మైండ్ గేమ్ రాజకీయాలు... నాయకులను మించి ఓటర్లు!
posted on Nov 21, 2022 @ 2:26PM
తెలంగాణలో మైండ్ గేమ్ రాజకీయాలు జోరందుకున్నాయి. అయితే ఈ గేమ్ లో రాజకీయ నాయకులను మించి ఓటర్లు రాటుదేలిపోయారు. అంతే కాదు.. రాష్ట్రంలో నిత్యం రాజకీయ హీట్ కొనసాగాలని భావిస్తున్నారు. రోగీ వైద్యుడూ ఒకటే కోరారన్న సామెతలా.. తెలంగాణలో ఏదో ఒక అంశంతో రాజకీయాల వేడిని తగ్గకుండా రాజకీయ పార్టీలు రగిలిస్తూనే ఉన్నాయి.
జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఆసక్తి, బీఆర్ఎస్ పార్టీ ప్రకటన,ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలు, నేతల మధ్య మాటల తూటాలు, ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులు... నిరసనలు... ఆరోపణలు, ప్రత్యారోపణలు.. ఇలా రాష్ట్రంలో రాజకీయ హీట్ ను పెంచే సంఘటనలు ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి పడుతూనే ఉన్నాయి. ఇది వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు నిరంతరాయంగా కొనసాగే వాతావరణమే కనపడుతోంది. దీని వల్ల పాలన కుంటుపడటం తప్ప రాష్ట్రానికి కానీ, ప్రజలకు కానీ ఇసుమంతైనా ప్రయోజనం ఉండదు.
పోనీ.. రాజకీయ పార్టీలకైనా ప్రయోజనం ఉందా అంటే అదీ శూన్యమే. ఎందుకంటే రాజకీయ హీట్ కాదు ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పన, రాష్ట్రాభిభివృద్దితోనే మేలు జరుగుతుంది. రాజకీయాల్లో ఏ పార్టీ గెలిస్తే.. ఏముంది... షరా మామూలే. మాకేం జరుగుతుంది....? ఈ పార్టీ కాకపోతే.. ఆ పార్టీ..? ఆ పార్టీ కాకపోతే మరో పార్టీ...? ఏ పార్టీ గెలిచినా.. సమస్యలు తీరుతాయా..? కష్టాలు గట్టెక్కుతాయా..? ఇన్నేండ్ల నుంచి చూస్తూనే ఉన్నాం... నాయకులు మారారే తప్ప... సమస్యలు పరిష్కారమైన సందర్భం లేదు.. సంపన్నులున్న ప్రాంతాల్లో రోడ్లు, పార్కులు అందంగా వస్తాయి.. కానీ బస్తీల్లో.. మాటలు ప్రకటనలు తప్ప పురోగతి ఉండదు. అన్న నిర్ణయానికి జనం వచ్చేశారు.
అందుకే అన్ని నియోజకవర్గాల్లోనూ నాయకుల మధ్య రాజకీయాలు రుగులుతూ ఉంటేనే ప్రయోజనం అన్న భావనకు వచ్చేశారు. పోటీ ఎంత ఎక్కువగా ఉంటే.. ఎన్నికలు అంత ఖరీదుగా మారుతాయని జనం అంటున్నారు. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలే జనం ఈ మైండ్ సెట్ లోకి వచ్చినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు ఓ పార్టీ నుంచి మరో పార్టీకి మారడం, ఆ నియోజకవర్గంలో ఉపఎన్నిక రావడం.. ప్రధానంగా రెండు రాజకీయ పార్టీల నేతలకు అక్కడ గెలుపు ప్రతిష్టాత్మకం కావడం. ఫలితంగా ఉప ఎన్నిక అత్యంత ఖరీదుగా మారడంతో... ఈ నియోజకవర్గాల ఉపఎన్నికను గమనిస్తూ వస్తోన్న రాష్ట్ర ప్రజలు ప్రతినియోజకవర్గంలోనూ అలాగే జరగాలనే యోచన చేస్తున్నారని అంటున్నారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి నియోజకవర్గం ఒక మునుగోడులా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు.