చంపేస్తున్న చలి పులి... వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు
posted on Nov 21, 2022 @ 10:01AM
తెలుగు రాష్ట్రాలు వణుకుతున్నాయి. చలి పులి పంజా విసరడంతో తెలుగు రాష్ట్రాలు విలవిల లాడుతున్నాయి. గత ఏడెనిమిది రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. వీటికి తోడు చిరు జల్లులు. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రత సగటున 20 డిగ్రీల కంటే దిగువన నమోదౌతోంది.
దీనికి తోడు ఈశాన్య రుతుపవనాల రాక, తూర్పు దిశగా బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత తీవ్రంగా ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటగున్నారు. కొమరంభీం జిల్లాలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవగా.. మంచిర్యాల 12, ఆదిలాబాద్ 13, నిర్మల్ లో 13.5 డిగ్రీలు నమోదయ్యాయి.
ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురుస్తూ.. మధ్యాహ్నం వరకు సూర్యుడు కనిపించడం లేదు. ఏపీలోని అల్లూరి జిల్లాలో 10, పాడేరులో 12, అరకులోయలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.