ఏనుగును పెంచుకుంటున్నారా అంటూ బీజేపీ ఎమ్మెల్యేపై దాడి
posted on Nov 22, 2022 8:58AM
కర్నాటకలో జనం బీజేపీ ఎమ్మెల్యేపై దాడి చేశారు. దుస్తులు చిరిగిపోయి ఆయన అవమానభారంతో కుప్పకూలిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది ఎమ్మెల్యేను జనం బారి నుంచి కాపాడి తీసుకువెళ్లారు. ఈ ఘటన చిక్కమగుళూరులో జరిగింది.
కారణమేమిటంటే పొలంలో పనులు చేసుకోవడానికి వెళ్లిన ఒక మహిళ ఏనుగు దాడిలో చనిపోయింది. ఎన్ని సార్లు, ఎంత కాలంగా చెబుతున్నా ఏనుగుల బెడద నుంచి తమను కాపాడే విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ జనం మృతదేహంలో నిరసనకు దిగారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే కుమారస్వామి అక్కడకు వచ్చారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించబోయారు.
అయితే జనం ఆయనను అడ్డుకున్నారు. మీరేమైనా ఏనుగును పెంచుకుంటున్నారా? ఎన్ని సార్లు అడిగినా ఏనుగుల బెడద నుంచి మాకు రక్షణ కల్పించడం లేదంటూ వాగ్వాదానికి దిగారు. ఆ దశలో ఆగ్రహంతో ఆయనపై దాడికి దిగారు.
ఈ దాడిలో ఎమ్మెల్యే గాయపడ్డారు. ఆయన దుస్తులు చిరిగిపోయాయి. జనం బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఆయన పరుగులు పెట్టారు. ఆ దశలో పోలీసులు అతి కష్టం మీద జనం బారి నుంచి ఎమ్మెల్యేను కాపాడి అక్కడి నుంచి తీసుకుపోయారు.
కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు చుట్టుపక్కల గ్రామాల్లో ఏనుగుల స్వైర విహారం చేస్తున్నాయి. ఈ గజరాజులు జనవాస కేంద్రాలపై చేస్తున్న దాడుల్లో పలువురు గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారు. ఎనుగుల దాడుల నుంచి తమను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశారు. అటు ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఏనుగు దాడిలో మరో మహిళ మరణించడంతో గ్రామస్తులు ఆగ్రహం పట్టలేక ఎమ్మెల్యేపై దాడికి దిగారు.