా నామా, ఎమ్మెల్యేలు రేగా, సండ్రలతో పాటు అందరికీ టచ్‌లో ఉంటున్న కేసీఆర్.. తుమ్మలను దూరం పెట్టారు. రెండేళ్ల క్రితం వరకు జిల్లా రాజకీయాల్లో చక్రంతిప్పిన తుమ్మల ప్రస్తుతం పార్టీలో ఎవరికీ పట్టని వ్యక్తిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
కొన్నేళ్లుగా జిల్లా రాజకీయాలను కంటిచూపుతో శాసించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. టీఆర్ ఎస్‌లో ఉన్న తుమ్మలను జిల్లాలో ఏకాకిని చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు నిదర్శనం ఇటీవల సత్తుపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుల సన్మాన సభ జరిగింది. ఈ సన్మాన సభకు తుమ్మల మినహా అధికార పార్టీలోని అన్ని ప్రాంతాల నేతలు పాల్గొన్నారు. తుమ్మలకు కనీసం ఆహ్వానం కూడా అందలేదని తెలుస్తోంది.
ఇందుకు కారణం పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డేనన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇటీవల తుమ్మల ఆత్మీయ సమ్మేళనం అంటూ హడావుడి చేసినా మళ్లీ ఎందుకో సైలంట్ అయిపోయారు. అయితే తుమ్మల త్వరలో కారు దిగిపోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. కమలం గూటికి చేరుతారా.. సైకిలెక్కుతారా అన్న చర్చ అయితే నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.